breaking news
Khattar
-
వామ్మో.. ‘ఖతర్’నాక్ మోసం!
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ప్లస్ సంస్థ తరఫున ఖతర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల్ని నిండా ముంచారు. దీనిపై ఆ సంస్థ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట కేంద్రంగా పని చేసే ఏపీ ప్లస్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ఖతర్ బ్రాంచ్‌లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ప్రకటనలు చేశారు. అనేక మందిని ఫోన్లో ఇంటర్వ్యూలు కూడా చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. కొందరు బాధితులు ఖతర్‌లోని సంస్థ కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఇలా విషయం తెలుసుకున్న ఆ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆరా తీసిన ఇక్కడి అధికారులు నగరానికి చెందిన నలుగురికి అలాంటి లెటర్లు అందినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.13,500 చొప్పున వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు మరో రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఆ సంస్థ ప్రతినిధులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
పరదేశంలో పదేళ్లు నరకయాతన
దేవగుప్తం (అమలాపురం టౌన్) : పొట్టకూటికోసం పరాయిదేశానికి వెళ్లిన ఓ దళిత మహిళ అక్కడ ఓ షేక్ ఇంట వెట్టిచాకిరీ చేసింది. తన రెండో భార్య ఇంటి వద్ద కూడా చాకిరీ చేయాలని షేక్ ఆంక్షలు విధించడంతో అందుకు ఆమె నిరాకరించింది. ఫలితంగా ఆ మహిళ పాస్‌పోర్టు కాజేసి అష్టకష్టాల పాల్జేశాడు ఆ షేక్. భర్త చనిపోయినా కనీసం కడచూపునకు నోచుకోలేకపోయింది. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ, ఆ దేశంలోని భారత రాయబారి కార్యాలయ చొరవతో ఆమె ఎట్టకేలకు పదేళ్ల నరకయాతన అనంతరం సొంతగడ్డకు చేరుకుంది. అల్లవరం మండలం దేవగుప్తం శివారు పెద ఆంధ్రపేటకు చెందిన వ్యవసాయ కూలీ ఉప్పే సత్యవతి 2005లో ఉపాధి కోసం అప్పులు చేసి దోహా ఖత్తర్ వెళ్లి ఓ షేక్ ఇంట పనికి చేరింది. ఇంతలో ఆ షేక్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. రెండో పెళ్లి చేసుకున్నాడు. తన వద్ద పనిమనిషిగా కుదిరిన సత్యవతిని రెండో భార్య ఇంట్లోనూ చాకిరీ చేయాలని రాచిరంపానపెట్టాడు. అయితే షేక్ మొదటి భార్య మంచిది కావడంతో ఆమె వద్దే ఉండేందుకు సత్యవతి ఆసక్తి చూపింది. ఇందుకు ఆగ్రహించిన షేక్ సత్యవతి పాస్‌పోర్టు కాజేసి వెళ్లిపోయాడు. స్వదేశానికి వచ్చే ఆధారం కోల్పోవడంతో సత్యవతి అతనిని పాస్‌పోర్టు కోసం ప్రాధేయపడింది. అతని మనసు కరగలేదు. ఎందరికో గోడు వెళ్లబోసుకుంది. ఫలితం శూన్యం. 2005లో ఆమె వెళ్లినప్పుడు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, భర్తను వదిలి వెళ్లింది. పదేళ్లుగా వారంతా ఎలా ఉన్నారో.. కళ్లారా చూసే అవకాశం లేక కుమిలిపోయింది. తరచూ షేక్ వద్దకు వెళ్లి తనను క్షమించాలని, పాస్‌పోర్టు ఇచ్చి మా ఊరుకు పంపించాలని వేడుకుంది. సత్యవతి దీనావస్థను చూసి షేక్ మొదటి భార్య పాస్‌పోర్టు కోసం తనవంతు యత్నాలు చేసి విఫలమైంది. ఆదేశంలో వర్కరు ఐడీ కార్డు లేకుండా పనిచేయడం తీవ్రమైన గూఢచర్య నేరం కాబట్టి దొరకకుండా కూడా సత్యవతి నానా పాట్లు పడింది. భర్త మరణ వార్త విని.. ‘మిమ్మల్నందరినీ చూడాలనిపిస్తున్నా పాస్‌పోర్టు లేక రాలేకపోతున్నా’నని సత్యవతి తరచూ కుటుంబ సభ్యుల వద్ద ఫోన్లో ఆవేదన వ్యక్తం చేసేది. ఆమె భర్త అర్జునరావు భార్య ఎంతకీ రాకపోవడంతో మనోవేదనకు గురై బీపీ షుగరుతో మంచానపడ్డాడు. చివరకు ఈ ఏడాది జనవరి 10న మరణించాడు. ఈ వార్త ఫోన్లో తెలుసుకుని సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే వచ్చేదారిలేక గుండెల్లోనే బాధను భరించింది. స్పందించిన సామాజిక కార్యకర్త అమలాపురానికి చెందిన సామాజిక కార్యకర్త గాబ్రియేలుకు సత్యవతి కుటుంబ సభ్యులు విషయాన్ని చెప్పారు. దీంతో గాబ్రియేలు ఆ దేశ ప్రభుత్వానికి , అక్కడి భారత రాయబారి కార్యాలయానికి, హైదరాబాద్‌లోని మైగ్రేడ్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.భీమారెడ్డికి సమాచారం అందించారు. సత్యవతి వర్కర్ ఐడీ లేకుండా ఇన్నేళ్లు ఆ దేశంలో గడపడం అక్కడి చట్టాల ప్రకారం నేరం. ఇందుకు తొమ్మిదేళ్లు శిక్షపడుతుంది. అయితే అక్కడ భారత రాయబారి, తెలుగు దౌత్యాధికారిణి అనుపమ మానవతాదృక్ఫథంతో స్పందించారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. దీంతో సత్యవతికి కేవలం నాలుగు రోజుల సాధారణ శిక్ష విధించారు. అనంతరం అధికారి అనుపమ కొత్తగా పాస్‌పోర్టు చేయించి సత్యవతిని భారతదేశానికి పంపారు. ఎదిగిన పిల్లలను చూసి ఉద్వేగానికి గురైన క్షణం 2005లో చిన్నపిల్లలను వదిలి వెళ్లిన సత్యవతి తిరిగి వచ్చి పెద్దవాళ్లైన వారిని చూసి ఉద్వేగానికి గురైంది. పిల్లల ఆలనాపాలనా దగ్గరుండి చూడలేకపోయానని ఆమె బాధపడినా ఇద్దరు కుమార్తెలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో కనిపించడంతో సంతోష పడింది. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టింది. ఆనందభాష్పాలతో పరవశించిపోయింది. భర్త మరణించడం ఒక్కటే తనను తీవ్రంగా కలిచివేసిందని, నా ప్రాణం అక్కడే పోతుందనుకున్నాననని, భగవంతుడు మళ్లీ మనల్ని కలిపాడని కూతుళ్లు, కొడుకు, మనవళ్లను కౌగిలించుకుని విలపించింది. తనను స్వదేశానికి రప్పించడంలో చొరవ చూపిన సామాజిక కార్యకర్త గాబ్రియేలుకు చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది.