breaking news
Kalyani Raffel Advanced System
-
కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ నుంచి సుమారు రూ.685 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. ఇందులో భాగంగా బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కోసం 1,000 కిట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని రఫేల్.. బీడీఎల్‌కు అప్పగిస్తుంది. బీడీఎల్‌లో తుదిమెరుగులు దిద్దుకుని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చేరతాయి. గురువారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రఫేల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పిని యంగ్మన్ చేతుల మీదుగా కళ్యాణి గ్రూప్ చైర్మన్ బాబా కళ్యాణి ఈ మేరకు ఆర్డరు పత్రాలను అందుకున్నారు. రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి గ్రూప్ సంయుక్తంగా కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ఈ కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. 2017 ఆగస్టులో ఈ ప్లాంటు ప్రారంభమైంది. మరో తయారీ కేంద్రం.. హైదరాబాద్ సమీపంలో మరో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బాబా కళ్యాణి వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఎంత పెట్టుబడి, ఏ సమయంలోగా పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేనని వివరించారు. అయితే 100 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. భారత్‌తోపాటు పొరుగు దేశాలకు ఇక్కడి నుంచి ఉత్పత్తులను సరఫరా చేస్తామన్నారు. దేశీయంగా తయారీకి అవసరమైన టెక్నాలజీని రఫేల్ సమకూరుస్తోందని చెప్పారు. ప్రైవేటు రంగంలో కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారత్‌లో తొలి మిస్సైల్ తయారీ కేంద్రమని పిని యంగ్మన్ గుర్తు చేశారు. ఇక్కడి కేంద్రంలో ఇంటర్‌సెప్టార్స్, మిస్సైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రూ.3,400 కోట్ల విలువైన స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ను రఫేల్ నుంచి కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ డీల్ రద్దు అయినట్టు వస్తున్న వార్తల్లో నిజమెంత అని పినియంగ్మన్ను సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి ప్రశ్నించగా.. దీనిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
రక్షణ, ఎలక్ట్రానిక్ రంగాలకు హబ్‌గా హైదరాబాద్
► పెట్టుబడులకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలం ► కల్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షణ, ఎలక్ట్రానిక్ రంగాలక్కూడా హైదరాబాద్‌ను హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఇక్కడి వాతావరణం చాలా అనుకూలం, సురక్షితమన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల పరిధిలో ఉన్న హార్డ్‌వేర్ పార్క్‌లో గురువారం కల్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్‌ను (క్రాస్) మంత్రి కేటీఆర్ జ్యోతి వెలిగించి ఆరంభించారు. ఇజ్రాయిల్‌కు చెందిన రఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ సంయుక్తంగా క్రాస్‌ను ఏర్పాటు చేశాయి. ఇది దేశంలో తొలిసారిగా ప్రైవేటు రంగంలో మిస్సైల్స్ తయారు చేసే యూనిట్ కావడం విశేషం. రూ.60 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ యూనిట్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌ని తయారు చేస్తారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో నగరం ఇప్పటికే దృఢంగా ఉందని, స్వాతంత్య్రం తరవాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం నుంచే ఇక్కడ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లు, పరిశోధన కేంద్రాల స్థాపన మొదలుపెట్టిందని గుర్తుచేశారు. బీడీఎల్, డీఆర్డీఎల్, డీఆర్డీఓ, ఆర్సీఐ తదితర పరిశోధన కేంద్రాల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా ఉన్న రక్షణ రంగంలో 30 వేలకుపైగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు.వైమానిక రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే మూడు కంపెనీలు విడిభాగాల తయారీ కార్యకలాపాలను సాగిస్తున్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినియోగించే హెలికాప్టర్ బాడీ హైదరాబాద్‌లోనే తయారైందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికే ఇజ్రాయిల్ దేశం వ్యవసాయం, ఎలక్ట్రానిక్, నీటి వినియోగం తదితర అంశాల్లో స్ఫూర్తిగా నిలిచిందని, ఆ దేశం నుంచి తాము ఎన్నో నేర్చుకున్నామని తెలిపారు. దేశంలో టీఎస్ ఐపాస్ ఆదర్శంగా నిలిచిందని చెప్పిన ఆయన.. పాలసీ గురించి వివరించారు. ఇజ్రాయిల్ రాయభారి హెచ్ఈ డేనియల్ కార్మెన్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా విజన్‌లో తమ దేశం కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణి గ్రూప్ చైర్మన్ బాబా ఎన్.కల్యాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పది నెలల కాలంలోనే క్రాస్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంస్థ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 90 శాతానికి పైగా స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.