రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలకు హబ్‌గా హైదరాబాద్‌ | Hyderabad is the hub for defense and electronic sectors | Sakshi
Sakshi News home page

రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలకు హబ్‌గా హైదరాబాద్‌

Aug 4 2017 1:24 AM | Updated on Sep 17 2017 5:07 PM

రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలకు హబ్‌గా హైదరాబాద్‌

రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలకు హబ్‌గా హైదరాబాద్‌

రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలక్కూడా హైదరాబాద్‌ను హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు.

► పెట్టుబడులకు ఈ ప్రాంతం  ఎంతో అనుకూలం
► కల్యాణి రఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌


సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షణ, ఎలక్ట్రానిక్‌ రంగాలక్కూడా హైదరాబాద్‌ను హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఇక్కడి వాతావరణం చాలా అనుకూలం, సురక్షితమన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల పరిధిలో ఉన్న హార్డ్‌వేర్‌ పార్క్‌లో గురువారం కల్యాణి రఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ను (క్రాస్‌) మంత్రి కేటీఆర్‌ జ్యోతి వెలిగించి ఆరంభించారు. ఇజ్రాయిల్‌కు చెందిన రఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్, కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ సంయుక్తంగా క్రాస్‌ను ఏర్పాటు చేశాయి. ఇది దేశంలో తొలిసారిగా ప్రైవేటు రంగంలో మిస్సైల్స్‌ తయారు చేసే యూనిట్‌ కావడం విశేషం. రూ.60 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ యూనిట్‌లో యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌ని తయారు చేస్తారు.

ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో నగరం ఇప్పటికే దృఢంగా ఉందని, స్వాతంత్య్రం తరవాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం నుంచే ఇక్కడ డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, పరిశోధన కేంద్రాల స్థాపన మొదలుపెట్టిందని గుర్తుచేశారు. బీడీఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఆర్‌సీఐ తదితర పరిశోధన కేంద్రాల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వేదికగా ఉన్న రక్షణ రంగంలో 30 వేలకుపైగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు.వైమానిక రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే మూడు కంపెనీలు విడిభాగాల తయారీ కార్యకలాపాలను సాగిస్తున్నాయని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వినియోగించే హెలికాప్టర్‌ బాడీ హైదరాబాద్‌లోనే తయారైందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పటికే ఇజ్రాయిల్‌ దేశం వ్యవసాయం, ఎలక్ట్రానిక్, నీటి వినియోగం తదితర అంశాల్లో స్ఫూర్తిగా నిలిచిందని, ఆ దేశం నుంచి తాము ఎన్నో నేర్చుకున్నామని తెలిపారు. దేశంలో టీఎస్‌ ఐపాస్‌ ఆదర్శంగా నిలిచిందని చెప్పిన ఆయన.. పాలసీ గురించి వివరించారు. ఇజ్రాయిల్‌ రాయభారి హెచ్‌ఈ డేనియల్‌ కార్మెన్‌ మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియా విజన్‌లో తమ దేశం కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణి గ్రూప్‌ చైర్మన్‌ బాబా ఎన్‌.కల్యాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పది నెలల కాలంలోనే క్రాస్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంస్థ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 90 శాతానికి పైగా స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement