breaking news
Junior Swimming Championship
-
మెరిసిన తెలంగాణ స్విమ్మర్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు అదరగొట్టారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో తెలంగాణ స్విమ్మర్లు ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు సాధించారు. బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మైలారి సుహాస్ ప్రీతమ్ బంగారు పతకం గెలిచాడు. సుహాస్ 57.33 సెకన్లలో గమ్యానికి చేరి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేయడంతోపాటు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాగి శ్రీనిత్య రజత పతకం... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో అనిక దెబోరా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్: 1. సుహాస్ ప్రీతమ్ మైలారి (తెలంగాణ; 57.33 సెకన్లు), 2. అమన్ అభిజిత్ (కర్ణాటక; 58.35 సెకన్లు), 3. సమర్థ్ ప్రణవ్ జోషి (కేరళ; 59.86 సెకన్లు). బాలికల 400 మీటర్ల మెడ్లే: 1. థాన్య శాదక్షరి (కర్ణాటక; 5ని:11.93 సెకన్లు), 2. శ్రీనిత్య సాగి (తెలంగాణ; 5ని:19.15 సెకన్లు), 3. పావని సరయు నాదకుడితి (ఆంధ్రప్రదేశ్; 5ని:19.31 సెకన్లు). బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్: 1. విహిత నయన లోగనాథన్ (కర్ణాటక; 1ని:06.50 సెకన్లు), 2. ప్రియాన్షి మిశ్రా (కర్ణాటక; 1ని:07.60 సెకన్లు), 3. శ్రీనిత్య సాగి (తెలంగాణ; 1ని:08.37 సెకన్లు). బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. చరిత (కర్ణాటక; 26.04 సెకన్లు), 2. తిస్యా సోనార్ (కర్ణాటక; 27.86 సెకన్లు), 3. అనిక దెబోరా పరిపూర్ణం (తెలంగాణ; 28.02 సెకన్లు). -
లోహిత్‌కు మూడో స్వర్ణం
పుణే: జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ మూడో స్వర్ణాన్ని సాధించాడు. గురువారం జరిగిన గ్రూప్–1 బాలుర 50మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో లోహిత్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 100మీ., 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లలోనూ లోహిత్ పసిడి పతకాలను గెలుచుకున్నాడు. మరోవైపు గ్రూప్–4 బాలుర 50మీ. బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఏపీకే చెందిన ఎం. తీర్ధు సోమదేవ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలోనూ సోమదేవ్ విజేతగా నిలిచాడు. -
ఐశ్వి మథాయ్‌కు స్వర్ణ పతకం
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా అమ్మాయి ఐశ్వి మథాయ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. గ్రూప్–3 బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఐశ్వి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జి. కశ్యపి రెండో స్థానంలో నిలిచి రజతం, అరిబా అమెన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం ఈ పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.


