breaking news
Jahnavi Behal
-
అతడిని వ్యతిరేకిస్తే.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లేనా!
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వార్ జరుగుతోంది. ఒకవైపు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరోవైపు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని 15 ఏళ్ల అమ్మాయి జాహ్నవి బెహల్. విద్యాసంస్థలలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదంటూ కన్హయ్యను సవాలు చేసినందుకు ఇప్పుడు ఆ చిన్నారి మీద అనేక అభాండాలు మోపుతున్నారు, రకరకాల విమర్శలు చేస్తున్నారు. చివరకు ఆమె మీద 'ఆర్ఎస్ఎస్ ఏజెంటు' అని కూడా ముద్ర వేశారు. ఆమె పదోతరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయంలో ఇదంతా చేస్తున్నారు. తనకు ఏ వ్యక్తినీ లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం గానీ, ఒక రాజకీయ సిద్ధాంతాన్ని విమర్శించాలన్న ఉద్దేశం గానీ లేవని జాహ్నవి స్పష్టం చేసింది. కన్హయ్య లేదా మరే ఇతర వ్యక్తుల పట్ల ద్వేషభావం లేదని, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలలో ఎలాంటి జాతివ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపింది. తనను నవ్వులపాలు చేయాలనుకోవడం, విమర్శించడం కంటే తాను ఏమనుకుంటున్నానో సరిగా అర్థం చేసుకోవాలని కోరింది. కన్హయ్య విషయంలో జాహ్నవి ఏం చెప్పిందో ఓసారి చూద్దాం.. ''నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిచి చర్చించొచ్చు. కన్హయ్య చేసినది తప్పు. ఆయన మన దేశ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండకూడదు. దానికి బదులు జాతి వ్యతిరేకుల గురించి మాట్లాడి ఉండాల్సింది'' అని తెలిపింది. లూథియానాలోని భాయి రణధీర్ సింగ్ నగర్లో గల డీఏవీ పబ్లిక్స్కూల్లో పదోతరగతి చదువుతున్న జాహ్నవి.. రక్షాజ్యోతి ఫౌండేషన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటోంది. స్వామి వివేకానంద జీవితచరిత్ర మీద ఓ పుస్తకం కూడా రాస్తోంది. ప్రజలకు మన నేతలు, గురువుల గురించి సరిగ్గా తెలియదని, అందుకే స్వామి వివేకానంద జీవితం గురించి అందరికీ తెలిసేందుకు తాను పుస్తకం రాస్తున్నానని తెలిపింది. ఆమె తండ్రి అశ్విన్ బెహల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, తల్లి నందినీ బెహల్ గృహిణి. తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదని అశ్విన్ తెలిపారు. అసలు 15 ఏళ్ల అమ్మాయికి ఏ రాజకీయ పార్టీతోనైనా ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. -
ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..!
రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్.. భావప్రకటన స్వేచ్ఛ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ 15 ఏళ్ల అమ్మాయి సవాల్ విసిరింది. ఏవిషయమైనా మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకోవాలని కన్హయ్యకు సలహా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించింది. కన్హయ్యకు సవాల్ చేసిన అమ్మాయి పేరు జాహ్నవి బెహల్. లుథియానాకు చెందిన జాహ్నవి.. భాయ్ రణ్‌ధీర్ సింగ్ నగర్లో డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాల్గొన్నందుకు గాను జాహ్నవి.. రిపబ్లిక్ డే రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకుంది. ఎన్జీవో రక్షా జ్యోతి ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఓ జాతీయ పత్రికతో జాహ్నవి మాట్లాడుతూ.. రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, దీని అర్ధం హద్దులు దాటి మాట్లాడం కాదని చెప్పింది. కన్హయ్య తదితరులు రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాథమిక హక్కును దుర్వినియోగం చేశారని ఆరోపించింది. 'జేఎన్‌యూలో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో జరిగిన ఘటనను ఏ భారతీయుడు సహించడు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత సైనికులు తమ జీవితాలను త్యాగం చేస్తుంటే.. మరోవైపు జేఎన్‌యూ విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ చర్య ప్రపంచంలో భారత్ ప్రతిష్టతను మసకబారుస్తుంది' అని జాహ్నవి అంది. జాహ్నవి గతంలో పలు సమస్యలను ప్రస్తావించింది. పెద్దల చిత్రాలు, సోషల్ మీడియాలో నీలిచిత్రాలను నిషేధించాలని కోరుతూ చండీగఢ్ హైకోర్టును పిటిషన్ దాఖలు చేసింది. స్కూల్ డ్రెస్‌లోనే కోర్టుకు హాజరైంది. కోర్టు తీర్పు జాహ్నవికి అనుకూలంగా వచ్చింది.