ixigo
-
ట్రావెల్‌కి హోలీ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోలీ పండుగ నేపథ్యంలో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కుటుంబాలతో కలిసి వేడుకలు జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బైల్దేరుతుండటంతో విమానాలు, బస్సులకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా అగ్రగామి ఏఐ ఆధారిత ట్రావెల్ ప్లాట్‌ఫాం ఇక్సిగో ప్రకారం హోలీ పండుగ వారాంతానికి సంబంధించి ఫ్లయిట్ బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 70–75 శాతం పెరిగాయి. ఇక ఇక్సిగోలో బస్సుల విభాగం అభిబస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ 70 శాతం పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకి కూడా ఫ్లయిట్, బస్సు సర్వీసులకు భారీగా డిమాండ్ నెలకొంది. ఫ్లైట్ బుకింగ్స్‌లో 94 శాతం వృద్ధితో గోరఖ్‌పూర్ అగ్రస్థానంలో ఉండగా భోపాల్ (89 శాతం), కాన్పూర్ (86 శాతం), దర్భంగా (76 శాతం), వారణాసి (72 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వారం మధ్యలో హోలీ రావడంతో వారాంతం వరకు సెలబ్రేట్ చేసుకునేలా ప్రజలు ట్రిప్‌లను ప్లాన్ చేసుకుంటున్నారని ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు అలోక్ బాజ్‌పాయ్ తెలిపారు. హైదరాబాద్ జోరు.. మెట్రో నగరాల విషయానికొస్తే 108 శాతం ఫ్లయిట్ బుకింగ్స్ వృద్ధితో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అహ్మదాబాద్ (118 శాతం), మూడో స్థానంలో చెన్నై (101 శాతం) ఉన్నాయి. ఇక అత్యధిక డిమాండ్ నెలకొన్న రూట్లలోని రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉండటంతో గమ్యస్థానాలను చేరుకునేందుకు ట్రావెలర్లు బస్సులవైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరుకు అడ్వాన్స్ బుకింగ్స్ 70 శాతం పెరిగాయి. అటు బెంగళూరు–చెన్నై కారిడార్‌లో 65 శాతం, ముంబై నుంచి పుణె, నాగ్‌పూర్ రూట్లలో 75 శాతం పెరిగాయి. క్రికెట్ ఫీవర్ కూడా తోడు.. టీ20 క్రికెట్ వరల్డ్ కప్ సందడి కూడా ప్రయాణాలకు ఊతమిస్తోంది. కీలక మ్యాచ్‌లు జరిగే ప్రాంతాల్లో ఫ్లయిట్ సరీ్వసులు, హోటళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. హోమ్ షేరింగ్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ ప్రకారం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే నగరాల్లో హోటళ్ల కోసం ఆన్లైన్ సెర్చ్‌లు రెండు రెట్లు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద స్టేడియం ఉన్న అహ్మదాబాద్‌లో మార్చి 7–10 మధ్య బస చేసేందుకు అనువైన హోటళ్ల కోసం సెర్చ్‌లు 170 శాతం ఎగిశాయి. అయితే, ఈ ధోరణి కీలక మెట్రో హబ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా కనిపించడం గమనార్హం. రాంచీలో సెర్చ్‌లు 120 శాతం, తిరువనంతపురంలో 110 శాతం, జైపూర్‌లో 70 శాతం ఎగిశాయి. కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ ప్రకారం ఫిబ్రవరి–మార్చి మధ్య కాలంలో మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న నగరాలకు ఎయిర్ ట్రావెల్ బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి. అదే విధంగా మ్యాచ్‌లున్న రోజుల్లో హోటల్ సెర్చ్‌లు 20–25 శాతం వృద్ధి చెందాయి. ట్రిప్‌ల పొడిగింపు.. ఆధ్యాతి్మక టూరిజం లేదా వేసవి సెలవులతో పోలిస్తే ఇలాంటి పర్యటనల వ్యవధి తక్కువే ఉంటుందని, కాకపోతే మ్యాచ్‌ల తర్వాత కూడా ట్రిప్ కొన్ని రోజుల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని ఈజ్‌మైట్రిప్ సీఈవో రికాంత్ పిట్టీ తెలిపారు. స్థానిక సంస్కృతి, వంటకాల గురించి తెలుసుకునేందుకు, దగ్గర్లోని ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారని ఎయిర్‌బీఎన్‌బీ వర్గాలు తెలిపాయి. క్రికెట్ టూరిజానికి సంబంధించి ఎక్కువ శాతం పర్యాటకులు యువ ట్రావెలర్లే ఉంటున్నారని వివరించాయి. -
రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు
స్పెయిన్‌కి చెందిన ట్రెయిన్ బుకింగ్ ప్లాట్‌ఫాం అయిన ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ (ట్రెనెస్)లో మెజారిటీ వాటాలను ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్ యూరోలు) ఉంటుంది.యూరోపియన్ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్ యాజ్ సరీ్వస్ అనే ఇంకో స్పానిష్ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్‌క్యూఏఏఎస్ సంస్థ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధ సేవలను అందిస్తోంది. -
ఈసారి విమానం ఎక్కేవారిదే ఆనందం!
సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ దీపావళి సీజన్ విమాన ప్రయాణికులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కారణం.. అనేక దేశీయ రూట్లలో సగటు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం తగ్గాయి.ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం శ్రేణిలో క్షీణించాయి. ఇవి 30 రోజుల ఏపీడీ (ముందస్తు కొనుగోలు తేదీ) వన్-వే సగటు ఛార్జీల ధరలు. దీపావళి సీజన్ విమాన టికెట్ల కొనుగోలు సమయాన్ని గతేడాది నవంబర్ 10-16 తేదీల మధ్య పరిగణించగా ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.విశ్లేషణ ప్రకారం బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన ఛార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుండి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో టిక్కెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి 36 శాతం తగ్గింది.ఇదీ చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన ఛార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి 34 శాతం తగ్గాయి. అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్లో టికెట్ ధరలు రూ.11,296 నుంచి రూ.7,469కి 34 శాతం క్షీణించాయి. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత ఉంది. -
‘ఇక్సిగో’తో ఈజీ ప్రయాణం
ట్రావెల్, హోటల్ బుకింగ్ సంస్థలన్నీ ఒకే చోట ⇒ 25 వేల ట్రావెల్; 10 లక్షల హోటల్ బుకింగ్ సంస్థలతో ఒప్పందం ⇒ ‘స్టార్టప్ డైరీ’తో ఇక్సిగో సీఈఓ అలోక్ బాజ్‌పాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ పెట్టుబడి రూ.30 లక్షలే. ఆరంభించింది ఇద్దరే. కానీ ఐదారేళ్లు తిరిగేసరికి ఈ స్టార్టప్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 100 దాటిపోయింది. రూ.100 కోట్ల పెట్టుబడులూ వచ్చాయి. ఇక ఆదాయమైతే 30 కోట్లు దాటిపోయిందంటే... ఈ స్టార్టప్ సక్సెస్‌ను అర్థం చేసుకోవచ్చు. దేశ, విదేశాల్లోని ట్రావెల్ వెబ్సైట్లు, హోటల్ బుకింగ్ సంస్థల్ని ఒకే వేదికపైకి తెచ్చిన ఆ కంపెనీయే... ‘ఇక్సిగో’. ఈ ట్రావెల్ అగ్రిగేటర్ విజయమెలా సాధించిందన్నది దాని వ్యవస్థాపకుడు, సీఈఓ అలోక్ బాజ్‌పాయ్... ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో పంచుకున్నారు. వివరాలివీ... ఆన్లైన్లో క్యాబ్, బస్సు, రైలు లేక విమాన టికెట్లను బుకింగ్ చేయాలంటే... వాటిలో పేరున్న రెండు మూడు వెబ్సైట్లలోకి వెళ్లి చూస్తాం. ఒకే టికెట్‌ను ఏ సంస్థలు ఎంత ధర చెబుతున్నాయో తెలుసుకోవాలంటే అన్ని సైట్లూ చూసి కొనక తప్పదు. మరి దేశ, విదేశాల్లోని ట్రావెల్, హోటల్ బుకింగ్ సంస్థలన్నీ ఒకే వేదికపై తెలుసుకుంటే..? సమయం ఆదా అవటమే కాకుండా.. తక్కువ ధరకే టికెట్‌నూ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో సరిగ్గా ఇలాంటి సేవల వేదికే.. ‘ఇక్సిగో.కామ్’! ఏకంగా 25 వేల ట్రావెల్ వెబ్సైట్లు, 10 లక్షలకు పైగా హోటల్ బుకింగ్ సంస్థలున్నాయిందులో!! ‘‘ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజనీరింగ్ చేశాక స్పెయిన్ ట్రావెల్ అండ్ టూరిజం సంస్థ అమెడియస్లో నాలుగున్నరేళ్లు పనిచేశా. ఆ సమయంలో ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి దేశీ ట్రావెల్ పరిశ్రమలో వస్తున్న మార్పుల గురించి తెలిసింది. దీన్ని అందుకోవాలంటే సొంత కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుని... రజినీష్ కుమార్‌తో కలిసి రూ.30 లక్షల పెట్టుబడితో 2007లో గుర్గావ్ కేంద్రంగా ఇక్సిగో.కామ్‌ను ప్రారంభించా. అప్పటికే దేశంలో ట్రావెల్ టికెట్ బుకింగ్ సంస్థలు చాలా ఉన్నాయి. అందుకే అగ్రిగేట్ విధానాన్ని ఎంచుకున్నాం. అంటే దేశ, విదేశాల్లోని ట్రావెల్, హోటల్ బుకింగ్ సంస్థలన్నింటితో ఒప్పందం చేసుకున్నాం. దీంతో క్యాబ్స్, బస్సు, విమాన టికెట్లు ఏవైనా సరే బుకింగ్ చేసేముందు ఎక్కడ తక్కువ ధర ఉందో తెలుసుకోవచ్చు. ఇక్సిగో నుంచే బుక్ చేసుకోవచ్చు కూడా. 25 వేల ట్రావెల్ సంస్థలు..: ఇక్సిగో.కామ్ వెబ్‌సైట్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన విమాన, బస్సు, క్యాబ్, రైలు టికెట్ బుకింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రతి టికెట్ బుకింగ్‌పై సంస్థ నుంచి 5–10% కమీషన్ తీసుకుంటాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 65 నగరాల్లో బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేకుండా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే 10 నగరాల్లో ఇంటర్సిటీ క్యాబ్ బుకింగ్ సేవలనూ ప్రారంభించాం. పర్యాటకులకు ఆయా ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు ఇక్సిబాబా, ఇక్సిబుక్లను కూడా ప్రారంభించాం. రూ.30 కోట్ల ఆదాయం.. ఏటా 5 కోట్ల మంది ఇక్సిగో ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇందులో 10% వాటా తెలుగు రాష్ట్రాలది. గతేడాది మా ఒప్పంద సంస్థలకు మా ద్వారా రూ.650 కోట్ల గ్రాస్ మర్చండెస్ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఈ ఏడాది రెండింతలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్ల టర్నోవర్ చేశాం. ఈనెలతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.30 కోట్లకు చేరనున్నాం. మా మొత్తం వ్యాపారంలో 12–13% వాటా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలదే. వారంలో రూ.65 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో వంద మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు సైఫ్ పార్టనర్స్, మైక్రోమ్యాక్స్, మేక్‌మై ట్రిప్ సంస్థలు రూ.97 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ‘‘కొత్తగా మరో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన సికోయా క్యాపిటల్, చైనాకు చెందిన ఫోసన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. పూర్తి వివరాలను వారం రోజుల్లో వెల్లడిస్తాం’’ అని అలోక్ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...


