breaking news
IPS Postings
-
పెండింగ్‌లో ‘పోలీస్’ ఫైల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలలో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండటం గమనార్హం. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఓ కొలిక్కి తేలేకపోతోంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగులు దక్కక అప్రాధాన్య పోస్టులతో కాలం వెళ్లబుచ్చుతుండగా... డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఆర్పీ ఠాకూర్ మరో జాబితాను సీఎంవోకు ప్రతిపాదించడంతో పీటముడి బిగుసుకుంది.గుప్తా ‘సై’... ఠాకూర్ ‘నై’..! హరీశ్ కుమార్ గుప్తా 2025 ఫిబ్రవరిలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పూర్తిస్థాయిలో ఐపీఎస్‌ల బదిలీ ప్రక్రియను చేపట్టలేదు. 2025 జూన్‌లో రెగ్యులర్ అయిన తరువాత కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసినా... రాజధాని కేంద్రంగా విధులు నిర్వర్తించే సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలను మాత్రం ఓ కొలిక్కితేలేకపోతున్నారు. కీలకమైన విభాగాలను డీజీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించగా అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలపై తుది నిర్ణయం తీసుకోవడం లేదు. సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లపై డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెక్ పెట్టినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హోంశాఖ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. డీజీపీ గుప్తా సీఎంవోకు ప్రతిపాదనలు పంపగా.. ఠాకూర్ మంత్రి లోకేశ్ పేషీ ద్వారా మరో జాబితాను చేరవేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్‌లపై డీజీపీ గుప్తా, ఆర్పీ ఠాకూర్ పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు చేయడంతో సీఎంవో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టేసింది. రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా తన ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును అదనపు బాధ్యతలతో ఎండీగా నియమించినా, సీనియర్ ఐపీఎస్‌ను రెగ్యులర్ ఎండీగా నియమించాల్సి ఉంది. డీజీ (ఆర్గనైజేషన్) ఎన్.బాలసుబ్రహ్మణ్యంను ఆర్టీసీ ఎండీగా నియమించాలని సీఎంవో భావిస్తోంది. అందుకు డీజీపీ గుప్తా సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత్ర బాగ్చీ డీజీగా పదోన్నతి పొందడంతో ఆయన్ను బదిలీ చేయాల్సి ఉంది. ఆయన గ్రేహౌండ్స్ డీజీగా వెళ్లాలని భావిస్తున్నారు. లేదంటే విజిలెన్స్ విభాగం డీజీగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందుకు డీజీపీ గుప్తా సానుకూలంగా స్పందించడం లేదు. ఆర్టీసీ ఎండీ పోస్టుతోపాటు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలకు తాను సూచించిన అధికారులనే ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని డీజీపీ గుప్తా పట్టుదలతో ఉన్నారు. విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలను డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు అప్పగించకూడదన్నది ఆయన ఉద్దేశం. ఐజీ స్థాయి అధికారులను నియమించి తన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ విభాగాన్ని పూర్తి అదనపు బాధ్యతలతో ఆయనే నిర్వహిస్తున్నారు. అదే పరిస్థితిని కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలలో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులను రెగ్యులర్ డీజీలుగా నియమించాలని ఆర్పీ ఠాకూర్ సూచిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో సీనియర్ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై సీఎంవో తుది నిర్ణయం తీసుకుండా పక్కనపెట్టేసింది.డీఐజీలకు ఒకటికి మించి బాధ్యతలుసీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేకపోవడం పోలీసు శాఖపై ప్రభావం చూపిస్తోంది. ఇదే అదనుగా డీఐజీ స్థాయి అధికారులకు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కట్టెబెట్టి డీజీపీ గుప్తా తన పంతం నెగ్గించుకుంటున్నారు. డీఐజీ సత్య ఏసుబాబు పోలీసు ట్రైనింగ్, అపా, పీటీసీ, రైల్వేస్, పీ అండ్ ఎల్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. మరో డీఐజీ ఫకీరప్ప శాంతి–భద్రతలు, ఏపీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ, సిట్ (డీజీ అటాచ్మెంట్) బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పోలీస్ సంక్షేమం, స్పోర్ట్స్, ప్లానింగ్, కో ఆర్డినేషన్ విభాగాలను డీఐజీ అన్బురాజన్ పర్యవేక్షిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ విభాగాలను పర్యవేక్షిస్తున్నవారికి కేవలం అదనపు బాధ్యతలుగా మాత్రమే అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. తద్వారా అంతా పూర్తిగా తన గుప్పిట్లోనే ఉండేలా డీజీపీ గుప్తా పావులు కదుపుతున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
పోస్టింగ్ కోసం ఐపీఎస్‌ల పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలు కీలకమైనప్పటికీ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోం ది. పోలీసుశాఖలో ఎస్పీ, డీఐజీ పోస్టుల భర్తీకి తాత్సారం చేయడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గతనెల మొదటి వారంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. అప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా కొందరు ఎస్పీ, డీఐజీలను వెయిటింగ్లో ఉంచి నెలన్నర దాటింది. వారిని తాత్కాలికంగా ఏదో ఒక విభాగానికి అటాచ్ చేసి వదిలేశారు. గుంటూరు అర్బన్ నుంచి బదిలీ అయిన ఎస్పీ ఆకె రవికృష్ణ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసి వెయిటింగ్లో ఉన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డిని బదిలీచేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను తాత్కాలికంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నార్త్‌జోన్ డీసీపీ శ్రీకాంత్ ఐక్యరాజ్యసమితి శాంతిదళానికి ఎంపికవడంతో ఆయన్ను బదిలీ చేశారు. కానీ ఐరాస నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దీంతో ఆయన్ను నగర ట్రాఫిక్ విభాగం డీసీపీగా తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. ఆయన వెళ్లితే ట్రాఫిక్ విభాగం డీసీపీ పోస్టు ఖాళీకానుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 3 డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాదాపూర్, బాలానగర్, అల్వాల్ డీసీపీ పోస్టులకు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించాల్సి ఉంది. మరో ఇద్దరు డీఐజీలు, ఒక ఐజీ కూడా పోస్టింగ్‌కోసం ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ డీఐజీగా నియమితులైన గంగాధర్‌ను సొంత జిల్లా కారణంగా ఈసీ ఆదేశాలతో బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటిం గ్లో ఉన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు నుంచి బదిలీ అయిన సూర్యప్రకాశరావుపై ఆరోపణలొచ్చినందున భద్రాచలం ఓఎస్డీగా తాత్కాలికంగా పంపారు. నక్సల్ నిరోధక కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఆ బాధ్యతలకు ఓఎస్డీగా అదనపు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించే సంప్రదాయముంది. తదుపరి ఐపీఎస్‌ల బదిలీలప్పుడు సూర్యప్రకాశరావుకు డీఐజీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన వీవీ శ్రీనివాసరావుకూ పోస్టింగివ్వడంలో ఆల స్యమైంది. పోలీసుశాఖలో కీలకమైన 2 అదనపు డీజీ స్థాయి పోస్టుల నియామకాల్లోనూ ప్రభుత్వం జాప్యంచేస్తోంది. ప్రిం టింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ ఆర్పీ మీనా గతనెల్లో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. తూనికలు, కొలతలశాఖ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. తూనికలు కొలతల శాఖకు ఐజీ లేదా అదనపు డీజీని నియమించాల్సిఉంది. అదనపు డీజీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన జేవీ రాముడు ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు సంయుక్తంగా ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. ఆయన్ను డీజీ స్థాయి పోస్టుకు బదిలీచేసే అవకాశముంది. ఆయనతోపాటు డీజీపీగా పదోన్నతి పొందిన ఏకేఖాన్ మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతారని తెలిసింది.


