breaking news
Internet search
-
ఏ ‘క్లిక్’లో ఏ ‘కీడు’ దాగుందో!
అంతర్జాలం (ఇంటర్నెట్)లో ఉన్న విచిత్రం ఏమిటంటే... ‘మాకేమీ తెలియదు’ అనేవాళ్లే కాదు... ‘మాకంతా తెలుసు’ అనుకునేవాళ్లు కూడా బోల్తా పడుతుంటారు. ఎందుకంటే కొత్త ప్రమాదాలు సరికొత్త రూపాల్లో వస్తుంటాయి. అందుకే అంతర్జాలం అంటే ఆసక్తి మాత్రమే కాదు అనేక రకాలుగా అప్రమత్తంగా ఉండాలి... బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే కొందరు ఆకతాయిలు ఆన్లైన్లో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైకి చెందిన శ్వేత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపోమాపో పెళ్లి. ఈలోపు అబ్బాయి తండ్రి నుంచి కబురు వచ్చింది. ‘పెళ్లి క్యాన్సిల్’ అని! అమ్మాయి తరపు వాళ్లు ఆవేశంతో అతడిని నిలదీయబోతే కొన్ని ఫొటోలు చూపించాడు. శ్వేత ఎవరో అబ్బాయితో ఉన్న ఫోటోలు అవి. అంతే! ఆవేశంగా వచ్చిన వారు సైలెంటైపోయారు. వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లారు. ‘మా పరువంతా తీశావు’ అని కూతురిని తిట్టడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు. ‘ఈ బతుకు వృథా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు’ అనుకుంది శ్వేత. కాని అలా చేస్తే నిందను నిజం చేసినట్లవుతుంది కాబట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులతో మాట్లాడింది. వాళ్లు దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే, అవి మార్ఫింగ్ ఫోటోలని. తామంటే గిట్టని బంధువులే ఈ పని చేశారు! ఒక్క మార్ఫింగ్ అనేకాదు... ఆర్థిక మోసాలు, సైబర్ బుల్లింగ్... మొదలైనవి అంతర్జాలం అంటే అంతులేని భయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే కొందరు మహిళలు అంతర్జాలానికి అందనంత దూరంలో ఉంటున్నారు. కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్తోనే అనుసంధానమై ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీకి చెందిన ‘సోషల్‌మీడియా మ్యాటర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘మోసం జరిగాక అయ్యో! అని నిట్టూర్చడం కంటే మోసం జరిగే అవకాశమే ఇవ్వకుంటే బాగుంటుంది కదా!’ అనే విధానంతో రంగంలోకి దిగింది. పన్నెండుమంది యువతీ యువకులు ఉన్న బృందం సోషల్ మీడియా మ్యాటర్స్. సేఫ్ ఇంటర్నెట్ గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న ‘సోషల్ మీడియా మ్యాటర్’ సంస్థ సభ్యులు స్కూల్, కాలేజీ, యూనివర్శిటీ, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాలు... మొదలైన వాటిలో ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులు బోర్ కొట్టకుండా ఉండటానికి ఎమోజీకేషన్ టెక్నిక్ ఉపయోగించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను సందర్భోచితంగా ఉదహరిస్తారు, పిట్టకథలు చెబుతారు. ఆకట్టుకునే చిత్రాలను ప్రదర్శిస్తారు. ‘రూల్స్ అండ్ టూల్స్ వితిన్ సైబర్‌స్పేస్’లో భాగంగా డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కాపాడుకోవడం, సెక్యూరిటీ ఆఫ్ కనెక్షన్స్... మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది సోషల్ మీడియా మ్యాటర్స్. వర్క్‌షాప్‌కు వెళ్లడానికి మొదట్లో ఆసక్తిగా అనిపించలేదు. ఫ్రెండ్‌తో కలిసి వెళ్లా. ఇంటర్నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – ఆనంది, నాగ్‌పూర్ -
ఉబెర్ వ్యాపారంలోకి గూగుల్!
డ్రైవరు లేని కార్లతో ప్రయోగం ఉబెర్‌లోకి కూడా ఆ తరహా కార్లు శాన్ఫ్రాన్సిస్కో: డ్రైవరు లేకుండా నడిచే కార్లను రూపొందిస్తున్న ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్... ఆ ప్రాజెక్టులో భాగంగా ఉబెర్ వంటి రైడింగ్ సేవల వ్యాపారంలోకి కూడా ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే ఉబెర్ తరహా ‘యాప్’ను గూగుల్ అభివృద్ధి చేసినట్లు సమాచారం. దీన్ని గూగుల్ ఉద్యోగులు వాడుతున్నట్లు ఉబెర్ ఉన్నతాధికారులకు తెలుసునని కూడా బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ తెలియజేసింది. నిజానికి ఉబెర్‌లో గూగుల్ అతిపెద్ద ఇన్వెస్టరు. గూగుల్ ప్రధాన లీగల్ అధికారి డేవిడ్ డ్రమ్మండ్ ఉబెర్ బోర్డులో ఉన్నారు కూడా. తాము ఉబెర్ తరహా యాప్‌ను రూపొందించే అవకాశం ఉందని ఇటీవల డ్రమ్మండ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో డ్రమ్మండ్ను రాజీనామా చేయమని ఉబెర్ కోరనున్నట్లు సమాచారు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందిస్తూ... ట్యాక్సీ రైడింగ్ అనేది చాలా పెద్ద మార్కెట్ అని, దీన్లో తాము సొంత పెట్టుబడులతోగానీ, లేదంటే ఉబెర్ వంటి భాగస్వాములతో గానీ కొనసాగుతామని స్పష్టంచేసింది. 2013లో ఉబెర్‌లో గూగుల్ పెట్టుబడుల కంపెనీ గూగుల్ వెంచర్స్ 258 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఇన్వెస్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పేర్కొంది కూడా. కాగా దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉబెర్... ఖర్చులు తగ్గించుకోవటానికి డ్రైవర్ లేని కార్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇటీవలే చెప్పింది. ‘‘ఉబెర్‌లో ప్రయాణానికి అయ్యే ఖర్చులో అత్యధికం డ్రైవర్లదే. అదే డ్రైవర్ లేకపోతే చాలా చౌకగా ప్రయాణించొచ్చు. సొంత కారుకన్నా ఇదే బెటరనిపిస్తుంది’’ అనేది ఉబెర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ అభిప్రాయం. అవసరమైనపుడు సెల్ఫ్‌డ్రైవింగ్ కారు లభిస్తే తమ సొంత కార్లను వదిలిపెట్టడానికి అమెరికాలో 25 శాతం మంది వాహన యజమానులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల గార్ట్నర్ సంస్థ జరిపిన సర్వేలో సైతం వెల్లడి కావటం గమనార్హం.