breaking news
International Technology
-
ఐటీ స్టాక్స్ దారెటు?
కృత్రిమ మేధ (ఏఐ) కథ రోజుకో మలుపు తిరుగుతోంది. రెండేళ్లుగా అంతర్జాతీయ టెక్నాలజీ మార్కెట్లను కుదిపేస్తూ ఏఐ చేస్తున్న హడావుడి ఇపుడు తగ్గుతోంది. వాస్తవ ధోరణిలోకి వస్తోంది. పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా నిజంగానే ఏఐ రాబడులనిస్తుందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఆఖరికి ఏఐపై పెట్టుబడి పెడుతున్న కంపెనీలు సైతం హడావుడి, అత్యుత్సాహం తగ్గించుకుని జవాబుదారీతనంవైపు చూడటం మొదలెట్టాయి. అందుకే... కొన్నాళ్లుగా భారీ కరెక్షన్కు గురైన భారత ఐటీ దిగ్గజాల విషయంలో మళ్లీ పునరాలోచన మొదలయ్యింది. ఏఐ వల్ల నష్టపోతాయనే ఉద్దేశంతో భారీగా కరెక్షన్కు గురైన ఈ కంపెనీల షేర్లు... ఇపుడు ఆ నష్టం పరిమితమేనన్న అంచనాల నేపథ్యంలో కొంతైనా కోలుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఎలా మారుతోంది? మన ఐటీ స్టాక్స్ విషయంలో ఏం చేయొచ్చు? ఇదే ఈ ‘వెల్త్ స్టోరీ’ ప్రధానాంశం.ఏఐ హడావుడితో ఆ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఐటీ షేరూ భారీగా ర్యాలీ చేసింది. కానీ పరిశ్రమ ఇపుడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇన్వెస్టర్లు ఏ కంపెనీలు మెరుగ్గా ఉన్నాయి? ఏవి బలహీనంగా ఉన్నాయనేది పోల్చి చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బలమైన బ్యాలెన్స్ షీట్లు, క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, ఏఐ వ్యూహాలను అమలు చేయగలిగే సామర్థ్యాలు, క్యాష్–ఫ్లో మెరుగ్గా ఉన్న కంపెనీలు నిలదొక్కుకుంటాయి. మరింత బలోపేతం అవుతాయి. మిగతావి రాణించలేక కొట్టుమిట్టాడవచ్చు. మార్కెట్ ఆందోళన ఇదీ.. → ఏఐ వల్ల బిల్లింగ్ హవర్స్ తగ్గిపోతాయి: దేశీ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుని, వారి ద్వారా ఆదాయాలు ఆర్జిస్తూ వస్తున్నాయి. ఏఐ రాకతో కోడింగ్ ఆటోమేటిక్ అవుతోంది. టెస్టింగ్ చేసే సిబ్బంది, ఇతరత్రా సపోర్ట్ సిబ్బంది అవసరం తగ్గిపోతుంది. దీనితో పాత తరహా ఔట్సోర్సింగ్ మోడల్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. → ఆచితూచి ఖర్చు చేస్తున్న క్లయింట్లు: గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే జీపీయూలు, ఏఐ చిప్‌లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనితో సంప్రదాయ తరహా ఐటీ సేవలపై ఖర్చు చేయడం తగ్గవచ్చు. → మారుతున్న ‘హ్యూమన్ పిరమిడ్’ మోడల్: భారతీయ ఐటీ సంస్థల లాభదాయకత అనేది భారీ స్థాయిలో ఫ్రెషర్లను తీసుకోవడం, పరిస్థితికి తగ్గట్లు డెలివరీ సామర్థ్యాలను పెంచుకోగలగడం, తక్కువ వేతనాలకే ఉద్యోగులు లభిస్తుండటంలాంటి అంశాలపై ఆధారపడుతూ వస్తోంది. అయితే, ఏఐ రాకతో ఈ విధానం ఇక మారిపోవచ్చు.ఇదీ... మన ఐటీ దిగ్గజాల పరిస్థితి→ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ధర శ్రేణి: రూ. 3,000–3,100 52 వారాల గరిష్టం: రూ. 4,500 పైగా ట్రెండ్: భారీగా కరెక్షన్ టీసీఎస్ ఇప్పటికీ భారత్‌లో అతి పెద్ద ఐటీ కంపెనీ. అంతర్జాతీయంగానూ క్రెడిబిలిటీ ఉంది. అయితే, క్లయింట్లు ఖర్చులు తగ్గిస్తుండటం, ఏఐ వల్ల బిల్లింగ్ తగ్గడం, వృద్ధి రేట్లు గణనీయంగా మందగిస్తుండటంపై ఇన్వెస్టర్లు కాస్త ఆందోళనతో ఉన్నారు. కాకపోతే, కస్టమర్లతో బలమైన సంబంధాలు, పటిష్టమైన క్యాష్ ఫ్లో, ఏఐని అమలు చేయాల్సిన డీల్స్ పెరుగుతుండటం లాంటివి సంస్థకు సానుకూలంగా కనిపిస్తున్నాయి.→ ఇన్ఫోసిస్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,700 పైగా ట్రెండ్: భారీగా తగ్గిన వేల్యుయేషన్ ఇన్ఫోసిస్ తమ ‘టొపాజ్ ఏఐ’ వ్యూహాన్ని బలంగా అమలు చేస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏఐ టూల్స్ వల్ల కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ అంతా ఆటోమేట్ అయిపోతే సిబ్బందికి సంబంధించి బిల్లింగ్ పరంగా ఆదాయాలు ఎలా ఉండొచ్చనేది ఆలోచిస్తున్నారు. క్లయింట్లు ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై భారీగా వెచి్చంచడాన్ని కొనసాగిస్తూ, క్లౌడ్‌కి మళ్లటాన్ని వేగవంతం చేసి, కన్సల్టింగ్ సర్వీసులకు డిమాండ్ పెరిగితే సంస్థ భవిష్యత్తు బాగుండొచ్చు. అయితే, కొన్నాళ్ల పాటు మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు.→ విప్రో ప్రస్తుత ధర శ్రేణి: రూ. 230–260 ట్రెండ్: దీర్ఘకాలికంగా బలహీన పనితీరు ఏఐ విప్లవం భయాలు తలెత్తడానికి చాలా కాలం ముందు నుంచే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విప్రో సవాళ్లు ఎదుర్కొంటూ వస్తోంది. నెమ్మదిగా ఉన్న కంపెనీలు ఏఐ జమానాలో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని మార్కెట్లు భావిస్తున్నాయి. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ మెరుగుపడి, ఏఐ కన్సల్టింగ్ పుంజుకుని, భారీ గ్లోబల్ కాంట్రాక్టులు తిరిగి వస్తే విప్రో మళ్లీ టర్న్ అరౌండ్ కావచ్చు. అలా జరగకపోతే పటిష్టంగా ఉన్న పోటీ సంస్థల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపొచ్చు.→ హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,770 ఇంజినీరింగ్ సర్వీసులు, ఇన్ఫ్రా మేనేజ్మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ప్రోడక్టుల్లో పటిష్టంగా ఉండటం సంస్థకు సానుకూలాంశాలు. అయినప్పటికీ గరిష్ట స్థాయుల నుంచి షేరు భారీగా కరెక్షన్‌కి లోనయ్యింది. ఒకవేళ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాపై క్లయింట్లు వెచి్చంచడం పెరిగితే, ఏఐ ఆధారిత ఇంజనీరింగ్‌కి డిమాండ్ పెరిగితే కంపెనీకి లాభించవచ్చు.→ టెక్ మహీంద్రా ధర శ్రేణి: రూ. 1,450 ట్రెండ్: మిగతావాటితో పోలిస్తే నిలకడగా రాణిస్తోంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే టెక్ మహీంద్రా ఇటీవల నిలకడగా రాణిస్తోంది. అంతర్జాతీయంగా టెలికం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వేగవంతం అయితే పరిశ్రమలో పటిష్టంగా రాణించే కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలవొచ్చు.మిడ్‌క్యాప్ ఐటీ: రిస్క్ లు, అవకాశాలూ.. రెండూ ఎక్కువేకోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఎం, ఎంఫసిస్ వంటి పలు మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ కంపెనీలు ఏఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్టులుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నాయి. ఒకవేళ అంతర్జాతీయంగా ఏఐ వినియోగం వేగవంతమైతే కొన్ని కంపెనీలు విజేతలుగా నిలవొచ్చు. కానీ ఊగిసలాట ఎక్కువే ఉంటుంది. నిజానికి చారిత్రకంగా చూస్తే మెయిన్‌ఫ్రేమ్, ఇంటర్నెట్, క్లౌడ్ మైగ్రేషన్, మొబైల్ విప్లవంలాంటి ఎన్నో సవాళ్లను దేశీ ఐటీ రంగం ఎదుర్కొని నిలబడింది. ఏఐ ఒకరకంగా పాత బిజినెస్ మోడల్స్‌కి ముప్పుగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ అవకాశాలనూ అందించవచ్చు. గ్లోబల్ దిగ్గజాల అవసరాలను దేశీ ఐటీ కంపెనీలు అందిపుచ్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీని అమలు చేయటం, తమ కార్యకలాపాల్లో ఏఐని అనుసంధానించుకోవడం, ఏఐ టూల్స్‌ని కస్టమైజ్ చేసుకోవడం, డేటా నిర్వహణ, దేశీ చట్టాల అమలు మొదలైన విషయాల్లో గ్లోబల్ కంపెనీలకు భారతీయ ఐటీ సంస్థలు భాగస్వాములుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారీ ఏఐ మోడల్స్‌ని తయారు చేసే కంపెనీలతో పాటు ఏఐని ఉపయోగించుకోవడంలో క్లయింట్లకు సహాయపడగలిగే సంస్థలూ రాణించే అవకాశాలుంటాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పరిశీలించతగిన సానుకూల, ప్రతికూలాంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..సానుకూల సంకేతాలు... → భారీ స్థాయి ఏఐ డీల్స్ → ఏఐ ద్వారా వచ్చే ఆదాయం → మార్జిన్లు స్థిరంగా ఉండటం → బైబ్యాక్‌లు, డివిడెండ్లు → సంస్థ పరివర్తనకు దోహదపడే కాంట్రాక్టులు. ప్రతికూల సంకేతాలు → నియామకాలు బలహీనంగా ఉండటం → ఏఐ వినియోగం తగ్గుతుండటం → కొత్తగా కుదిరే అవకాశమున్న డీల్స్ సంఖ్య తగ్గుతుండటం → మార్జిన్లు పడిపోతుండటం → రాబడులు లేకుండా ఏఐపై అతిగా ఖర్చు చేస్తుండటం.రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చంటే..ఎక్కువగా రిస్కు ఇష్టపడనివారు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి పరిశీలించవచ్చు. ఇవి దీర్ఘకాలికానికి అనువుగా ఉంటూ స్థిరత్వాన్ని, డివిడెండ్లను అందిస్తున్నాయి. రిస్కు తీసుకోగలిగే వారు కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఎం, టెక్ మహీంద్రాలను పరిశీలించవచ్చు. ఏఐ ఆధారిత వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇవి అనువుగా ఉంటాయి. – సాక్షి, వెల్త్ డెస్క్ -
గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ట్రెండ్స్ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన ఈ నివేదికలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్.. నెదర్లాండ్స్ .. దక్షిణ కొరియా.. భారత్ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి. అమెరికా టాప్.. అత్యంత విలువైన 30 గ్లోబల్ టెక్ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్‌కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది. -
3 రోజుల్లో కోటి అమ్మకాలు..
యాపిల్ ఐఫోన్ 6 న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ .. ఐఫోన్ 6, 6 ప్లస్ మోడల్స్ అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. విక్రయాలు మొదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 1 కోటి పైగా ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక కొత్త మోడల్ ఈ స్థాయిలో అమ్ముడవడం రికార్డు. ఏడాది క్రితం ఐఫోన్ 5సీ, 5ఎస్ మోడల్స్‌ని ప్రవేశపెట్టినప్పుడు 90 లక్షల మేర అమ్మకాలు జరిగినట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ తదితర పది దేశాల్లో ఈ కొత్త ఐఫోన్లను విక్రయిస్తోంది కంపెనీ. ఈ నెల 26 నుంచి మరో 20 దేశాల్లో విక్రయాలు ప్రారంభించనుంది. కంపెనీ ఊహించిన దానికంటే డిమాండ్ భారీగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. పెద్ద స్క్రీన్‌తో పాటు మరింత వేగవంతమైన పనితీరు, క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం వైర్లెస్ చిప్ తదితర ఫీచర్లు ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్లో ఉన్నాయి. వచ్చే నెల 17న ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ల ధర సుమారు రూ. 48,000 - రూ. 60,000 దాకా ఉండొచ్చని అంచనా.


