Instruments and devices
-
తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..
సంగీతంలో పెర్కషన్ వాయిద్యాలు వాయించడం అంత సులభం కాదు. చాలామటుకు వాటిని మగవాళ్లే వాయిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పెర్కషన్ కళాకారులుగా మగవాళ్లే ఉంటారు ఎందుకంటే వాటిలో కొన్ని వాయిద్యాలు అత్యంత బరువుతో ఉంటాయి. పైగా వాయించాలంటే అపారమైన ఓపిక, శారీరక నొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటిలో అత్యంత కష్టతరమైన వాయిద్యం తవిల్..అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..గుర్తింపు తెచ్చుకుంటోంది ఓ మహిళా కళాకారిణి. అంతేగాదు ఈ తవిల్ వాయిద్యాన్ని ఆలపిస్తున్న తొలి మహిళా కళాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఎవరామె అంటే..ఆ అమ్మాయే ఆరు తరాల సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన అమృతవర్షిణి మణిశంకర్. తమిళనాడులోని తిరువూరు, మన్నార్గుడికి చెందిన ఆమె, తండ్రి నాగస్వరం కళాకారుడు ఎపి మణిశంకర్ కాగా, తల్లి జయంతి శంకర్ వయోలిన్ విద్వాంసురాలు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తవిల్ నేర్చుకుంటూ తరతరాల నాటి సంప్రదాయాన్ని ధిక్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహిళలు అరుదుగా అభ్యసించే వాయిద్యాన్ని ఆమె అలవోకగా వాయిస్తుంది. ఇంతవరకు మహిళా తవిల్ కళాకారులు ఎవ్వరూ లేరని చెప్పిన తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచాయట. ఆ నేపథ్యంలోనే ఈ వాయిద్యాన్ని వాయించడం పట్టుదలతో నేర్చుకుంది అమృతవర్షిణి. ఆమె కోవిలూర్ కె.జి. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఈ వాయిద్యాన్ని వాయించడంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆధునాతన శిక్షణను తీసుకుంటోంది. ఇందులో మరింత రాణించేలా తవిల్ కళాకారుడు తంజావూరు టి.ఆర్. గోవిందరాజన్ వద్ద సలహాలు సూచనలు తీసుకుంటూ తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అమృత వర్షిణి గురువు సలహాల మేరకు ఈ వాయిద్యాన్ని నేలపై ఉంచడానికి బదులు తన ఒడిలో ఉంచి వాయించడం ప్రారంభించింది. దాదాపు 60 కిలోలు బరువు ఉండే వాయిద్యం ఎక్కువసేపు వాయించడానికి అపారమైన ఓర్పు అవసరం. ఎందుకంటే భుజం, కాళ్లలో నొప్పి అధికమవుతుంది. పైగా వేళ్లు రక్తస్రావం అవుతాయి కూడా. అవన్నీ నయం అవడానికే సుమారు పది రోజులు పడుతుంది. కచేరికి ముందు వేళ్ల చుట్టూ టేప్ చుట్టి..ధ్వనిని ఉత్పత్తి చేసే క్యాప్‌లను తొడిగేందుకు జిగురు రాసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పుడు ఆధునిక ఆడియో వ్యవస్థల కారణంగా కాస్త ప్రదర్శన సులభతరం అయ్యిందని, శారీరక ఒత్తిడి కూడా తగ్గిందని అంటోంది.బహిరంగ ప్రదర్శనలివ్వడం అప్పటి నుంచే..పదకొడేళ్ల ప్రాయం నుంచి అమృతవర్షిణి బహిరంగ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. తొలి ప్రదర్శన హరిధ్వర్మంగళంలోని అరుల్మిగు ముత్తుమైరామ్మన్ ఆలయంలో జరిగింది. 2020లో తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీ (వాయిద్య విభాగం)లో మూడవ స్థానం దక్కించుకుంది. 2022లో మళ్ళీ పాల్గొన్నప్పుడు బ్యానర్‌పై తన చిత్రాన్ని చూసుకుని మురిసిపోయానంటోంది. View this post on Instagram A post shared by Indian Women Blog (@indianwomenblog) ప్రస్తుతం ఆమె సంగీత కచేరీల నిమిత్తమే టూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఈ వారాంతంలో బెంగళూరులో జరిగే మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్లో ప్రదర్శించే ‘ఉమెన్ హూ డ్రమ్’ అనే పూర్తి మహిళల పెర్కషన్ బృందంలో భాగం కానుంది. ఇది పూర్తిగా మహిళా సంగీత కళాకారులతో కూడిన బృందం. ప్రముఖ సంగీత విద్యాంసుడి నుంచి పిలుపు..అన్నింటికంటే అత్యంత విశేషమైనది “రెహమాన్ సర్ 'వండర్మెంట్ టూర్' కచేరీలో అమృతవర్షిణిని వాయించమని కోరడం. అదే తనకు తొలిసారి అని ప్రేక్షకుల ముందు సోలోగా ప్రదర్శన ఇవ్వడం అంటూ తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంది 18 ఏళ్ల అమృతవర్షిణి. గత అక్టోబర్‌లో రెహమాన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవ్వడం చూసి.. చాలా ఆశ్చర్యపోయిందట. కొంతకాలం తర్వాత, ఆయన మేనేజర్ స్వయంగా ఫోన్ చేసి ఫిబ్రవరిలో రెండు రోజులు చెన్నైలో ఉండి కచేరీలో పాల్గొనాలని చెప్పడం ఎప్పటికీ మర్చిపోను అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. మహిళలు వాయించలేని సంగీత పరికరాన్ని వాయించడం సాధన చేయడమే గాక..అందులో రాణిస్తూ..ఏకంగా ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి పిలుపు అందుకోవడం మాములు విషయం కాదు కదా..!. ఇది నిజంగా మహిళా సాధికారతకు, ఆమె అజేయమైన శక్తికి నిర్వచనం కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది
ఏ.ఆర్. రెహమాన్ దాదాపు 22 ఏళ్లుగా పాటలు స్వరపరుస్తున్నాను. ఎప్పుడూ నాకు ఒకే వాద్యం ఇష్టం ఉండదు. కాలాన్ని బట్టి నా ఇష్టం మారుతుంది. కొత్త కొత్త వాద్య పరికరాలు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిన ‘స్వరం’కి సాటి రావు. అలాగే, ఒక వాద్యం ఉందనుకోండి. దాన్ని ఉపయోగించి మెరుగైన సంగీతం సమకూర్చినప్పుడే దాని విలువ పెరుగుతుంది. లేకపోతే ఆ వాద్యం సాదాసీదాగా మిగిలిపోతుంది. సంగీతానికి భాషతో సంబంధం లేదు. వినోదానికి కూడా అంతే. నా మనసు బాగున్నప్పుడూ పాట.. బాగాలేనప్పుడూ పాటతోనే నా ప్రయాణం. అయితే, ఎప్పుడైనా నా శక్తి తగ్గుతున్నట్లుగానో, మానసిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో కామెడీ సినిమాలు చూస్తా. తమిళంలో స్టార్ కమెడియన్లుగా వెలిగిన సురుళీ రాజన్, తేంగాయ్ శ్రీనివాసన్, నాగేశ్, ఎస్వీ శేఖర్లు చేసిన కామెడీ చూస్తూ పెరిగినవాణ్ణి. ఈ జాబితాలో చార్లీ చాప్లిన్ని మిస్ చేస్తే, తప్పు చేసినవాణ్ణవుతా. జనాలను నవ్వించి, ఆనందపరిచిన వీళ్లంతా ఎంతో గొప్పవాళ్లు. మాటల్లో వ్యక్తీకరించలేని భావాలను పాట ద్వారా చెబుతుంటాం. అందుకే పాట లేని సినిమా నాకు అసంపూర్ణం అనిపిస్తుంది. మన భారతీయ చిత్రాల్లో ఉండే అందమైన విషయాల్లో పాట ఒకటి. విదేశాల్లో పాటలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, నేను పని చేసే విదేశీ చిత్రాల్లో కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే కాకుండా పాటలకు ఆస్కారం ఉండటం నాకు ఆనందంగా ఉంటుంది. నాకు ఇళయరాజా గారి పాటల్లో ఎప్పటికీ నచ్చేది ‘కాట్రిల్ వరుమ్ గీతమ్...’. తమిళ చిత్రం ‘జానీ’ (1980) కోసం ఆయన స్వరపరచిన ఈ పాట ఎవర్ గ్రీన్ అనొచ్చు. నేను ఎక్కువసార్లు పాడుకునే పాటల్లో ఇదొకటి.నన్ను నమ్మే దర్శకుల సినిమాలకు పని చేయడం నాకిష్టం. నాకూ, మణిరత్నానికీ మధ్య మంచి అవగాహన ఉంది. బాలీవుడ్లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా సరే ఆయన ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇక, ఇంతియాజ్ అలీ అయితే ఇప్పటివరకూ మనం చూడని కోణానికి తీసుకెళ్లిపోతారు. సుభా్‌ష్ ఘయ్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్. ఆశుతోష్ గోవారీకర్ అయితే మరుగున పడిపోయిన మన భారతీయ సంగీతాన్ని మళ్లీ తీసుకువచ్చేలా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దర్శకులు ఉన్నారు. నా జీవితంలో ఎప్పటికీ నేను పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఒకటుంది. ప్రపంచం గర్వించదగ్గ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌తో పని చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా ఆయనను కలవాలనుకునేవాణ్ణి. మైకేల్ జాక్సన్ ఏజెంట్ స్నేహితుడు నా ఏజెంట్‌కి ఫ్రెండ్. అతని ద్వారానే మైకేల్‌ను కలిశాను. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత మొదటిసారి కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు నా గురించి నేను పరిచయం చేసుకోవడానికే సరిపోయింది. అప్పుడు నాకు చాలా బెరుకుగా కూడా అనిపించింది. నేను స్వరపరచిన ‘జయహో..’ గురించి ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఇండియా అంటే తనకు చాలా ఇష్టమని కూడా మైకేల్ చెప్పారు. రెండోసారి కలిసినప్పుడు ‘ఏఆర్.. మనిద్దరం కలిసి ‘వియ్ ఆర్ ది వరల్డ్..’ లాంటి పాట చేద్దాం అన్నారు. నేను రెండోసారి కలిసిన నెలకు ఆయన చనిపోయారు. మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నేనెక్కువగా క్లాసికల్ సాంగ్స్ వింటాను. క్లాసికల్ మ్యూజిక్ వినడం ద్వారా నూతనోత్సాహం వస్తుంది. పాప్ మ్యూజిక్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ కలగదు. ఎప్పుడైనా పాప్ సాంగ్స్ వినాలనిపిస్తే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు వింటాను. ఇంట్లో ఉన్నప్పుడు రేడియోలో వింటాను. అది కూడా చాలా తక్కువగా..


