క్రిమియా ఇక స్వతంత్ర దేశం
క్రిమియా పార్లమెంటు ప్రకటన
రష్యా సమాఖ్యలో చేర్చుకోవాలని వినతి
రిఫరెండంలో 97 శాతం మంది రష్యాలో చేరికకే మొగ్గు
రిఫరెండాన్ని ఆమోదించం: అమెరికా
ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి సోమవారం స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నిం టికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది.
ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రిఫరెండం నిర్వహణపై తమకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని చెప్పారు. ఈ మేరకు సోమవారం క్రిమియా పార్లమెంటు సమావేశమై నిర్ణయం తీసుకుంది. మొత్తం 100 మంది సభ్యులు గల సభలో హాజరైన 85 మంది సభ్యులూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. తాజా పరిస్థితిపై ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. శాంతియుత పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్ చట్టాలు ఇక వర్తించవు...
‘క్రిమియా ఇక స్వతంత్ర, సర్వసత్తాక దేశమని స్వయం ప్రతిపత్తిగల క్రిమియా రిపబ్లిక్ సర్వోన్నత మండలి ప్రకటిస్తోంది. ఈ రోజు (సోమవారం) నుంచి ఉక్రెయిన్ చట్టాలు ఇక క్రిమియాలో వర్తించవు. గత నెలలో రష్యా మద్దతు గల అధ్యక్షుడు యానుకోవిచ్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన అనంతరం ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి అధికార బద్ధతా లేదు. క్రిమియాలో ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు అంతమయ్యాయి. వాటి అధికారాలు, వారి ఆస్తులు, వారి బడ్జెట్లు రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా ప్రభుత్వ సంస్థలకు బది లీ అయ్యాయి. క్రిమియా భూభాగంపై ఉక్రెయిన్‌కు చెందిన లేదా ఉక్రెయిన్ భాగస్వామ్యంతో ఉన్న అన్ని కార్యాలయాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మొత్తం క్రిమియాకు చెందుతాయి’ అని ప్రకటన పేర్కొంది. అయితే.. వీటిలో ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ఉంటాయా అనే అంశంపై స్పష్టతలేదు.
30 నుంచి కాలమానం మారుతుంది: మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కన్నా రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ ట్విటర్లో పేర్కొన్నారు. రష్యాకు చెందిన నల్లసముద్రం సైనిక దళ స్థావరమైన సెవాస్తొపోల్ నుంచి 500 మంది ఉక్రెయిన్ సైనికులు తమ పోస్టుల నుంచి వైదొలగారని కూడా ఆయన ట్వీట్ చేశారు.
రష్యా అధికారులపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్ నుంచి వేరుపడుతూ క్రిమియా ప్రకటన చేసిన నేపథ్యంలో.. దీనికి రష్యానే కారణమని ఆరోపిస్తున్న అమెరికా ఆ దేశానికి చెందిన ఏడుగురు ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది. వీరిలో ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు యనుకోవిచ్ కూడా ఉన్నారు. క్రిమియాపై రష్యాకు, రష్యా ఉన్నతాధికారులకు సహకారం అందిస్తున్న వ్యక్తులను గుర్తించి, వారి వ్యక్తిగత ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని కూడా అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడుతూ.. క్రిమియా రిఫరెండమ్‌ను అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ గుర్తించదన్నారు.