breaking news
good leader
-
మోదీ ఓ మంచి నాయకుడు: సుప్రీం చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు.. 'మోదీ గొప్ప నాయకుడు, మానవతావాది, దూరదృష్టిగల నాయకుడు' అంటూ కితాబిచ్చారు. జస్టిస్ దత్తు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయని చెప్పారు. మోదీతో నాలుగుసార్లు కలిసిన చీఫ్ జస్టిస్ ఆయన వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. 2002 గుజరాత్ అల్లర్ల సయమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన సిట్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి మోదీని ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చీఫ్ జస్టిస్‌గా తన పదవీకాలంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పారు. -
‘మంచి నాయకులను ఎన్నుకోండి’
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించుకోవడం అంతే ముఖ్యమని ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిభూషణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజమహేంద్రి మహిళా కళాశాల ఆవరణలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను కలసి ఓటు ప్రధాన్యతను వివరించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కచ్చితంగా ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. యువతరం పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కుపై ఇంతమంది విద్యార్థులకు అవగాహన ఉండడం అభినందనీయమన్నారు. ఓటు వేయడం ద్వారా హక్కును సద్వినియోగపరచుకోవాలని విద్యార్థినులను కోరారు. జేసీ రేవు ముత్యాలరావు మాట్లాడుతూ చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం 60-70 శాతం మధ్య పోలింగ్ జరుగుతోందని, అది 80-90 శాతానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి కళాశాలలో 470 మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉందని నిర్వాహకుడు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధికారులను సత్కరించారు. ప్రిన్సిపాల్ ప్రకాశరావు పాల్గొన్నారు.