breaking news
General Electric
-
టారిఫ్ వేడిలోనూ డీల్ !
వాషింగ్టన్: ఓవైపు సుంకాల సమరంలో అమెరికాతో పోరాడుతున్న భారత్ మరోవైపు అదే అమెరికాతో రక్షణరంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసింది. అమెరికాకు చెందిన దిగ్గజ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్(జీఈ)తో ఏకంగా 1 బిలియన్ డాలర్ల భారీ రక్షణరంగ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ఒప్పందం ఖరారుకానుంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మార్క్ 1లో బిగించాల్సిన జీఈ–404 రకం ఇంజిన్లను కొనుగోలు చేసేం దుకు ఒప్పందం చేసుకుంటున్నారు. 1 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా జీఈ సంస్థ నుంచి భారత్ 113 ఇంజిన్లను కొనుగోలుచేయనుంది. వీటిని మొత్తంగా 97 తేజస్ విమానాల కోసం ఉపయోగించనున్నారు. గతంలో ఇదే తరహాలో 83 తేజస్ విమానాల కోసం 99 జీఈ ఇంజిన్లను కొనుగోలుచేశారు. ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు నేటినుంచి అమల్లోకి వస్తున్న ఇదే సమయంలో ఈ భారీ రక్షణరంగ డీల్ తుదిదశకు చేరుకోవడం గమనార్హం. భారత త్రివిధదళాల రక్షణ అవసరాలు తీర్చేందుకు తేజస్ విమానాలను తయారుచేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు ఎలాంటి ఇంజిన్ల సరఫరాలో జాప్యంలేకుండా ఉండేందుకు వేగంగా ఈ డీల్‌ను తుదిదశకు తీసుకొచి్చనట్లు తెలుస్తోంది. పాతతరం మిగ్–21 వంటి యుద్ధవిమానాలను మూలకు పడేస్తున్న వేళ వాటి స్థానంలో అధునాతన తేజస్‌లను సైన్యంలోకి తీసుకోవాల్సిన తక్షణావసరం ఏర్పడింది. అందుకే టారిఫ్‌ల వంటి అంశాల్లో అమెరికాతో విభేదాలు ఉన్నప్పటికీ భారత్ ఈ డీల్ కోసం అమెరికన్ కంపెనీతో వాణిజ్యబంధాన్ని కొనసాగించాల్సి వస్తోంది. 2029– 30కల్లా తొలి దఫాలో 83 తేజస్ విమానాలను అందిస్తానని హాల్ గతంలో హామీ ఇచి్చంది. 2033–34 కల్లా మరో 97 తేజస్ యుద్ధవిమానాలను సరఫరాచేయనుంది. ప్రతి 15 రోజులకు ఒకటి చొప్పున ఇంజిన్‌ను తయారుచేసి జీఈ సంస్థ భారత్‌కు సరఫరా చేయనుంది. అయితే జీఈ–414 రకం ఇంజిన్ తయారీలోని 80 శాతం సాంకేతికతను భారత్‌కు బదిలీచేసే అంశంపై జీఈతో హాల్ చర్చలు జరుపుతోంది. తేజస్ మార్క్2 రకం, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ(ఏఎంసీఏ) విమానాల్లో బిగించేందుకు కావాల్సిన జీఈ–414 ఇంజిన్లను కొనుగోలుచేసేందుకు ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల మరో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఆశిస్తోంది. జీఈ–414 ఇంజిన్లను 162 తేలికపాటి మార్క్2 విమానాలు, 10 నమూనా ఏఎంసీఏ విమానాలకు అమర్చనున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో కలిసి దేశీయంగా యుద్ధవిమాన ఇంజిన్‌ను తయారుచేసేందుకు భారత్ కృషిచేస్తోంది. -
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
జీఈ ఖాతాలోకి అల్‌స్తోమ్ విద్యుదుత్పత్తి వ్యాపారం
డీల్ విలువ 12.4 బిలియన్ యూరోలు లండన్: ఫ్రాన్స్‌కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్‌స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను అమెరికాకంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్‌స్తోమ్ తెలిపింది. రైలు రవాణా వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీని ద్వారా వచ్చిన నిధుల్లో 700 మిలియన్ యూరోలను జీఈ సిగ్నలింగ్ విభాగం కొనుగోలుకు వెచ్చించనున్నట్లు పేర్కొంది. అలాగే, స్టీమ్, అణు విద్యుత్ తదితర రంగాల్లో జనరల్ ఎలక్ట్రిక్ తో 3 జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై 2.4 బిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అల్‌స్తోమ్ తెలిపింది. ఈ డీల్ ఇరు కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చగలదని కంపెనీ చైర్మన్ ప్యాట్రిక్ క్రోన్ తెలిపారు.