
తేజస్ ఇంజిన్ల కోసం అమెరికాతో భారత్ 1 బిలియన్ డాలర్ల ఒప్పందానికి రెడీ
వాషింగ్టన్: ఓవైపు సుంకాల సమరంలో అమెరికాతో పోరాడుతున్న భారత్ మరోవైపు అదే అమెరికాతో రక్షణరంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసింది. అమెరికాకు చెందిన దిగ్గజ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్(జీఈ)తో ఏకంగా 1 బిలియన్ డాలర్ల భారీ రక్షణరంగ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ఒప్పందం ఖరారుకానుంది.
తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మార్క్ 1లో బిగించాల్సిన జీఈ–404 రకం ఇంజిన్లను కొనుగోలు చేసేం దుకు ఒప్పందం చేసుకుంటున్నారు. 1 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా జీఈ సంస్థ నుంచి భారత్ 113 ఇంజిన్లను కొనుగోలుచేయనుంది. వీటిని మొత్తంగా 97 తేజస్ విమానాల కోసం ఉపయోగించనున్నారు. గతంలో ఇదే తరహాలో 83 తేజస్ విమానాల కోసం 99 జీఈ ఇంజిన్లను కొనుగోలుచేశారు.
ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు నేటినుంచి అమల్లోకి వస్తున్న ఇదే సమయంలో ఈ భారీ రక్షణరంగ డీల్ తుదిదశకు చేరుకోవడం గమనార్హం. భారత త్రివిధదళాల రక్షణ అవసరాలు తీర్చేందుకు తేజస్ విమానాలను తయారుచేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు ఎలాంటి ఇంజిన్ల సరఫరాలో జాప్యంలేకుండా ఉండేందుకు వేగంగా ఈ డీల్‌ను తుదిదశకు తీసుకొచి్చనట్లు తెలుస్తోంది.
పాతతరం మిగ్–21 వంటి యుద్ధవిమానాలను మూలకు పడేస్తున్న వేళ వాటి స్థానంలో అధునాతన తేజస్‌లను సైన్యంలోకి తీసుకోవాల్సిన తక్షణావసరం ఏర్పడింది. అందుకే టారిఫ్‌ల వంటి అంశాల్లో అమెరికాతో విభేదాలు ఉన్నప్పటికీ భారత్ ఈ డీల్ కోసం అమెరికన్ కంపెనీతో వాణిజ్యబంధాన్ని కొనసాగించాల్సి వస్తోంది. 2029– 30కల్లా తొలి దఫాలో 83 తేజస్ విమానాలను అందిస్తానని హాల్ గతంలో హామీ ఇచి్చంది.
2033–34 కల్లా మరో 97 తేజస్ యుద్ధవిమానాలను సరఫరాచేయనుంది. ప్రతి 15 రోజులకు ఒకటి చొప్పున ఇంజిన్‌ను తయారుచేసి జీఈ సంస్థ భారత్‌కు సరఫరా చేయనుంది. అయితే జీఈ–414 రకం ఇంజిన్ తయారీలోని 80 శాతం సాంకేతికతను భారత్‌కు బదిలీచేసే అంశంపై జీఈతో హాల్ చర్చలు జరుపుతోంది.
తేజస్ మార్క్2 రకం, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ(ఏఎంసీఏ) విమానాల్లో బిగించేందుకు కావాల్సిన జీఈ–414 ఇంజిన్లను కొనుగోలుచేసేందుకు ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల మరో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఆశిస్తోంది. జీఈ–414 ఇంజిన్లను 162 తేలికపాటి మార్క్2 విమానాలు, 10 నమూనా ఏఎంసీఏ విమానాలకు అమర్చనున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో కలిసి దేశీయంగా యుద్ధవిమాన ఇంజిన్‌ను తయారుచేసేందుకు భారత్ కృషిచేస్తోంది.