breaking news
Gaddar daughter Vennela
-
అమ్మోరికి కృతజ్ఞత చెప్పడమే!
మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మతో సహా అనేక ప్రాంతీయ పేర్లు కలిగిన దేవత మహాకాళి. ఈ దేవతకు తెలంగాణలో ఆషాఢ మాసమంతా ప్రజలు పండుగ చేసి బోనాలు ఎత్తుతారు. బోనం ఎత్తడమంటే అమ్మోరికి కృతజ్ఞతను తెలుపు కోవడమే! బోనాల మూలాలు 19వ శతాబ్దం నాటివి. ఆ సమయంలో వినాశ కరమైన ప్లేగు వ్యాధి జంట నగరాలను తాకింది. 1813లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక బెటాలియన్ ఈ అంటువ్యాధి నుండి ఉపశమనం కోసం మహాకాళి ఆల యంలో దేవిని ప్రార్థించింది. ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టగానే, బెటాలియన్ తిరిగి వచ్చి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని నిర్మించి, బోనాలను సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు మూల స్తంభంగా మారింది. 2014లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది. ఈ పండుగకు పౌరాణిక ప్రాముఖ్యం కూడా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మహాకాళి దేవత తన తల్లిదండ్రుల ఇంటికి వార్షిక ఆగమనాన్ని సూచిస్తుంది. భక్తులు ఆమెను నైవేద్యాలతో స్వాగతిస్తారు. ఇది వివాహిత కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు ఆమెను లాలించడం లాంటిది. వేప ఆకులు, పసుపు, కుంకుమ, వెలిగించిన దీపం వంటివాటితో అలంకరించబడిన కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలలో బియ్యం, పాలు బెల్లం కలిపి వండిన పవిత్ర భోజనమే... బోనం! మహిళలు ఈ బోనాలను తలపై పెట్టుకుని దేవాలయాలకు తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్మిస్తారు. ఇలా బోనాలు తీసుకువెళ్లే ఊరేగింపుకు పోతరాజు నాయ కత్వం వహిస్తాడు. బోనాల పండుగను ఒక మతపరమైన పండుగ కన్నా ఎక్కువే అనాలి. కుటుంబాలు బోనం నైవేద్యాన్ని పంచుకుంటాయి. దాని తర్వాత మాంసాహార విందు, ఈత లేదా తాటి కల్లు సేవిస్తారు. వీధులు వేప ఆకులతో అలంకరించబడి జానపద పాటల గాలిని నింపుతాయి. కొన్ని ప్రాంతాలు ఆషాఢంలో కాకుండా శ్రావణంలో బోనాల పండుగ జరుపుకొంటాయి. ఆంధ్రప్రాంతంలో గ్రామ దేవతలకు ఆషాఢ, శ్రావణాల్లో కొలుపులు చేయడం బోనాల పండుగను పోలి ఉంటుంది.– డా.జి. వెన్నెల గద్దర్ చైర్పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి -
'గద్దర్ నాపై రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు'
బొల్లారం/తిరుమలగిరి: తనపై నమోదైన బెదిరింపుల కేసు విచారణలో భాగంగా ప్రజాగాయకుడు గద్దర్ శుక్రవారం తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇన్స్పెక్టర్ రవికిరణ్ కథనం... కానాజీగూడకు చెందిన కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి జె.ప్రశాంత్ అలియాస్ ప్రభును ఫిబ్రవరి 25న టీచర్స్ కాలనీ వద్ద గద్దర్, ఆయన గన్మెన్లు, కుమారుడు సూర్య కిరణ్, కె.రమేష్, ఖాసీం సాహేబ్, ఇంద్ర, సీఎల్ యాదగిరి అడ్డుకున్నారనేది ఆరోపణ. గద్దర్ తనపై రివాల్వర్ ఎక్కుపెట్టి తన స్నేహితుడైన రవీందర్‌ను వెన్నెలతో విడాకులకు ఒప్పించాలని, అతడితో స్నేహం కొనసాగిస్తే చంపేస్తానని బెదిరించారని ప్రశాంత్ ఫిర్యాదు చేశారు. సూర్యకిరణ్ తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై తిరుమలగిరి పోలీసులు 26న ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం గద్దర్, గన్మెన్ల వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. ఉదంతం జరిగినట్లు చెప్తున్న రోజు, ఆ సమయంలో వీరంతా ఇంట్లోనే ఉన్నట్లు తేలిందని తెలిసింది. రవీందర్, వెన్నెల మధ్య విభేదాలే ఈ ఫిర్యాదుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నాపై కక్షగట్టే: ప్రశాంత్ గద్దర్ కుమార్తె ప్రేమ వివాహానికి సహకరించినందుకే నాపై ఆయన కక్ష కట్టారని ప్రశాంత్ అన్నారు. గద్దర్ తన కుటుంబ తగదాలను ఇతరులపై నెట్టివేస్తూ బలవంతపు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అతని అల్లుడు రవి..తాను చిన్ననాటి స్నేహితులం కావడంతో కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఇది మనసులో పెట్టుకొనే తనను చంపేస్తామని గద్దర్ బెదిరించారన్నారు. గద్దర్‌తో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.