
మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మతో సహా అనేక ప్రాంతీయ పేర్లు కలిగిన దేవత మహాకాళి. ఈ దేవతకు తెలంగాణలో ఆషాఢ మాసమంతా ప్రజలు పండుగ చేసి బోనాలు ఎత్తుతారు. బోనం ఎత్తడమంటే అమ్మోరికి కృతజ్ఞతను తెలుపు కోవడమే! బోనాల మూలాలు 19వ శతాబ్దం నాటివి. ఆ సమయంలో వినాశ కరమైన ప్లేగు వ్యాధి జంట నగరాలను తాకింది. 1813లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక బెటాలియన్ ఈ అంటువ్యాధి నుండి ఉపశమనం కోసం మహాకాళి ఆల యంలో దేవిని ప్రార్థించింది. ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టగానే, బెటాలియన్ తిరిగి వచ్చి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని నిర్మించి, బోనాలను సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు మూల స్తంభంగా మారింది. 2014లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది.
ఈ పండుగకు పౌరాణిక ప్రాముఖ్యం కూడా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మహాకాళి దేవత తన తల్లిదండ్రుల ఇంటికి వార్షిక ఆగమనాన్ని సూచిస్తుంది. భక్తులు ఆమెను నైవేద్యాలతో స్వాగతిస్తారు. ఇది వివాహిత కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు ఆమెను లాలించడం లాంటిది. వేప ఆకులు, పసుపు, కుంకుమ, వెలిగించిన దీపం వంటివాటితో అలంకరించబడిన కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలలో బియ్యం, పాలు బెల్లం కలిపి వండిన పవిత్ర భోజనమే... బోనం! మహిళలు ఈ బోనాలను తలపై పెట్టుకుని దేవాలయాలకు తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్మిస్తారు. ఇలా బోనాలు తీసుకువెళ్లే ఊరేగింపుకు పోతరాజు నాయ కత్వం వహిస్తాడు. బోనాల పండుగను ఒక మతపరమైన పండుగ కన్నా ఎక్కువే అనాలి. కుటుంబాలు బోనం నైవేద్యాన్ని పంచుకుంటాయి. దాని తర్వాత మాంసాహార విందు, ఈత లేదా తాటి కల్లు సేవిస్తారు. వీధులు వేప ఆకులతో అలంకరించబడి జానపద పాటల గాలిని నింపుతాయి. కొన్ని ప్రాంతాలు ఆషాఢంలో కాకుండా శ్రావణంలో బోనాల పండుగ జరుపుకొంటాయి. ఆంధ్రప్రాంతంలో గ్రామ దేవతలకు ఆషాఢ, శ్రావణాల్లో కొలుపులు చేయడం బోనాల పండుగను పోలి ఉంటుంది.
– డా.జి. వెన్నెల గద్దర్
చైర్‌పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి