breaking news
fancy
-
ఫ్యాన్సీ నంబర్‌కు ఆన్లైన్ బ్రేక్
తణుకు : కొత్త వాహనం కొనుగోలు చేసినవారు గుర్తింపునిచ్చే (ఫ్యాన్సీ) నంబర్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. కొందరు తమకు ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. దీనిద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతోంది. అయితే జిల్లాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ కారణంగా ఫ్యాన్సీ నంబర్లకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించడంలో జరుగుతున్న జాప్యంతో నంబర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ నంబర్లను సీరియల్ ప్రకారం కేటాయిస్తున్నారు. జిల్లాలో కొత్త సిరీస్‌లు జిల్లాలో ఏలూరులోని ఉపరవాణాశాఖ కార్యాలయంతోపాటు భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు అనుసంధానంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాల్లో రవాణాశాఖ యూనిట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియతో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రతి కార్యాలయానికి కొత్త సిరీస్‌ను కేటాయించారు. ఆన్లైన్లో కొనసాగుతున్న సిరీస్‌కు అనుబంధంగా ఆఫ్‌లైన్‌లో కొత్తగా సిరీస్‌ను కేటాయించారు. దీనిలో భాగంగా ఏలూరుకు 37/డీఈ, భీమవరం 37/సీయూ, తణుకు 37/సీఎస్, కొవ్వూరు 37/సీఆర్, తాడేపల్లిగూడెం 37/సీక్యూ, జంగారెడ్డిగూడెం 37/సీవీ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌ల నంబర్ల కేటాయిస్తున్నారు. పాత సిరీస్‌లో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. పది నెలలుగా ఫ్యాన్సీ నంబర్ల కొరత ఏర్పడింది. ‘ఈ–బయ్’ ఎక్కడ..? ఆన్లైన్ ప్రక్రియలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు వీలుగా ‘ఈ–బయ్’ విధానం ప్రవేశపెట్టడానికి రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే నంబర్ దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనే వారంతా బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలి. వేలంలో నంబర్ దక్కని వారికి తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ‘ఈ–బయ్’ విధానానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.కోట్లు మేర ఆదాయం సమకూరుతుంది. ఒక్కో సిరీస్‌లో 0001 నుంచి 9999 వరకు నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఫ్యాన్సీ నంబర్‌కు కనీసం రూ.5 వేలు నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు ధర నిర్ణయించారు. కొన్ని నంబర్లను వేలంలో లక్షలు వెచ్చించి వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంతో కరెంట్ రిజర్వేషన్ కూడా నిలిచిపోయింది త్వరలో ఇబ్బందులు తొలగిస్తాం ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. ఆన్లైన్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్లు ఆహ్వానించి నంబర్లు కేటాయించాల్సి ఉంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాలేదు. త్వరలోనే ఇబ్బందులన్నీ తొలగించి ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణమూర్తి, డీటీసీ, ఏలూరు -
అతడు ఏలూరెళ్లాలి....
కథల నామకరణం - 3 సినిమాల్లో కూడా షావుకారు, మిస్సమ్మ పేర్లకే అలవాటు పడ్డారుగాని ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. చాలాసార్లు- బుద్ధి ఊరికే ఉండదు కదా- కొన్ని టైటిల్స్ ఫ్యాన్సీగా తడతాయి. వాటికి కథ రాయాలనిపిస్తుంది. ఆ రంధిలో దిగకపోవడమే మంచిది. ఇంటర్లో కథలు మొదలెట్టాక ‘సెంటర్లో శిలావిగ్రహం’ అనే టైటిల్ మీద కథ రాయాలని గట్టిగా అనుకున్నాను. అంటే ఏంటో తెలీదు. కనుక ఎప్పటికీ రాయలేదు. దావత్, జమీన్ కథలు రాశాక - మ్యూజిక్ అంటే కొంత ఆసక్తి గనక, మద్రాసులో రికార్డింగ్స్ అవీ చూసి ఉన్నాను గనక ‘కోరస్’ అనే టైటిల్ మీద కథ రాయాలని మనసు పీకింది. ‘కోరస్’ అనేది కచ్చితంగా కథకు పనికొచ్చే పేరే. కాని అందుకు తగ్గ కథేమీ నా లోపల లేకపోవడంతో రాయలేదు. ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు దర్శకుడు వంశీని కలుస్తూ ఉన్నప్పుడు దీని గురించి చెప్తే ఆయనకు సంగీతం చాలా ఇష్టం కనుక నేను రాస్తాను అని ఎంతో ఉత్సాహంగా ‘కోరస్’ పేరుతో కథ రాశారు. కాని చూపించకుండానే చింపేశారు. అంటే దానికి తగ్గ సమాచారం, అంత తీవ్రంగా స్పందించాల్సిన నిజాయితీ, అందుకు అవసరమైన సంకల్పం లేవని ఆయనకే అర్థమయ్యింది. కథ బాగ రాలేదు. కనుక కొన్ని పేర్లు పుట్టి గిట్టడమే మంచిది. ముందు నుంచీ మనకు కావ్యాలకుగానీ, కథలకుగానీ, సినిమాలకుగానీ ఒకటి రెండు పదాల్లో తేలే పేర్లే తప్ప పొడవు పేర్లు మరీ కవితాత్మకంగా ఉండే దీర్ఘమైన పేర్లు పెట్టే ఆనవాయితీ లేదు. ‘త్వమేవాహం’, ‘మహా ప్రస్థానం’, ‘ఋతు సంహారం’, ‘శేషజ్యోత్స్న’, ‘కృష్ణపక్షము’... ఇవే అలవాటు చేశారు. ‘అమృతం కురిసిన రాత్రి’ తక్కువ. కనుక నవ్యత కోసం ప్రయత్నించిన (అలా ప్రయత్నించడం మంచిదే అయినా) చాలా కవిత్వం పుస్తకాల పేర్లు మనకు గుర్తుండకుండా పోయాయి. ‘ఆమె స్పర్శ సోకినంత మేరా’.... అని ఒక కవితా సంపుటికి పేరు పెడితే ఒక క్షణం బాగుందే అనిపించవచ్చు కాని గుర్తు పెట్టుకోము. సులువుగా మననం చేసుకొని ఇతరులకు చెప్పలేము. ‘అలా అయితే పూలు ప్రవాసం వెళ్లాల్సిందే’ పేరు ఎంత బాగున్నా పాఠకులు ఇదొక పుస్తకానికి ఇష్టపడి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పేరు అని అనుకోరు. సినిమాల్లో కూడా ‘షావుకారు’, ‘మిస్సమ్మ’ పేర్లకే అలవాటు పడ్డారుగాని ‘ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ’ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. ఎన్టీఆర్ ఎంత పట్టుదలగా ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ అని పెట్టినా ఊళ్లలో అందరూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వచ్చిందట అని సులువు చేసుకున్నారు. తమిళులు అలా కాదు. ముందు నుంచీ వారు కవితాత్మక మకుటాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ‘ఒడ్డంతా చంపక పుష్పాలే’ అనేది ఒక నవల పేరు. ఇలా మనవాళ్లు పెట్టరు. ‘పసుపుపచ్చని ఎండ’, ‘బుగ్గ మీద ముద్దులాడింది’ ఇవి సినిమాల పేర్లు. ఇవి కూడా మనకు నప్పవు. కనుక మనం కథ రాసి సూటిగా ‘ఇంద్రధనస్సు’ అనే పేరు పెడితే తెలుగువాళ్లకు నచ్చుతుంది గుర్తుంచుకుంటారు తప్ప ‘ఒక ఇంద్రధనస్సు విరిసే ముందు’ అనంటే కాదనకపోయినా ఇబ్బందైతే పడతారు. కథకు పేరు ఇంటికి గడప వంటిది. పూరి గుడిసె గడప వేరు. పెంకుటిల్లు వాకిలి వేరు. రాజమహల్ సింహద్వారం వేరు. వీటిని ఒకదానికి ఒకటి పెడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో మకుటం గురి తప్పితే అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. మకుటం కుదిరి, ప్రవేశం అనాయాసంగా జరిగితే లోపల చెప్పే కథను పాఠకుడు చెవి ఒగ్గి వినే శ్రద్ధ పెరుగుతుంది. మామిడిచెట్టు (రావిశాస్త్రి), ఏలూరెళ్లాలి (చాసో), చూపున్న పాట (కెఎన్‌వై పతంజలి), వఱడు (అల్లం శేషగిరిరావు), మాడంత మబ్బు (కల్యాణసుందరి జగన్నాథ్), పొద్దుచాలని మనిషి (మధురాంతకం రాజారాం), పడవ ప్రయాణం (పాలగుమ్మి పద్మరాజు), ఊరబావి (కొలకలూరి ఇనాక్), చివరి గుడిసె (డా.కేశవరెడ్డి), తోడు (ఓల్గా), అతడు (అల్లం రాజయ్య), ఖాళీ సీసాలు (స్మైల్), మురళి ఊదే పాపడు (దాదాహయత్)... ఇలా ఎన్నో కథలు మంచి మకుటాలతో మకుటాలకు తగ్గ వస్తుబలంతో నిలబడ్డాయి. రచయితలను నిలబెట్టాయి. కనుక- ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రచయితగా పేరు రావాలంటే మనకు పేరు పెట్టడంసరిగా రావాలనే. - ఖదీర్