‘దూరదర్శని’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ వారం కూడా టాలీవుడ్లో చిన్న సినిమాల సందడే ఉంది. ఈ రోజు మూడు, నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘దూరదర్శని’. . కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. సువిక్షిత్, గీతికా రతన్ హీరోహీరోయిన్లుగా నటించారు. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. హరి(సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన గొప్పింటి అమ్మాయి వాణి(గీతికా రతన్) అంటే అతని చాలా ఇష్టం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమకి పేకబాబు(భాస్కర్) ఇల్లు అడ్డా అవుతుంది. ప్రతి రోజ రాత్రి టీవీ చూసేందుకు పేకబాబు ఇంటికి వెళ్లేవారు. హరి,వాణిల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం పేకబాబుకి తెలుస్తుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు..ఎలాగైన ఆమె నుంచి హరిని దూరం చేయాలనుకుంటాడు. అందుకోసం వాణి అన్నయ్య పరశురామ్(విజయ్ కృష్ణారెడ్డి)ని పావుగా వాడుతాడు. అతనికి లేనిపోనివి చెప్పి.. ఊర్లో కులాల చిచ్చు పెడతాడు. కొన్నాళ్ల తర్వాత వాణి, హరి ప్రేమించుకుంటున్నారనే విషయం పరశురామ్‌కి తెలుస్తుంది. తన చెల్లి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిదనే విషయం తెలిసిన తర్వాత పరశురామ్ ఏం చేశాడు? పేక రాజు చేసిన కుట్రకి ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమను దక్కించుకునేందుకు హరి, వాణిలు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు వీరి ప్రేమ కథ విషాదంగా ముగిసిందా లేదా సుఖాంతం అయిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ప్రస్తుతం టాలీవుడ్లో వింటేజ్ లవ్‌స్టోరీ ట్రెండ్ నడుస్తోంది. 80-90ల నాటి ప్రేమ కథలను తెరపై చూపిస్తూ.. ప్రేక్షకులకు అప్పటి రోజులను, తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. దూరదర్శని చిత్రం కూడా ఆ కోవకు చెందిన కథే. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదేమి కాదు. తక్కువ కులానికి చెందిన హీరో, పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం.. హీరోయిన్ ఫ్యామిలీ వీరి ప్రేమకు అడ్డుపడడం.. ఇద్దరి మధ్య సంఘర్షణ..చివరకు హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం..ఇలాంటి నేపథ్యంతో నైంటీస్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ కథను ఎంత సహజంగా చూపిస్తే.. అంత గొప్పగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే కథతో ప్రయాణం చేస్తాడు. ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయకుండా..చాలా నిజాయితీగా ఓ మంచి ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కథ రొటీన్‌గా ఉండడం.. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఇటీవల వచ్చిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. హీరో హీరోయిన్లు టీవీ చూసేందుకు ఒకరి ఇంటికి వెళ్లడం.. ప్రేమకి కులం అడ్డురావడం..ఇవన్నీ ఆ చిత్రాన్ని గుర్తు చేస్తాయి.ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ కథ చుట్టే సాగుతుంది. ఇద్దరు కలిసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఎంటర్టైనింగానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం పరశురాంకి తెలియడం.. హీరోపై దాడి చేయడం.. ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇక చివరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు ఎమోషనల్‌కి గురి చేస్తుంది. కథ, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సినిమాలో నటించిన వారంతా పెద్ద అనుభవం లేనివాళ్లే. అయినా కూడా బాగానే నటించారు. హరి పాత్రకి సువిక్షిత్ న్యాయం చేశాడు. ఆయన హవభావాలు అచ్చం అప్పటి పల్లెటూరి యువకుడిలాగానే ఉన్నాయి. పల్లెటూరి అమ్మాయి వాణిగా గీతికా రతన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పేకబాబు పాత్రలో భాస్కర్ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ అన్నయ్యగా విజయ్ కృష్ణారెడ్డి చాలా బాగా నటించాడు. హీరో ఫ్రెండ్స్ గా తేజ విహాన్, బాలరాజు పులుసు, పాండు నవ్వించారు. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.