breaking news
Dominated
-
సహనం బలం... సహన ఫలం
బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి. చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు. సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
విశ్వ వినాయకమ్
సెప్టెంబర్ 13 వినాయకచవితి సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథ గణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పార్వతి తయారు చేసిన వినాయకుడు శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోగా, ఏనుగు తలను తగిలించి తిరిగి బతికించినందున గజాననుడిగా, ఒకే దంతం మిగిలినందున ఏకదంతుడిగా, మోదకాలంటే ఇష్టం కలిగిన వాడు కావడంతో మోదకప్రియుడిగా, పెద్ద ఉదరం కలిగి ఉన్నందున లంబోదరుడిగా, మూషికాన్ని వాహనం చేసుకున్నందున మూషిక వాహనుడిగా, స్కందుడిగా పేరుపొందిన కుమారస్వామికి అన్న అయినందున స్కందాగ్రజుడిగా వినాయకుడు వినుతికెక్కాడు. వినాయకుడికి గల సహస్రనామాలు, ఆయన గురించిన ప్రసిద్ధ పురాణగాథలు వినాయక వ్రతకల్పంలో జనానికి తెలిసినవే. వినాయకుడి గురించిన కొన్ని అరుదైన అపురూపమైన విశేషాలు... పార్వతీదేవి స్నానం చేస్తుండగా నలుగుపిండి ముద్దతో వినాయకుడిని రూపొందించి, అతడికి ప్రాణం పోసిందనే కథనం అందరికీ తెలిసిందే. బాల వినాయకుడిని కావలి ఉంచగా, అతడు బయటి నుంచి కైలాసానికి తిరిగి వచ్చిన శివుడిని అడ్డగించి తలపడటం, శివుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం, ఏనుగు తలను తగిలించి అతడిని బతికించడం కూడా దాదాపు అందరికీ తెలిసిన సంగతే. వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది. గణపతిని ఎందుకు సృష్టించారంటే..? స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవులంటేనే దేవతలు భయపడే పరిస్థితి దాపురించింది. మానవులకు భయపడుతూ బతకడం దుస్సహంగా ఉందని, వాళ్లను ఎలాగైనా నియంత్రించాలని స్వర్గంలోని దేవతలందరూ దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు. తపస్సులు సాగించి స్వర్గానికి వచ్చిన వాళ్లను ఎలా నియంత్రించాలో దిక్కుతోచని దేవేంద్రుడు నేరుగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, వారిని పరిపరి విధాల స్తుతించాడు. ‘దేవేంద్రా! నీ రాకకు కారణమేమిటి?’ అని పరమేశ్వరుడు ప్రశ్నించగా, తన మొర వినిపించాడు. ‘పరమేశ్వరా! ఘోర తపస్సులు చేసి, తపః ఫలాల కారణంగా స్వర్గానికి చేరుకున్న మానవులు దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదేమని నిలదీసిన దేవతలను నానా రకాలుగా బాధిస్తున్నారు. వారి దాష్టీకాలకు స్వర్గంలో ప్రశాంతత లేకుండా పోయింది. మానవజాతి అంటేనే దేవతలు భయభ్రాంతులయ్యే పరిస్థితి దాపురించింది. మానవుల బెడద నుంచి మమ్మల్ని నీవే కాపాడాలి తండ్రీ!’ అని వేడుకున్నాడు. దేవేంద్రుడి మాటలు విన్న పరమేశ్వరుడు సాలోచనగా పార్వతీదేవి వైపు చూసి చిరునవ్వు చిందించాడు. అప్పుడు పార్వతీదేవి మట్టి తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందించింది.ఏనుగు ముఖం, పెద్దబొజ్జ, భారీ శరీరం, నాలుగు చేతులు కలిగిన వింత ఆకారం ప్రాణం దాల్చి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, పార్వతీదేవితో ఇలా అన్నాడు. ‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో చెబుతారా?’అందుకు పార్వతీ దేవి, ‘నాయనా! నీవల్ల నెరవేరవలసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న మానవులకు విఘ్నాలు కలిగించు. ఈ బృహత్కార్యంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారు’ అని బదులిచ్చింది. ప్రమథ గణాలకు అధిపతిగా తానే స్వయంగా గణేశుడికి అభిషేకం చేయించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన దేవతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గణేశునికి జయజయ ధ్వానాలతో ఆశీస్సులు పలికి, పుష్పవృష్టి కురిపించారు. పరమేశ్వరుడు గణపతికి పరశువును, బ్రహ్మ తికాలజ్ఞతను, విష్ణువు బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని , సూర్యుడు పరాక్రమాన్ని, చంద్రుడు కాంతిని, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని, పార్వతీదేవి మోదకపాత్రను ఇచ్చారు. కుమారస్వామి మూషికాన్ని గణేశునికి వాహనంగా బహూకరించాడు. ఇలా దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చి, గణేశుని గణాధిపత్యాన్ని ఆమోదించడంతో అతడు అమిత బలశాలిగా మారి, పార్వతీదేవి అనుజ్ఞతో దేవతలంతా తనపై ఉంచిన కార్యభారాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి పయనమయ్యాడు. స్వార్థబుద్ధులై స్వర్గప్రాప్తిని ఆశించే మానవులకు ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడు. వినాయకుడు కల్పించిన విఘ్నాలను అధిగమించడం మానవులకు దుస్సాధ్యంగా మారింది. వినాయకుడి ప్రభావంతో స్వర్గలోకానికి వెళ్లే మానవుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.స్వర్గంలో తిరిగి ప్రశాంతత ఏర్పడింది. మానవుల్లో గణపతి పట్ల భయభక్తులు ఏర్పడ్డాయి. అందుకే ఏ పని మొదలుపెట్టినా, విఘ్నాలు తొలగించుకోవడం కోసం వినాయకుడికి తొలిపూజలు చేయడం ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి అనుగ్రహం పొందిన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఆయనకు ఆగ్రహం కలిగిస్తే విఘ్నాలు తప్పవనే నమ్మకం బలపడింది. వినాయకుడు అవతరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక వ్రతం ఆచరించడం అప్పటి నుంచే మొదలైందని ప్రతీతి. వినాయకుడు ఎలా ఏకదంతుడయ్యాడంటే..? వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవట. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. అదెలాగంటే... కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ‘ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడద’న్నాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి‘ అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు. ప్రణవరూపుడు వినాయకుడు ప్రణవరూపుడు. ప్రణవనాదమైన ఓంకారం ఆకారంలోనే వినాయకుడు కనిపిస్తాడు. దేవనాగరి లిపిలోని ఓంకారం ఆకారంలోనే చాలా వరకు పురాతన వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఉపపురాణాలలో వినాయకుని ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుని గురించిన విపులమైన కథనాలు గణేశ పురాణంలోను, ముద్గల పురాణంలోను కనిపిస్తాయి. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అవి: వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు. ఈ ఎనిమిదింటిలోనూ ఐదు అవతారాలకు వినాయకుని వాహనం ఎలుక. వక్రతుండ అవతారానికి సింహం, వికటావతారానికి నెమలి, విఘ్నరాజ అవతారానికి శేషువు వాహనాలు. గణేశ పురాణం ప్రకారం వినాయకునికి నాలుగు అవతారాలు ఉన్నాయి. అవి: మహోటక అవతారం, మయూరేశ్వర అవతారం, ధూమ్రకేతు అవతారం, గజానన అవతారం. మహోటక అవతారానికి సింహం, మయూరేశ్వర అవతారానికి నెమలి, ధూమ్రకేతు అవతారానికి గుర్రం, గజానన అవతారానికి ఎలుక వాహనాలుగా ఉన్నట్లు గణేశ పురాణ కథనం. చారిత్రకంగా చూసుకుంటే తొలినాటి వినాయక శిల్పాలలో ఎక్కడా ఎలుక వాహనం కనిపించదు. ఏడో శతాబ్ది తర్వాతి నాటి శిల్పాలలో మాత్రమే వినాయకునితో పాటు ఎలుక వాహనం కనిపిస్తుంది. పురాణాల్లో చూసుకుంటే మత్స్య పురాణంలో వినాయకుని మూషిక వాహన ప్రస్తావన తొలిసారిగా కనిపిస్తుంది. ఎలుకను తామస ప్రవృత్తికి చిహ్నంగా భావిస్తారు. ఎలుకపై స్వారీ చేయడం ద్వారా వినాయకుడు మానవులలోని కామ క్రోధ లోభ మోహాది తామస ప్రవృత్తిని నియంత్రిస్తాడని ప్రతీతి. వినాయకుని ముందు ఎందుకు గుంజీలు తీస్తారంటే..? వినాయక వ్రతం ఆచరించిన వారు పూజ ముగించిన తర్వాత వినాయకుడి ముందు గుంజీలు తీయడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు. బావగారైన శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద తదితర ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని, అమాంతం అప్పడంలా నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో మరచానేమోనని సుదర్శనం కోసం వెదకడం ప్రారంభిస్తాడు. విష్ణువు వెదుకులాడుతుండటం చూసిన వినాయకుడు ‘మామా! దేనికోసం వెదుకుతున్నావు?’ అని అడిగాడు. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరచాను. దాని కోసమే వెదుకుతున్నాను’ అని చెప్పాడు విష్ణువు. ‘ఓహో! సుదర్శనమా! దానిని నేను మింగేశాగా!’ అని నవ్వుతూ అన్నాడు వినాయకుడు. బాలుడైన వినాయకుడిని ఏమీ చేయలేక తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని నానా రకాలుగా బతిమాలుకుంటాడు. గణపతి విష్ణువు బతిమాలుతున్న కొద్దీ నవ్వుతూ అతడిని ఆటపట్టిస్తాడు. అప్పుడు అంతటి మహావిష్ణువు తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో అతడి కడుపున ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువంతటి వాడు వినాయకుడి ముందు గుంజీలు తీయడంతో వినాయక వ్రత పూజ తర్వాత గుంజీలు తీయడం ఆచారంగా మారింది. వినాయకుడి కుంటుంబం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడని సాధారణంగా తెలిసిన విషయం. అయితే, వినాయకుని జననానికి సంబంధించి పురాణాలలో రకరకాల గాథలు ఉన్నాయి. పార్వతి నలుగు పెట్టుకునేటప్పుడు నలుగుపిండితో వినాయకుడిని రూపొందించినట్లుగా చెబుతున్న గాథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, శివుడే ఇతడిని సృష్టించాడని, పుణ్యక వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి వినాయకుడిని కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడిని సృష్టించారని, స్వయంభువుగా వెలసిన వినాయకుడిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని... ఇలా రకరకాల గాథలు ఉన్నాయి. వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. ఇతడికే కార్తికేయుడని, స్కందుడని కూడా అంటారు. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని గాథలలోను, అతడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని మరికొన్ని గాథలలోను ఉంది. శివపురాణం ప్రకారం వినాయకుడికి క్షేమం, లాభం అనే ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారని ప్రతీతి. సనాతన సంప్రదాయంలో ఆరు మతాలు ఉన్నాయి. వీటినే షణ్మతాలు అంటారు. అవి: శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కంద మతాలు. వీటిలో శైవ వైష్ణవ మతాలు మాత్రమే ఇప్పటికీ ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. శాక్తేయం కొంతవరకు ఉనికిలోల ఉన్నా, ఆరాధన పద్ధతులు చాలావరకు మారాయి. చరిత్రను తరచి చూస్తే క్రీస్తుశకం ఆరో శతాబ్ది వరకు స్కంద ఆరాధన ఎక్కువగా ఉండేది. స్కందుని పూజను వీర పూజ అనేవారు. ఆరో శతాబ్ది తర్వాతి నుంచి వినాయకుని ఆరాధన క్రమంగా పెరిగింది. వినాయకుని ఆరాధనకు ప్రాచుర్యం పెరిగిన తొలినాళ్లలో గాణపత్య మతం ప్రత్యేక మతంగా ఉనికిలో ఉండేది. గాణపత్యాన్ని అవలంబించే వారిలో కొందరు గణపతిని తాంత్రిక పద్ధతుల్లో పూజించేవారు కూడా. ఉచ్చిష్ట గణపతి సాధన వంటి తాంత్రిక ఆరాధనలు అప్పట్లో మొదలై ఉంటాయని చరిత్రకారుల అంచనా. వినాయకుని తొలినాటి శిల్పాలు అఫ్ఘానిస్థాన్‌లో దొరికాయి. ఇవి క్రీస్తుశకం నాలుగో శతాబ్దం నాటివని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉదయగిరి గుహలు, రామగఢ్ కొండ, భుమరా ఆలయంలో కూడా వినాయకుని అతి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుప్తుల కాలం నాటివని, అంటే సుమారు క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటివని చెబుతున్నారు. గణపతిని ప్రధాన దైవంగా ఆరాధించే గాణపత్య మతం క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికి బాగా ప్రాచుర్యంలో ఉండేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. విదేశాల్లో వినాయకుడు భారత ఉపఖండం నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు–ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్‌లోని లోరెస్తాన్ ప్రావిన్స్‌లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోను, తైత్తరీయ అరణ్యకంలోను కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు -
ఫ్రంట్‌తోనే ఆధిపత్యానికి చెక్!
సందర్భం కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. రాజకీయాలు కూడా ఉపాంత ప్రయోజనం సూత్రానికి అతీతం కాదన్న విషయం గత నాలుగేళ్లుగా సాగుతున్న మోదీ పర్వం చూస్తే అర్థమవుతుంది. 2014లో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో అధికారానికి వచ్చిన బీజేపీ నేడు ప్రతిపక్ష ముక్త భారత్ నినాదమిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విధానపరంగా చూసినపుడు బీజేపీకి నికరమైన ప్రతిపక్షంగా ఉన్నది వామపక్షం మాత్రమే. సాధారణ ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి విధానపరమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి మధ్య తేడా ఉంటుంది. అందుకే బీజేపీ మోదీ నేతృత్వంలో ముప్పేట వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి వ్యూహం కాంగ్రెస్ తిరిగి కోలుకోకుండా చేసే ప్రయత్నం. రెండో వ్యూహం విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వామపక్షాల పాత్రను కుదించే యత్నం. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఆరెస్సెస్‌లు అనుసరించిన వ్యూహం ఈ కోవకే వస్తుంది. మూడోది అవసరమైన మిత్రులను కూడదీసుకుని, అవసరం లేని మిత్రులను సాగనంపే వ్యూహం. తాజాగా చర్చనీయాంశమవుతోంది ఈ మూడో వ్యూహమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సమకూరటంతో సంకీర్ణ రాజకీయాలకు తెరపడనున్నదా అన్న ప్రశ్నను ముందుకు తెచ్చారు. నాలుగేళ్లు గడిచాక తిరిగి దేశం ఆ ప్రశ్నను గుర్తు తెచ్చుకొంటోంది. పార్లమెంట్లో ఉన్న సంఖ్యాబలం పొందికను పరిశీలిస్తే గత పాతికేళ్లుగా ప్రాంతీయ పార్టీలు కనీసం సగం స్థానాలు గెల్చుకుంటూ వచ్చాయి. దేశవ్యాప్తంగా పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీలు ఉమ్మడిగా సగం స్థానాలకు మాత్రమే పరిమితమ వుతూ వచ్చాయి. బీజేపీ తన రాజకీయాధిపత్యాన్ని కొనసాగించుకోవాలంటే ప్రాతీయ పార్టీల కోటలకు గండి కొట్టకుండా సాధ్యంకాదు. ప్రతిపక్ష రహిత పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. గత మూడేళ్లుగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని (దుర్) వినియోగిస్తున్న తీరు గమనిస్తే రాజకీయ రంగంలో బీజేపీ అనుసరిస్తున్న పెత్తందారీ పోకడలు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అథారిటేరియనిజంకి వ్యతిరేకంగా నాటి ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. భారత రాజకీయాల్లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంగా గుర్తింపు పొందింది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సాగించే రాజకీయ పోరాటం రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న వ్యూహంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కుల కోసం వివిధ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి నడుం కడితే రాష్ట్రాల ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పరిరక్షణ నినాదం ముందుకొచ్చినపుడు గత మూడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయం వెతక్కుండా రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకోవటం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం నేపథ్యంలోనే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంఘటితం చేస్తూ సర్కారియా కమిషన్ తెరమీదకు వచ్చింది. అది కల్పించిన ప్రత్యేకతలన్నీ ఆర్థిక విధానాల నేపథ్యంలో కుదించుకుపోతూ వచ్చాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్థిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక ద్రవ్య సంబంధాలను ఉదారవాద విధానాల చట్రం పరిధి దాటిపోకుండా చూస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. ప్రాంతీయ పార్టీల కూటమి గానీ లేదా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ గానీ రాజ్యాంగ స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ పోకడలు, లౌకికతత్వ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక స్వావలంబన విధానాలు అమలు జరపగలిగే స్వేచ్ఛ, అంతిమంగా రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తి పరిరక్షణ లక్ష్యాలుగా పెట్టుకోవాలి. బీజేపీ పెత్తందారీ పోకడలను నిలువరించటమే నేటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం లక్ష్యంగా మారాలి. - కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు
-
డాలర్ డామినేషన్: ఆయిల్ ధరలు పతనం
న్యూయార్క్ : ఓ వైపు మధ్య ప్రాచ్య దేశాల్లో పెరిగిన క్రూడ్ ఉత్పత్తి.. మరోవైపు బలమైన డాలర్ విలువతో మంగళవారం అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్లో ఆయిల్‌కు, ఇతర కరెన్సీలకు సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ డాలర్ విలువ ఆధిపత్య స్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ అక్టోబర్ డెలివరీ న్యూయార్క్ మేర్కన్టైల్ ఎక్స్ఛేంజ్లో బ్యారల్ 0.67 డాలర్లు నష్టపోయి 46.97 డాలర్ల వద్ద స్థిరపడింది. అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ అక్టోబర్ డెలివరీ లండన్ ఐసీఈ ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్లో బ్యారల్ 0.66 డాలర్లు పడిపోయి 49.26 బాలర్లగా నమోదైందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టుచేసింది. ఇరాక్ తన దక్షిణ పోర్ట్స్ నుంచి ఆగస్టులో క్రూడ్‌ను ఎక్కువగా ఎగుమతి చేసిందని, ఈ ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఆయిల్ మంత్రి శనివారం మీడియాకు వెల్లడించారు. దీంతో డాలర్ ఇండెక్స్‌లో ఆయిల్ ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వడ్డీరేట్లు పెంచే అవకాశాలు పెరిగాయంటూ ఫెడరల్ రిజర్వు చైర్ పర్సన్ జానెట్ యెలెన్ చేసిన చేసిన వ్యాఖ్యాల నేపథ్యంలో డాలర్ భారీగా పుంజుకుంది. మరోవైపు నుంచి ఫెడరల్ రిజర్వు ఈ ఏడాది చివర్లో వడ్డీరేట్లు పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ మూడు వారాల గరిష్ట స్థాయిలో నమోదైంది.. -
మారుతీ మళ్లీ టాప్
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (14,057 యూనిట్లు), కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (14,042 యూనిట్లు), వేగన్ ఆర్ (12,744 యూనిట్లు) మోడళ్లు సహా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,934 యూనిట్లు), ఎలైట్ ఐ20 (9,604 యూనిట్లు), హోండా సిటీ (8,037 యూనిట్లు), మారుతీ బాలెనో (7,698 యూనిట్లు), మారుతీ సెలెరియో (7,141 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (6,589 యూనిట్లు) ఉన్నాయి. -
ఆధిపత్యం కోసం..
ఆందోళనల వెనుక అదృశ్య హస్తం అధ్యాపక నియామకాల్లో అవకతవకలు లేవంటున్న అధికారులు అధికారులకు అండగా నిలిచిన అసోసియేషన్లు ముఖ్యమంత్రిని కలిసేందుకు రాజధానికి పాలకమండలి యూనివర్సిటీక్యాంపస్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంపై ఆధిపత్యం కోసం తెరవెనుక పోరు కొనసాగుతోంది. రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న వర్సిటీలో మూడు రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. మహిళా యూనివర్సిటీలో మూడు రోజుల క్రితం అధ్యాపక నియామక ఉత్తర్వులు ఇచ్చారు. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అప్పటినుంచి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) ఆందోళనలు చేస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ఆధిపత్యం కోసమే జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 43 అధ్యాపకుల పోస్టుల భర్తీకోసం 2013 డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదలైయింది. వీటిలో 18 అసిస్టెంట్, 12 ప్రొఫెసర్, 13 అసోసియేట్ పోస్టులున్నాయి. వీటి భర్తీకోసం 2014 మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే అనంతరం పాలకమండలి సమావేశం జరగకపోవడంతో నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 28న పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. దీంతో అధికారులు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నియామకాలను తప్పుబడుతూ కేవలం టీఎన్ఎస్ఎఫ్ మాత్రమే ఆందోళనకు దిగింది. ఈ ఆందోళన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారని మహిళా యూనివర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. ఎలాంటి అక్రమాలు లేవు నియామకాలపై ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో వీసీ రత్నకుమారి ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో చర్చలు జరిపారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిపామని ఎలాంటి అక్రమాలు చేయలేదని వివరించే ప్రయత్నం చేశారు. అయితే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సంతృప్తి చెందలేదు. నియామక ప్రక్రియ మొత్తం నిబంధనల మేరకు జరిపామని వీసీ రత్నకుమారి మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అభివృద్ధికోసం రెండన్నర సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చేశామని అందులోభాగంగానే అధ్యాపక పోస్టుల భర్తీని పారదర్శకంగా చేశామని ఆమె ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మీడియాకు వివరించారు. వీసీకి మద్దతు తెలిపిన సంఘాలు శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని బోధన, బోధనేతర సంఘాలు వీసీ రత్నకుమారికి మద్దతుగా నిలిచాయి. వీసీ రత్నకుమారి పనిచేసిన కాలంలో వర్సిటీ అభివృద్ధికోసం ఎంతో పాటుపడ్డారని, అందులో భాగంగానే అధ్యాపక నియామకాలను పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా చేశారని చెబుతున్నారు. యూనివర్సిటీకి ఎంతో అభివృద్ధి చేస్తున్న వీసీ పట్ల అసత్య ఆరోపణలు చేయవద్దని పై రెండు సంఘాలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థినాయకులు శాంతియుతంగా సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నారు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాజధానికి అధికారులు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన విషయాలను వివరించేందుకు వీసీ రత్నకుమారి, రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మీలు హైదరాబాద్‌కు వెళ్లారు. నియామకాలకు సంబంధించిన అన్ని రికార్డులతో వారు ఉన్నతాధికారులను కలసి ఏమి జరిగిందో వివరించనున్నారు. ఉ న్నత విద్యాశాఖా అధికారులను బుధవారం కలవనున్నారు. అధ్యాపక నియామకాలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు వివరిస్తామని రిజిస్ట్రార్ విజయలక్ష్మి సాక్షికి తెలిపారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తామని చెప్పారు.