breaking news
Dental student suspicious death
-
రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి
తూర్పు గోదావరి జిల్లా: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెంటిస్ట్‌గా బీడీఎస్ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్‌చెరువులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్‌షిప్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ చదువుతున్న కిశోర్‌తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు. శోకసంద్రంలో చాగల్లు లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్ నాదేండ్ల శ్రీరామ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. -
భర్త వేధింపులు: హాస్టల్లో తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య
రాయచూరు రూరల్: భర్త వేధింపులను భరించలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. నవోదయ దంత వైద్య కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న శృతి (26) సోమవారం రాత్రి హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని మహిళా పీఎస్ సీఐ గుండూరావ్ తెలిపారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శృతికి గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. లాక్డౌన్ కావడంతో సొంతూరులో ఇంటి నుంచి పనిలో ఉన్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శృతి బాధపడేది. దీంతో జీవితం మీద విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. -
హారికను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హారికను హత్య చేసి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు పలు ఆధారాలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం హారికను ఏవిధంగా హతమార్చారన్నది తెలుస్తాయన్నారు. కాగా రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిషికుమార్‌తో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన బాణోతు హారిక (24)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. ఇద్దరూ వరుసకు బావామరదళ్లు. ఇటీవలే హారిక కామినేనిలో బీడీఎస్‌లో చేరింది. అయితే ఆమెకు ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్ప స్ధితిలో నిప్పుంటుకొని మృతి చెందింది. భార్య కిరోసిన్ పోసుకుని చనిపోయినట్లు భర్త రిషికుమార్ హారిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని అల్లుడే చంపాడని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని హారిక తమతో చాలాసార్లు చెప్పిందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సర్దుకుపోవాలని తాము సూచించామన్నారు. ఎంబీబీఎస్‌లో సీటు వస్తేనే కాపురానికి రావాలని తమ అల్లుడు వేధించేవాడని చెప్పారు. రిషికుమార్‌కు బయట వేరేవాళ్లతో ఎఫైర్ ఉందని, అంతేకాకుండా అదనపు కట్నం కావాలని వేధించేవాడని హారిక సోదరి తెలిపింది. తన చెల్లెలును... భర్త, అతని కుటుంబసభ్యులు హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. రిషికుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


