breaking news
Dawn news paper
-
అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌పై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. శత్రు దేశానికి పట్టుబడతానని, ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటానని తెలిసి కూడా భయభ్రాంతులకు లోనుకాకుండా అతను కర్తవ్యం మరువలేదని పేర్కొంది. మంటల్లో పడి కాలి బూడిదయ్యే పరిస్థితుల నుంచి బయటపడిన అభినందన్ తెలివిగా వ్యవహరించి తన వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేశాడని కొనియాడింది. కాగా, మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో దిగిన అభినందన్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. (తనను చూస్తే గర్వంగా ఉంది : అభినందన్ తండ్రి) పాకిస్తాన్‌కు చెందిన డాన్ వార్తా పత్రిక కథనం ప్రకారం.. నడుముకు పిస్టల్‌తో ఉన్న ఓ పైలట్ పాక్ భూభాగంలో దిగాడు. అక్కడున్న కొందరు యువకుల్ని ‘ఇది ఇండియానా..? పాకిస్తానా?’ అని అడిగాడు. దాంతో అక్కడున్న యువకుల్లో ఒకరు చాకచక్యంగా ఇది ఇండియా అని బదులిచ్చాడు. దాంతో భారత్ మాతాకి జై అంటూ అభినందన్ నినాదాలు చేశాడు. ‘నా నడుము విరిగిపోయింది. దాహంగా ఉంది. తాగడానికి మంచినీరు కావాలి’ అని అడిగాడు. అయితే, అక్కడున్న యువకుల్లో కొందరు అభినందన్ భారత నినాదాలు చేయడంతో కోపం పట్టలేకపోయారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. (ఎవరీ అభినందన్?) విషయం అర్ధమైన అభినందన్ పిస్టల్ బయటకు తీశాడు. దీంతో యువకులు రాళ్లు పట్టుకుని అతనిపైకి దాడికి యత్నించారు. వారందరినీ గన్‌తో బెదిరించి.. గాల్లోకి కాల్పులు జరుపుతూ.. నడుముకు అంత పెద్ద గాయమైనా అతను అరకిలోమీటరు దూరం పరుగెత్తాడు. నీటి కాలువలో దాక్కుని తన జేబులో ఉన్న కొన్ని పత్రాలను మింగేశాడు. మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేశాడు. ఇదిలాఉండగా.. ఫైటర్ జెట్ కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో అభినందన్ కిందకి దూకేశాడని, ఆ క్రమంలోనే అతను తీవ్రంగా గాయపడి ఉండొచ్చని డాన్ పత్రిక అభిప్రాయపడింది. అయితే, పాక్ భూభాగంగలో పడిపోయిన అభినందన్‌కు తీవ్రంగా కొడుతున్న వీడియో ఒకటి బయటకి రావడంతో తీవ్రం కలకలం రేగింది. (త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ) యుద్ద ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పాక్ మరో వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. మీ లక్ష్యం ఏంటని పాక్ అధికారులు అడిగిన ప్రశ్నకు.. జవాబు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు. ఇక భారత జవాన్ వీరోచితంపై కథనం రాస్తే అక్కడి పాఠకులు ఆమోదించరని తెలిసి కూడా డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించడం గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు. -
టమాటో కిలో@ 300..
ఢిల్లీ : టమాటో ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ పౌరుడు నిత్యవసరాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. అయినా రాజకీయ నాయకులు మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. వారి నుంచి నిత్యవసరాల దిగుమతులను చేసుకోం అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఇది పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్పేపర్లో ప్రచురించిన ఓ అభిప్రాయం. పాకిస్తాన్‌లోని లాహోర్, మరికొన్ని పట్టణాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ. 300 పలుకుతుండటం సగటు పౌరుడికి మింగుడుపడనివ్వడం లేదు. దీనిపై స్పందించిన ఓ పాకిస్తానీ మంత్రి ' మన రైతులు ఉండగా.. విదేశీ రైతులపై ఆధారపడటం దేనికీ' అని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి దిగుమతులు మళ్లీ ప్రారంభించేలా చేయడానికే ఏవో దుష్టశక్తులు ఈ కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఓ సారి మంత్రిగారి తలపై ట్రక్కు టమాటాలను కుమ్మరిస్తే విషయం అర్థమవుతుంది అంటూ పత్రికలో రచయిత వ్యాఖ్యానించారు. జాతీయత పేరుతో పౌరుల కడుపు కాల్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. లాహోర్‌లో కిలో రూ.300 పలుకుతున్న టమాటో.. అక్కడి నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న అమృతసర్‌లో రూ.40కే దొరుకుతున్నాయని చెప్పారు. -
పాక్ చెరలో భారత సైనికుడు!
ముజఫరాబాద్: భారత దాడులను పాక్ తిప్పికొట్టిందని పాక్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. ప్రతిదాడుల్లో ఓ భారత జవానును బందీగా పట్టుకోగా ఎనిమిది మందిని చంపేసినట్లు తెలిపింది. భారత దాడుల్లో ఇద్దరు పాక్ జవాన్లు మృతిచెందారని పేర్కొంది. బందీగా పట్టుకున్న జవాను మహారాష్ట్రకు చెందిన చందు బాబూలాల్ చౌహాన్(22) అని తెలిపింది. అయితే ఈ వార్త నిజం కాదని భారత్ పేర్కొంది. ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ గౌతమ్ బాంబావాలేను పిలిపించిన పాక్ విదేశాంగ శాఖ.. భారత దాడులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై వీటిని దాడులను సహించేది లేదని, సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.