breaking news
dark matter
-
విశ్వానికి అంతముంది!
అనంత విశ్వం మనిషికి ఎప్పుడూ మిస్టరీయే. దాని పుట్టుక, వికాసం, విస్తరణ తదితరాలు ఎప్పుడూ అబ్బురపాటు కలిగించే విషయాలే. సైంటిస్టులు ఎంతగా ప్రయత్నిస్తున్నా వాటి గుట్టుమట్లను నేటికీ విప్పలేకపోయారు. విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా అంతా విశ్వసిస్తూ వస్తున్న సిద్ధాంతం. అది తప్పని, ఇంతటి ‘అనంత’ విశ్వానికీ ఏదోనాటికి అంతం కచ్చితంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి అంటోంది! కృష్ణపదార్థంపై జరిగిన విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన కొత్త వివరాల ఆధారంగా ఈ మేరకు తేల్చింది! కృష్ణ పదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ ఆస్కారం లేకుండా స్థిరంగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. అందుకే దాన్ని అంతరిక్ష స్థిరాంకమనీ అంటారు. కానీ ఆ భావన నిజం కాదని, కృష్ణపదార్థం నానాటికీ విస్తరిస్తోందని అధ్యయనంలో తేలింది! దీనిపై ఖగోళ శాస్త్రవేత్తల్లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘విశ్వావిర్భావపు గుట్టును కనిపెట్టేందుకు, పలు అంతరిక్ష రహస్యాల చిక్కుముళ్లను విప్పేందుకు ఇది అత్యంత కీలక ఆధారం కానుంది. అంతేగాక మొత్తంగా విశ్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అవగాహననే సమూలంగా మార్చేయగలదు’’ అని వారంటున్నారు. ఏమిటీ పదార్థం? డార్క్ ఎనర్జీ. కృష్ణపదార్థం. అనంత విశ్వంలో మూడొంతులకు పైగా విస్తరించిన పదార్థం. అయినా ఇప్పటికీ మనిషికి అంతుచిక్కని, అతని మేధకు అందని దృగి్వషయం. దాని ఉనికి వాస్తవమే అయినా నిజానికి అదేమిటో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విశ్వ విస్తరణను వేగవంతం చేసే శక్తిగా కృష్ణపదార్థాన్ని సైంటిస్టులు నిర్వచిస్తారు. దాని ఆనుపానులను కనిపెట్టేందుకు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ కొలాబరేషన్ (దేశీ) పేరుతో నాలుగేళ్ల క్రితం 900 మంది అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు బృందంగా ఏర్పడ్డారు. అరిజోనాలోని టక్సన్ అబ్జర్వేటరీలో మేయల్ టెలిస్కోప్ తాలూకు దాని 5,000 ఫైబర్ ఆప్టిక్ లెన్సుల సాయంతో అంతరిక్షాన్ని ఆమూలాగ్రం వడపోస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 5 వేలకు పైగా గెలాక్సీల నుంచి వెలువడే కాంతిని ఏకకాలంలో పరిశీలిస్తున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది సర్వే పూర్తయ్యేనాటికి దేశీ ఏకంగా 5 కోట్ల గెలాక్సీల నుంచి వచ్చే కాంతిని ‘దేశీ’ లెక్కగట్టనుంది! 1,180 కోట్ల ఏళ్ల పై చిలుకు వికాస క్రమంలో విశ్వాన్ని కృష్ణపదార్థం ఎలా ప్రభావితం చేస్తూ వచ్చిందో తేల్చడమే ఈ అధ్యయన లక్ష్యం. మూడేళ్ల ‘దేశీ’ డేటాను సైంటిస్టులు తాజాగా విశ్లేషించారు. అది అందజేసిన 1.5 కోట్ల గెలాక్సీల కాంతికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేశారు. ఫలితంగా ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు దేశీ సహ సారథి, డాలస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ముస్తఫా ఇషాక్ బౌషాకీ తెలిపారు. ‘‘కృష్ణపదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ లోనవదన్నది వాస్తవం కాదు. అది విస్తరిస్తోందని, అంతేగాక అప్పుడప్పుడూ అనూహ్యంగా కూడా ప్రవర్తిస్తోందని వెల్లడైంది. ఆ క్రమంలో కృష్ణపదార్థం కొన్నిసార్లు బలహీనపడుతోంది కూడా. ఆ లెక్కన అంతిమంగా విశ్వంపై దాని ప్రభావం క్రమంగా క్షీణిస్తూ ఏదో ఒకనాటికి సున్నా అవుతుంది. మరోలా చెప్పాలంటే విశ్వ విస్తరణ వేగం క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా నిలిచిపోతుంది. అక్కడినుంచి విశ్వం కుంచించుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. అది క్రమంగా వేగం పుంజుకుని ఒకనాటికి ఈ విశ్వపు ఉనికే లేకుండా పోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఇదంతా జరిగేందుకు కనీసం కొన్ని వందల కోట్ల ఏళ్లకు పైగా పట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృత నక్షత్రాల్లో ఘోస్ట్ పార్టికిల్ ఆనవాళ్లు..!
వాషింగ్టన్: అణు నిర్మాణం తెలిసిన వాళ్లకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటికన్నా సూక్ష్మమైనవి, కీలకమైనవి పలు అణువుల్లో ఉంటాయని ఆధునిక భౌతిక శాస్త్రం వెల్లడిస్తోంది. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మ అణువులలో చాలావాటి ఉనికిని గుర్తించడం కూడా జరిగింది. అయితే చాలా దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా దాగుడుమూతలు ఆడుతున్న ఒక పార్టికిల్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ఈ అంతుచిక్కని పార్టికిల్‌కు సైంటిస్టులు ముద్దుగా ‘ఘోస్ట్ పార్టికిల్’ అని పేరు పెట్టుకున్నారు. దీని శాస్త్రీయ నామం ‘యాక్జియాన్’. తాజాగా ఈ పార్టికిల్ ఆనవాళ్లు డెడ్ స్టార్స్(మృత నక్షత్రాలు) వెలువరించే ఎక్స్‌రే కిరణాల్లో కనిపించాయి. అమెరికాకు చెందిన చంద్ర టెలిస్కోప్ ద్వారా ఈ ఎక్స్‌రేలను గుర్తించారు. వీటి ఉనికి స్పష్టంగా బయటపడితే విశ్వ రహస్యాల్లో కొన్ని కీలకమైనవాటి గుట్టు బయటపడుతుందని సైంటిస్టులు సంబరపడుతున్నారు. ముఖ్యంగా ‘డార్క్ మ్యాటర్’ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. తాజా పరిశోధన వివరాలు ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో పబ్లిష్ అయ్యాయి. మిన్నిసోటా యూనివర్సిటీకి చెందిన రేమండ్ కో అభిప్రాయం ప్రకారం ’’ యాక్జియాన్స్ ఉనికి గుర్తించడం ఫిజిక్స్‌లో అతిపెద్ద ఘటనల్లో ఒకటి. ఇప్పటివరకు ఇవి ఉన్నాయని మాత్రమే నమ్ముతున్నాం. తొలిసారి వీటి ఉనికి స్పష్టంగా డెడ్స్టార్స్ నుంచి విడుదలయ్యే ఎక్స్‌రేల్లో కనిపించింది. మ్యాగ్నిఫిసెంట్ సెవెన్గా పిలిచే న్యూట్రాన్ స్టార్స్ నుంచి రావాల్సిన మోతాదుకు మించి ఎక్స్‌రే ఉద్ఘాటన గుర్తించారు. ఈ అదనపు ఎక్స్‌రేలు సదరు నక్షత్ర కోర్ భాగంలో ఉన్న యాక్జియాన్స్ వల్ల వచ్చాయని చెప్పవచ్చు’’ అని వివరించారు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఢీకొన్నప్పుడు ఈ యాక్జియాన్లు విడుదలవుతాయి. అనంతరం నక్షత్రం నుంచి వెలికి వచ్చినప్పుడు లైట్ పార్టికిల్స్గా మారి ఎక్స్‌రేల రూపంలో బహిర్గతమవుతాయని తాజాగా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే సాధారణ లైట్ పార్టికిల్స్ కన్నా యాక్జియాన్లలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వీటిని 1970ల్లో తొలిసారి ప్రతిపాదించారు. ఇవి ఉన్నాయని నిరూపితమవుతే డార్క్‌మ్యాటర్ కూడా ఉన్నట్లేనని సైంటిస్టులు భావిస్తున్నారు. -
వర్చువల్ విశ్వాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు
జెనివా: అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని(డార్క్ మ్యాటర్) ఛేదించెందుకు శాస్త్రవ్తేత్తలు వర్చువల్ విశ్వాన్ని సృష్టించారు. దీనిని 2020లో ప్రయోగించనున్న ఎక్యూలిడ్ ఉపగ్రహంలో అమర్చనున్నారు. పీకేడీజీఆర్ఏవి3 కోడ్‌ను ఉపయోగించి 80 గంటల్లో దీనిని సృష్టించామని పరిశోధకులు తెలిపారు. విశ్వంలో 95శాతం కృష్ణ పదార్థం ఉందని దానిని శోధించడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నామని వారు తెలిపారు. కృష్ణ పదార్థం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉందని యూజీహెచ్కు చెందిన ప్రొఫెసర్ రోమెన్ టెసియర్ తెలిపారు. ఎక్యూలిడ్ 1000 కోట్ల సంవత్సరాల నాటి పరిస్థితులను అంచనా వేయనుందని జోచిమ్ స్టడిల్ అన్నారు. ఎక్యూలిడ్ ఉపగ్రహం ద్వారా కృష్ణ పదార్థం వివరాలతో పాటు కొత్త కణాలు, విశ్వాల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.