breaking news
Craft crash
-
బ్లాక్‌బాక్సు లేని 40 ఏళ్ల విమానం
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఏడుగురి మృతికి కారణమైన 40 ఏళ్ల నాటి బీచ్‌క్రాఫ్ట్ సీ90ఏ విమానంలో బ్లాక్‌బాక్సు (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లు) లేదని డీజీసీఏ వెల్లడించింది. దానికి చివరిసారిగా 1987లో అర్హత సరి్టఫికెట్ జారీ చేసినట్లు పేర్కొంది. రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90ఏను ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ నెల 23న జార్ఖండ్ నుంచి ఢిల్లీకి అత్యవసరంగా బయలుదేరగా మధ్యలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానాన్ని 1987లో తయారు చేసినట్లు గుర్తించారు. అర్హత సమీక్ష సర్టిఫికెట్ వచ్చే ఏడాది జనవరి 20దాకా చెల్లుబాటు అవుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, విమానంలో బ్లాక్‌బాక్సు లేకపోవడం దర్యాప్తునకు అవరోధంగా మారింది. విమానానికి సంబంధించిన కీలక సమాచారం అందుబాటు లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం.. 5,700 కిలోల కంటే బరువు ఉన్న విమానంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కచ్చితంగా ఉండాలి. ప్రమాదానికి గురైన విమానం బరువు 4,583 కిలోలుగా తేల్చారు. విమానంలో లోపాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు స్పష్టంచేశాయి. -
గంట నడిపితే ఆమె పైలెట్ అయ్యుండేదే
న్యూఢిల్లీ: మరో గంట సేపు ఆమె గనుక ఫ్లైట్ నడిపితే లైసెన్స్డ్ పైలెట్ అయ్యుండేదే. కానీ, విధి మరోలా ఉంది. 200 గంటల ఫ్లైట్ రికార్డును ఆమె చేరుకోలేకపోయింది. ఇక ఎన్నటికీ చేరుకోలేనంత దూరం వెళ్లిపోయింది. ఆమె నడుపుతున్న ప్లైట్ నేల కూలింది. ఈ ఘటనలో ఆమెతోపాటు ఆమె ఇన్స్ట్రక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన హిమానీ కల్యాణి అనే ట్రైనీ పైలెట్ గురువారం తన ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ రంజన్ గుప్తాతో కలిసి గోండియా జిల్లా బిర్సి ఎయిర్‌పోర్టు నుంచి డీఏ 42 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరింది. ఉదయం 9.40గంటలకు బయలుదేరిన దాదాపు ఇరవై నిమిషాల పాటు సవ్యంగానే విమానం ప్రయాణించింది. అనుకోకుండా ఆ విమానం అదుపు తప్పటంతో సురక్షితంగా నేలపై దిగేందుకు హిమానీ కల్యాణి యత్నించింది. ఈ క్రమంలో విమానం రెక్క రోప్వేకు తాకటంతో అదుపుతప్పి వైగంగా నది సమీపంలో నేల కూలింది. ఈ ఘటనలో హిమానీతోపాటు రంజన్‌గుప్తా అక్కడికక్కడే చనిపోయారు. కల్యాణి శిక్షణ గురువారంతో ముగియనుంది. నిబంధనల ప్రకారం 200 గంటల పాటు ఆమె విమానం నడపాల్సి ఉంది. కల్యాణి ఇప్పటివరకు 199 గంటలు నడిపింది. ఇంకో గంటపాటు ఆమె విమానం నడిపినట్లయితే లైసెన్సుకు అర్హురాలై ఉండేది. అనంతరం ఆమె ప్రైవేట్ వాణిజ్య విమాన పైలెట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఉండేదని శిక్షణ కళాశాల వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పౌరవిమాన యాన శాఖ దర్యాప్తు ప్రారంభించింది.


