breaking news
Cowpea crop
-
పోషక లోపాలు తీర్చే చొప్ప!
దేశంలో పశువుల పోషకాహార లోటును పరిష్కరించడానికి పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ఒక సమర్థవంతమైన, సుస్థిరమైన పరిష్కారం. పంటలు పెరిగే దశలోనే వాటిలో అవసరమైన పోషకాల (జింక్, ఇనుము, రాగి వంటి సూక్ష్మపోషకాల) పరిమాణాన్ని, వాటి జీవ లభ్యతను సస్యవిజ్ఞాన పద్ధతుల్లో పెంపొందించడాన్నే బయోఫోర్టిఫికేషన్ అంటారు. బయోఫోర్టిఫికేషన్ మూడు విధాలు: 1. నేల ద్వారా ఎరువుల వినియోగం.. పొలం మట్టిలో లోపించిన పోషకాలను లేదా సూక్ష్మపోషకాలను నీటిలో కలిపి నేలకు అందిస్తారు. 2. పంటలపై పిచికారీ చేయడం.. ఎరువులను ద్రవరూపంలో నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేస్తారు. దీని వల్ల మొక్కలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. 3. సూక్ష్మజీవుల ప్రయోగం.. నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను మట్టిలో కలుపుతారు. తద్వారా మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.నత్రజని ప్రాముఖ్యతపంట అభివృద్ధికి, పశుగ్రాస ఉత్పత్తికి నత్రజని చాలా కీలకమైన పోషకం. ఇది ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, పత్రహరితం, ఇతర ముఖ్యమైన అణువుల నిర్మాణానికి అవసరం. నత్రజని ఎరువులు మేత నాణ్యతను, ముఖ్యంగా పొడి పదార్థం, ముడి మాంసకృత్తుల సాంద్రతను పెంచుతాయి.పరిశోధనా ఫలితాల ప్రకారం, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు వాడినప్పుడు, మొక్కజొన్న గ్రాసంలో జింక్ (15.3%), రాగి (7.5%), మాంగనీస్ (28.4%), ఇనుము (15.6%) వంటి సూక్ష్మపోషకాల స్థాయిలు పెరిగాయి. నత్రజని (120 కిలోలు/హెక్టారు)ని పశువుల ఎరువుతో కలిపి వాడటం వల్ల పశుగ్రాసంలో ముడి ప్రొటీన్లు 36.56% వరకు పెరిగినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.గొర్రెల్లో జింక్ లోపం పోయిందిమొక్కజొన్న, అలసంద వంటి పశుగ్రాస పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి జింక్ చాలా ముఖ్యం. పశుగ్రాసంలో జింక్ లోపం ఉంటే పశువుల ఎదుగుదల తగ్గటం, పునరుత్పత్తి సమస్యలు, ఎముకలు, చర్మ కణజాలం దెబ్బతినటం జరుగుతాయి. 2020లో డా. గిరిధర్ బృందం బెంగళూరులో (ఐసీఏఆర్–ఎన్ఐఎన్íపీ) ఒక అధ్యయనం చేసింది. జింక్ ఎరువులను నేలలో వేసి పండించిన జొన్న చొప్పను జింక్ లోపం ఉన్న గొర్రెలకు 120 రోజులపాటు ప్రయోగాత్మకంగా తినిపించారు. హెక్టారుకు 25 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే జొన్న చొప్ప దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు పెరిగింది. చొప్పలో జింక్ పరిమాణం 14.4 పీపీఎం మేర వృద్ధి చెందింది. బయోఫోర్టిఫైడ్ చొప్ప తిన్న గొర్రెల్లో జింక్ స్థాయి పెరగటంతో పాటు.. రక్తంలోని జింక్ పరిమాణం పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది.రాగితో పెరిగిన దిగుబడి పరిశోధనల ప్రకారం, ఓట్స్ పశుగ్రాస పంటకు నేల ద్వారా హెక్టారుకు 6 కిలోల రాగి అందించడం వల్ల దాని జీవలభ్యత పెరిగి దిగుబడి మెరుగుపడింది. అలాగే, విత్తిన 60–90 రోజుల్లో ఆకులపై 0.2% రాగిని పిచికారీ చేయటం వల్ల రాగి గ్రహణ శక్తి, దిగుబడి, ప్రొటీన్స్ గణనీయంగా పెరిగాయి. డా. సి.హెచ్. రామకృష్ణ బృందం హైదరాబాద్లో చేసిన పరిశోధన ఫలితాల ప్రకారం.. నేలకు హెక్టారుకు 25 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను సిఫారసు చేసిన ఎరువులతోపాటు దుక్కిలో వేస్తే.. పచ్చిమేతలో అత్యధిక జింక్ సాంద్రత (41.4 పీపీఎం) నమోదైంది. అలాగే, విత్తిన 15, 30, 45, 60 రోజుల తర్వాత 1% అన్నభేదిని ఆకులపై పిచికారీ చేస్తే అత్యధిక ఇనుము సాంద్రత (155.3 పీపీఎం) నమోదైంది. అంతేకాకుండా, ఈ పద్ధతులు సైలేజ్ (పాతరగడ్డి)లోని పోషక విలువలను కూడా మెరుగుపరిచాయి. అందువల్ల, ఇటువంటి బయోఫోర్టిఫైడ్ పశుగ్రాసం లేదా సైలేజ్ను ఎక్కువ కాలం మేతగా ఇవ్వడం వల్ల గొర్రెలలో శరీర బరువు, సగటు రోజువారీ పెరుగుదల, రక్తంలోని ఖనిజాల స్థాయిలను మెరుగుపరచవచ్చని నిరూపితమైంది. ఈ విధానం వల్ల నేల సారం పెరిగి పశుగ్రాస దిగుబడి పెరగడమే కాకుండా, ఇటు పశువుల్లో అటు మనుషుల్లోనూ ఉన్న ఖనిజ లవణాల లోపాలను సరిదిద్దవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.జీవన ఎరువుల ప్రాముఖ్యతరసాయన ఎరువులు మితిమీరి వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, పశుగ్రాసంలో పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడంలో మొక్కల పెరుగుదల ప్రోత్సహించే అజోటోబాక్టర్, అజోస్పిరిలియం వంటి జాతుల జీవన ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. జీవసంబంధమైన నత్రజని స్థిరీకరణ, ఫాస్ఫేట్ కరిగింపు, ఫైటో హార్మోన్ల ఉత్పత్తి వంటి చర్యల ద్వారా పోషకాల లభ్యతను పెంచుతాయి. ఇవి జీవసంబంధంగా నత్రజనిని స్థిరీకరించడం ద్వారా పంటల నాణ్యతను, దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ సుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల నేల సారాన్ని కాపాడుకుంటూనే పశుపోషణను లాభసాటిగా మార్చుకోవచ్చు.గణనీయమైన మార్పు.. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కూడిన బయోఫోర్టిఫికేషన్ వ్యూహాల అమలు ద్వారా దేశ పశుపోషణ రంగంతోపాటు, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు. అయితే, పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ద్వారా మేత పోషక విలువను పెంచే పద్ధతి అమలుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేలలోని పోషక అసమతుల్యతలు, ఉదాహరణకు అధిక ఫాస్ఫరస్ స్థా్థయిలు జింక్ శోషణను నిరోధించడం వంటివి మొక్కల పోషక గ్రహణ శక్తిని దెబ్బతీస్తున్నాయి. వేడిగాలులు, కరువులు, వర్షపాతంలో ఒడిదుడుకులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంట పెరుగుదలను, పోషకాల గ్రహణను నిరోధిస్తాయి. ఆర్థిక, సామాజిక అంశాలు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. సూక్ష్మపోషక ఎరువులు, అధునాతన సాంకేతికతలతో కూడిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న రైతులు ఇటువంటి నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించలేక పోతున్నారు. పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ పద్ధతులపై మరింత పరిశోధన జరగాలి. ఖర్చు–ప్రభావంపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. – డా. సి.హెచ్. రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ (అగ్రానమీ), పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (9491562536) -
ఆదాయ పంట.. అలసంద
పంట సాగుకు ఇదే అదును రబీలో ఈ పంట వేసుకోవడానికి నవంబర్ నెల నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగు నిల్వ ఉండని ఒండ్రు మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో వేసుకోవాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే విత్తన నాణ్యత పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. రసాయనిక ఎరువులైతే.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఈ ఎరువులు ఏవీ వాడాల్సిన అవసరం లేదు. ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి. చీడపీడల నుంచి రక్షణ ఇలా : చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి. పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి. బొబ్బర్ల సాగులో ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది. విత్తనాల రకాలు : జీసీ-3 : ఈ రకం విత్తనాలు వేస్తే 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3-4క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీ-2 : ఈ రకం విత్తనం ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.పంట 90 నుంచి 95 రోజుల్లో దిగుబడి వస్తుంది. కో-7 : ఈ విత్తనం 70 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. పంట దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది. సీ 152 : ఈ రకం విత్తనంతో 90 నుంచి 100 రోజులో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. టీపీటీసీ-29 : ఈ రకం విత్తనం 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరక దిగుబడి వస్తుంది.


