breaking news
commission on projects
-
‘40% కమీషన్’పై న్యాయ విచారణ
బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు..హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్ సారథ్యంలోని కమిటీకి విచారణ బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 40 శాతం కమీషన్ కుంభకోణంపై విచారణ జరిపించడం కూడా ఉంది. భారీగా పనులు చేపట్టిన శాఖలపై ఈ కమిషన్ విచారణ చేపట్టనుంది. అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తమ నుంచి వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అప్పట్లో ప్రధానికి, సీఎంకు లేఖలు రాయడం గమనార్హం. పనులు ప్రారంభించకమునుపే 25 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు అందులో ఆరోపించారు. -
కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్‌దే : టీఆర్ఎస్
మహబూబ్‌నగర్: కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్లు తీసుకున్నది ఎమ్మెల్యే అరుణ కాదా అని ప్రశ్నించారు. గత పాలనలో జిల్లాకు ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే ప్రాజెక్టులపై ముసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రకు నీటిని తరలించుకుపోతుంటే హారతులు పట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ ప్రాజెక్టులతోపాటు జిల్లాకు వరప్రదాయిని అయిన పాలమూరు ఎత్తిపోతలను చేపట్టామన్నారు. 2013 భూసేకరణ చట్టం కన్నా 123 జీఓ ప్రకారం రైతులకు ఎక్కువ మొత్తంలో పరిహారం రావడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేనట్లుందన్నారు. అనవ సరంగా రైతులను, ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే సహించమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జిల్లాలో ప్రాజెక్టులను ఆపేది లేదని, ప్రాజెక్టులు నిర్మించి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. సమావేశంలో నాయకులు బెక్కం జనార్దన్, ఫౌండర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కిషోర్, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, సురేందర్‌రెడ్డి, శారద, పల్లెరవి తదితరులు పాల్గొన్నారు.