breaking news
Chirang district
-
అస్సాంలో అటవీ కార్యాలయంలో స్థానికుల విధ్వంసం
గువాహటి: అస్సాం రాష్ట్రం చిరంగ్ జిల్లా రునిఖాటా అటవీ రేంజ్ కార్యాలయంపై మూకదాడి జరిగింది. స్థానికులు కార్యాలయంలో ఫర్నీచర్‌ను, ఆవరణలోని వాహనాలను తగులబెట్టడంతోపాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. రిజర్వు ఫారెస్ట్ ఆక్రమణదారులను అదుపులోకి తీసుకోవడమే వారి ఆగ్రహానికి కారణం. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భూటాన్ సరిహద్దులకు అతి సమీపంలో రిపు చిరంగ్ రిజర్వు ఫారెస్ట్‌లోని చెట్లను నరికి, ఆక్రమణకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అటవీ అధికారులు గురువారం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వదిలేశారు. అయితే, తమ వారిని కొట్టారంటూ శుక్రవారం ఉదయం రాళ్లు విసురుతూ, కర్రలు చేబూని ఒక గుంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడున్న ఫర్నీచర్‌ను విరగ్గొట్టి, నిప్పుపెట్టారు. ఆ పక్కనే ఉన్న ఉద్యోగుల నివాసాల్లోనూ విధ్వంసం సృష్టించారు. ఆవరణలోని వాహనాలను తగులబెట్టారు. అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, అదనపు పోలీసు బలగాలను అధికారులు రప్పించారు. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన వారిని లాఠీచార్జితో చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు, అటవీ అధికారులతోపాటు నిరసనకారులు గాయపడ్డారు. మూకదాడితో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ కార్యాలయంలోని ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందంటూ వచ్చిన వార్తలపై విచారణ చేపట్టామన్నారు. -
తల్లిదండ్రులముందే బాలిక కాల్చివేత
చిరాంగ్ జిల్లా (అస్సాం): అస్సాంలోని బోడోలాండ్ తీవ్రవాదులు తెగబడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను ఇంట్లోనుంచి బయటకు లాగి, దారుణంగా కొట్టి, తల్లిదండ్రుల కళ్లముందే, పాయింట్‌బ్లాంక్ రేంజ్లో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్రవాదులు చిరాంగ్ జిల్లాలోని ద్విముగ్రి గ్రామంలోకి ప్రవేశించి ప్రియ బసుమతారే అనే బాలికను ఇంటినుంచి బయటకు లాగారు. తల్లిదండ్రులను కళ్లుకూడా పక్కకు తిప్పుకోవద్దంటూ భయపెట్టి ఆ బాలిక శరీరంలోకి తొమ్మిది తూటాలు దింపారు. రెండు రోజులపాటు ప్రియ శరీరం అలాగే బయటే పడిఉంది. అంతకు ముందురోజు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. పోలీసులకు ప్రియనే సమాచారం అందించిందన్న అనుమానంతో తీవ్రవాదులు ఆమెను చంపారని తెలుస్తోంది.


