అధికారులపై దాడి, ఫర్నీచర్‌కు నిప్పు
పోలీసుల లాఠీచార్జిలో పలువురికి గాయాలు
గువాహటి: అస్సాం రాష్ట్రం చిరంగ్ జిల్లా రునిఖాటా అటవీ రేంజ్ కార్యాలయంపై మూకదాడి జరిగింది. స్థానికులు కార్యాలయంలో ఫర్నీచర్‌ను, ఆవరణలోని వాహనాలను తగులబెట్టడంతోపాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. రిజర్వు ఫారెస్ట్ ఆక్రమణదారులను అదుపులోకి తీసుకోవడమే వారి ఆగ్రహానికి కారణం. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భూటాన్ సరిహద్దులకు అతి సమీపంలో రిపు చిరంగ్ రిజర్వు ఫారెస్ట్‌లోని చెట్లను నరికి, ఆక్రమణకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అటవీ అధికారులు గురువారం కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణ అనంతరం వదిలేశారు. అయితే, తమ వారిని కొట్టారంటూ శుక్రవారం ఉదయం రాళ్లు విసురుతూ, కర్రలు చేబూని ఒక గుంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడున్న ఫర్నీచర్‌ను విరగ్గొట్టి, నిప్పుపెట్టారు. ఆ పక్కనే ఉన్న ఉద్యోగుల నివాసాల్లోనూ విధ్వంసం సృష్టించారు. ఆవరణలోని వాహనాలను తగులబెట్టారు. అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, అదనపు పోలీసు బలగాలను అధికారులు రప్పించారు. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన వారిని లాఠీచార్జితో చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు, అటవీ అధికారులతోపాటు నిరసనకారులు గాయపడ్డారు. మూకదాడితో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ కార్యాలయంలోని ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందంటూ వచ్చిన వార్తలపై విచారణ చేపట్టామన్నారు.


