breaking news
British scientist
-
ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: హెపటైటిస్ – సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ సోమవారం స్టాక్ హోమ్‌లో సోమవారం అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్–సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. ‘‘వైరస్‌ను గుర్తించేందుకు అతి సున్నితమైన పరీక్షను సిద్ధం చేయడం వీరి పరిశోధనల వల్లే వీలైంది. ఫలితంగా రక్తమార్పిడి తరువాత వ్యాధి సోకే అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి.‘‘ అని కమిటీ వివరించింది. చరిత్రలో తొలిసారి ఈ వ్యాధికి చికిత్స కల్పించడం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల పరిశోధనల ఫలితంగానే సాధ్యమైందని కమిటీ తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దశాబ్ద కాలం అంతు చిక్కని వైరస్... హెపటైటిస్–సీ వైరస్‌ను గుర్తిచేందుకు సంప్రదాయ పద్ధతుల్లో శాస్త్రవేత్తలు జరిపిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో చిరాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మైకేల్ హౌటన్ ఈ వైరస్‌ను వేరు చేసి జన్యుక్రమం నమోదు చేసే తాజా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. వైరస్ సోకి చింపాంజీ రక్తంలోని డీఎన్ఏ పోగులను వేరు చేసి పరీక్షలు జరిపారు. చింపాంజీ జన్యుక్రమానికి సంబంధించిన పోగులు అధికంగా ఉన్నప్పటికీ గుర్తు తెలియని వైరస్ తాలూకూ జన్యు అవశేషాలు కూడా ఇందులో ఉంటా యని మైకేల్ హౌటన్ అంచనా వేశారు. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసి ఉంటుంద న్న అంచనాతో ప్రయోగాలు జరిగాయి. రోగి రక్తంలో వైరస్ తాలూకూ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయగల డీఎన్ఏ పోగుల కోసం వెతుకులా ట మొదలైంది. సమగ్ర పరీక్షల ఫలితంగా ఒక్క పోగు లభ్యమైంది. తదుపరి పరీక్షలతో ఈ డీఎన్ఏ పోగు కూడా ఫ్లావివైరస్ కుటుంబానికి చెందిన ఆర్ఎన్ఏ ఆధారిత వైరస్‌కు చెందిందని స్పష్టమైంది. ఈ వైరస్‌కు హెపటైటిస్–సీగా నిర్ధారించారు. మైకేల్ హౌటన్ వైరస్ ఉనికిని నిర్ధారిస్తే.. అంతకుముందే రక్తమార్పిడి కారణంగా వచ్చే హెపటైటిస్ వ్యాధికి గుర్తు తెలియని వైరస్ ఒకటి కారణమని హార్వీ జే ఆల్టర్ నిర్ధారించారు. రక్తమార్పిడి కేసులను పకడ్బందీగా, నిశితంగా పరిశీలించడం ద్వారా హార్వీ వ్యాధికి అప్పటికే గుర్తించిన వైరస్లు ఏవీ కారణం కాదని ప్రపంచానికి తెలియజేశారు. మరోవైపు ఛార్లెస్ ఎం.రైస్ హెపటైటిస్ –సీ వైరస్ మాత్రమే హెపటైటిస్‌కు కారణమని విస్పష్టంగా గుర్తించడంతో ఆ వైరస్ తాలూకూ చివరి చిక్కుముడి కాస్తా వీడింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఛార్లెస్ ఎం. రైస్ హెపటైటిస్–సీ జన్యుక్రమం చివరి ప్రాం తం వైరస్ పునరుత్పత్తిలో కీలకమన్న అంచనాతో పరిశోధనలు చేపట్టారు. అంతేకాకుం డా.. వేరు చేసిన హెపటైటిస్–సీ వైరస్‌లో కొన్ని తేడాలు ఉండటాన్ని కూడా రైస్ గుర్తించారు. జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో ఈ వైరస్ నకలు ఒకదాన్ని తయారు చేసి చింపాంజీ కాలేయంలోకి ప్రవేశపెట్టినప్పుడు క్రానిక్ హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల రక్తంలో కనిపించే మార్పులే కనిపించాయి. దీన్ని బట్టి హెపటైటిస్ వ్యాధికి ఈ వైరస్ ఒక్కటే కారణమవుతోందన్న నిర్ధారణకు వచ్చారు. ఏమిటీ హెపటైటిస్–సీ హెపటైటిస్–సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్–సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్–సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం. ఎవరికి సోకే అవకాశం? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్–సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90% మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్–సీ డేగా జరుపుకుంటారు. -
కేన్సర్‌ను గుర్తించే సరికొత్త పరికరం
మహమ్మారి కేన్సర్‌ను చటుక్కున గుర్తించేందుకు తయారైన సరికొత్త పరికరం ఇది. పేరు బ్రెత్ బయాప్సీ. బిల్లీ బాయల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ కేవలం మన ఊపిరి ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తుంది. భార్య కేట్కు ఉన్న పెద్దపేగు కేన్సర్‌ను సకాలంలో గుర్తించకపోవడం.. ఫలితంగా చిన్న వయసులోనే ఆమె మరణించడం బాయల్ మనసును కలచివేసింది. ఇలాంటి చావు ఇతరులెవ్వరికీ రాకూడదని, వీలైనంత ముందుగా కేన్సర్‌ను గుర్తించే టెక్నాలజీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాయల్.. కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధించడం విశేషం. మనిషికి రాగల వేర్వేరు కేన్సర్లలో కనీసం సగంవాటిని బ్రెత్ బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. తద్వారా శస్త్రచికిత్సతో చేసే బయాప్సీ అవసరం ఉండదు. కేన్సర్ సోకినప్పుడు మన కణాల్లో కొన్ని నాశనమై కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఊపిరి ద్వారా బయటకు వస్తూంటాయి. ఈ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను గుర్తించేలా బ్రెత్ బయాప్సీని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు కనబరచకపోయినా ఊపిరిత్తుల, కడుపులోని కేన్సర్‌ను ఇది సులువుగా గుర్తించగలదు. కొన్ని ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఇది ఉపయోగపడుతుందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణకు ఇంజనీరింగ్ నోబెల్ అవార్డుగా పరిగణించే మెక్రాబర్ట్ అవార్డు దక్కింది. -
హ్యాపీ బర్త్ డే.. వెబ్సైట్!
ఇప్పుడు ఇంటర్నెట్ అంటే అందరికీ సుపరిచితమే. అందులో వెబ్సైట్ అంటే ప్రపంచవ్యాప్త సమాచారాన్ని క్షణాల్లో మన చేతుల్లో పెట్టే సాధనం. మరి తొలి వెబ్సైట్ ఎప్పుడు ప్రారంభమైందంటే.. అక్షరాల 25 సంవత్సరాల కిందట. డిసెంబర్ 20, 1990న ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్సైట్ ప్రారంభమైంది. టిమ్బెర్నర్స్ లీ వరల్డ్‌వైడ్ వెబ్ (Tim Berners-Lee's World Wide Web) పేరిట యూరప్ అణు పరిశోధన కేంద్రం సెర్న్‌లో ఇది మొదట ఆన్‌లైన్‌లోకి వెళ్లింది. అయితే ఈ వెబ్సైట్ అదేరోజున ప్రజల్లోకి వెళ్లలేదు. కొన్ని నెలల అనంతరం ఆగస్టు 6, 1991న ఈ వెబ్సైట్ తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ మొట్టమొదటిసారిగా వెబ్సైట్ ప్రారంభమైన తేదీగా డిసెంబర్ 20, 1990 సమాచార నెట్వర్క్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. అత్యంత ప్రాథమిక దశలో బెసిక్ ఫీచర్స్‌తో ఉన్న ఈ వెబ్సైట్ 1992 వెర్షన్ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నిజానికి అత్యంత ప్రాథమిక దశలో ఉన్న వెబ్సైట్ ఇతరుల పత్రాల యాక్సెస్ పొందడానికి, సొంత సర్వర్‌ను ఏర్పాటుచేసుకోవడానికి వీలుగా రూపొందింది. బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన బెర్నర్స్ లీ 1989లో తొలిసారి ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. నిజానికి వరల్డ్‌వైడ్ వెబ్ (WWW)కి ఇంటర్నెట్కు సన్నిహిత సంబంధమున్నా.. చాలామంది పొరపడుతున్నట్టు ఇవి రెండు ఒకటి కావు. బీబీసీ వివరణ ప్రకారం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న భారీ పెద్దసంఖ్యలోని కంప్యూటర్ల భారీ నెట్వర్క్ ఇంటర్నెట్. ఈ కంప్యూటర్ నెట్‌వర్క్‌లో లభించే వెబ్‌పేజీల కలెక్షన్ వరల్డ్‌వైడ్ వెబ్. -
ప్రియమైన శరీర వాసన ఉన్నవారిపైనే దోమల దాడి!
కొత్త పరిశోధన మిమ్మల్ని దోమలు విపరీతంగా కుడుతున్నాయంటే కారణం... మీ శరీరం నుంచి వెలువడే వాసనే అంటున్నారు బ్రిటిష్ అధ్యయనవేత్తలు. దీన్ని నిరూపించడం కోసం 36 మంది కవల పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా ఒకేలాంటి కవలలన్నమాట. అంటే ఐడెంటికల్ ట్విన్స్. ఇక ఐడెంటికల్ ట్విన్స్ కాని కవల పిల్లలను మరో 38 మందినీ ఎంచుకొని వారిని మరో గదిలో ఉంచారు. ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి వెళ్లేలా ఇంగ్లిష్ అక్షరం ‘వై’ ఆకృతిలో ఉండే ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసి... ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి దోమల్ని పంపారు. ఐడెంటికల్ ట్విన్స్ ఉన్న గదిలోనికే ఎక్కువ దోమలు వెళ్లాయి. ఐడెంటికల్ ట్విన్స్ అంటే వారిలో శరీర వాసనను వెలువరించే ఒకేలాంటి జన్యువులు ఉంటాయి కాబట్టి... వారి మీదకే ఎక్కువ సంఖ్యలో దోమలు వెళ్లాయన్నమాట. అదే ఒకేలాంటి కవలలు కానివారి విషయంలో వేర్వేరు జీన్స్ వల్ల వేర్వేరు శరీర వాసనలు వెలువడ్డాయి కాబట్టి... వాటిలో దోమలకు ప్రియంగా లేని శరీర వాసనలు వెలువడేవారిదగ్గరకు అస్సలు దోమలే వెళ్లలేదట. వీటన్నింటినీ సమీక్షించి చూస్తే తమకు ప్రియమైన శరీర వాసనను వెలువరించే వారిపైకే దోమలు దాడి చేస్తాయని వెల్లడైందని ఈ పరిశోధనవేత్తలు పేర్కొంటూ ఇదే విషయాన్ని ‘ప్లాస్ ఒన్’ అనే జర్నల్‌లో సైతం పొందుపరిచారు. మరో కొత్త విషయం ఏమిటంటే... ఈ శరీరవాసనకు కారణమయ్యే జన్యువుకూ... ఎత్తుతో పాటు, ఐక్యూకూ కారణమయ్యే జన్యువుతో దగ్గరి పోలికలున్నాయట.