British Academy Television
-
జాతీ మతం కంటే మనిషి ముఖ్యం
బ్రిటిష్ అకాడెమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘బూంగ్’ తెర వెనుక కథ మానవత్వాన్ని చాటుతోంది. ఈ సినిమా దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి మణిపూర్‌లో మెయితి తెగకు చెందినామె. ముఖ్య పాత్ర పోషించిన బాలనటుడు గుగున్ కుకీ తెగకు చెందినవాడు. అయితే సినిమాలో అతను మెయితీ తెగకు చెందిన పిల్లాడిగా నటించాడు. సినిమా షూట్ ముగిశాక మొదలైన మణిపూర్ అల్లర్లలో మెయితీల దాడి నుంచి గుగున్ కుటుంబాన్నిలక్ష్మీ ప్రియాదేవి కాపాడింది. ఢిల్లీకి వలస వచ్చిన గుగున్ ప్రస్తుతం ఆరవ తరగతి పరీక్షలకు కూచుంటున్నాడు. 2023కు ముందు మతం, జాతీ తేడా లేకుండా ఉన్న తాము ఇప్పుడెందుకు ఇలా ఉన్నామని ప్రశ్నిస్తున్నారు వారు.మణిపురి భాషలో తీసిన ‘బూంగ్’ సినిమా ట్రైలర్‌ను చూసినా అది మనల్ని ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే తల్లీకొడుకులు మనకు ఏదో లోతైన కథ చెప్తున్నారనిపిస్తుంది. ఆ సినిమాలో తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లి ఉంటాడు. స్కూల్ చదువులో ఉన్న కుమారుడు తండ్రి కోసం బయల్దేరడమే ‘బూంగ్’ సినిమా. మణిపురి దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బ్రిటిష్ అకాడెమీ’ అవార్డ్స్‌లో మొదటిసారి మన దేశానికి అవార్డు సం పాదించిపెట్టింది. ఇది రికార్డు. ఈ కథ ఇక్కడ ముగిసినా ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం మనసుల్ని కదిలించేలా ఉంది.మెయితీ–కుకీమణిపూర్లో రెండు బలమైన జాతులు ఉన్నాయి. మెయితీ– కుకీ. ఇంఫాల్ లోయలో మెయితీలది పై చేయి అయితే కొండ ప్రాంతాలలో కుకీలది పై చేయి. లక్ష్మీ ప్రియాదేవి తీసిన ‘బూంగ్’ సినిమాలో కథ మెయితీ కుటుంబానిది. అయితే అందుకు కావలసిన బాల నటుడు కుకీ కుటుంబం నుంచి దొరికాడు. అతని పేరే గుగున్ కిప్జెన్. 2023లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కిప్జెన్‌కు 11 ఏళ్లు. సినిమా షూటింగ్ ముగిశాక మే 3, 2023న హటాత్తుగా మణిపూర్‌లో అల్లర్లు మొదలయ్యాయి. మెయితీలు పైచేయిగా ఉండే ఇంఫాల్‌లో కుకీల మీద దాడులు జరుగుతున్నాయి.అప్పుడు కిప్జెన్ కుటుంబం ఇంఫాల్‌లోని కానన్‌వెంగ్ అనే ప్రాంతంలో ఉంది. మే4న మెయితీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో స్వయంగా మెయితీ తెగకు చెందిన లక్ష్మీ ప్రియాదేవి రంగంలో దిగి కిప్జెన్ కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించింది. కిప్జెన్ కుటుంబం పోట్ట చేత్తో పట్టుకుని అస్సాం రైఫిల్స్ శిబిరానికి చేరి తల దాచుకుంది. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక కుకీలు ఎక్కువ ఉండే కాంగ్ పోక్పి జిల్లాకు తరలి వెళ్లింది.ఇంఫాల్‌లో ఉన్న సొంత ఇంటిని కిప్జెన్ వదిలి పెట్టేశాడు. అతని స్కూల్లో అతను తిరిగి చదవలేడు. ఏ మెయితీ పిల్లాడి పాత్ర తాను పోషించాడు ఆ మెయితీల వల్లే కష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఇతనిలాగే కుకీల వల్ల మెయితీ కుటుంబాలు, పిల్లలు అవస్థ పడ్డాయి. ఇరు వర్గాల ఘర్షణల్లో పై పై లెక్కల ప్రకారం 260 మంది చనిపోతే 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.ఢిల్లీకి చేరి...కొండ ప్రాంతానికి చేరినా కిప్జెన్ కుటుంబం సురక్షితంగా లేదు. అల్లర్లు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో కిప్జెన్ చదువు కోసం కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లాలనుకుంది. అదీ అంత సులభంగా జరగలేదు. మిలటరీ కాన్వాయ్‌లో ఒక బస్సులో కొన్ని కుటుంబాలతో పాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఢిల్లీకి చేరారు. 2025 జనవరి నుంచి కిప్జెన్ కుటుంబం ఢిల్లీలోనే ఉంది. మణిపూర్‌లో అల్లర్లు పూర్తిగా తగ్గితే తప్ప వెనక్కు వెళ్లమని చెబుతోంది. కొత్త వాతావరణంలో కిప్జెన్ బడి బాట పట్టాడు. ప్రస్తుతం 6వ తరగతి పరీక్షకు కూచుంటున్నాడు. అతడు నటించిన సినిమా దేశ దేశాల్లో ఎంతో పేరు సం పాదిస్తున్నా ఆ సంతోషం అంతా అనుభవించలేకపోతున్నాడు. వలస జీవితం ఎంత దుర్భరమో అనుభవించినవారికే తెలుసు.దివ్యశక్తి ప్రతిఒక్కరిలో...బ్రిటిష్ అకాడెమీ అవార్డు పోందాక లక్ష్మీ ప్రియా దేవి తన ఉపన్యాసం ఇలా చేసింది– ‘మేమంతా ఎంతో బాగుండేవాళ్లం. ఆ మునుపటి శాంతి మణిపూర్‌కి తిరిగి రావాలి. చెదిరిపోయిన పిల్లలంతా తిరిగి తమ గూళ్లకు చేరుకుని ఆనందంగా గడ పాలి. ఎన్ని ఘర్షణలు జరిగినా మనిషిలో క్షమ అనే దివ్యశక్తి మనిషికి మాత్రమే సొంతం. ఆ క్షమతో మానవత్వాన్ని నిలబెట్టాలి’ అందామె. దేశంలో అందరికీ గౌరవంగా, సమానంగా బతికే హక్కు ఉంది. ఎవరికంటే ఎవరూ ఎక్కువ కాదు... తక్కువ కాదు. దాడులు, ప్రతి దాడులు, ద్వేషాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచివి కావు. మానవత్వమే మనిషి ప్రథమ గుణం కావాలి... ఇదే ఇప్పుడు ‘బూంగ్’ సినిమా విజేతలు లోకానికి ఇస్తున్న సందేశం. -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
‘బాఫ్తా’ నామినేషన్ల తుది జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’కు దక్కని చోటు
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘బాఫ్తా’ (బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రకటించిన ‘బాఫ్తా’ తుది నామినేషన్ల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి చోటు దక్కలేదు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ‘బాఫ్తా’ నాన్ ఇంగ్లిష్ లాంగ్‌లిస్ట్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. అయితే టాప్ 5తో కూడిన ఫైనల్ లిస్టులో స్థానం కోల్పోయింది. తుది నామినేషన్ల జాబితాలో ‘ఆల్ ౖక్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కోర్సేజ్, డెసిషన్ టు లీవ్, ద క్వయిట్ గర్ల్’ చిత్రాలు నిలిచాయి. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ విభాగంలో ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కి నామినేషన్ దక్కింది. మొత్తం 24 విభాగాల్లో నామినేషన్లు ప్రకటించగా, భారతదేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’ మాత్రమే నామినేషన్ దక్కించుకుంది. షౌనక్ సేన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 19న ‘బాఫ్తా’ అవార్డుల వేడుక జరగనుంది. మరి.. ‘ఆల్ దట్ బ్రీత్స్’ అవార్డు కూడా గెలుచుకుంటుందా? చూడాలి. -
రెహమాన్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా)’∙సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్‌కి అందించింది. ‘ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్’గా ఆయన్ని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్ ఇకపై నెట్‌ఫ్లిక్స్‌తో కలసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై రెహమాన్ స్పందిస్తూ – ‘‘సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. బాఫ్టాతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. బాఫ్టాకు రెహమాన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ తెలిపారు. కాగా ప్రతి ఏటా ఈ సంస్థ ప్రదానం చేసే అవార్డులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. -
జోరు మీద బాయ్‌హుడ్
మరో రెండు వారాల్లో ఆస్కార్ విజేతల ఎవరో తెలుస్తారనగా ఈ లోపే బ్రిటీష్ అకాడమీ టెలివిజన్,ఫిలిం ఆర్ట్స్ (బాఫ్తా) అవార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఆస్కార్ బరిలో హాట్ ఫేవరెట్స్‌గా ఉన్న ‘బాయ్‌హుడ్’, ‘బర్డ్‌మేన్’ చిత్రాలు మరోసారి బాఫ్తా అవార్డుల్లో తలపడ్డాయి. అత్యంత కీలక విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను ‘బాయ్‌హుడ్’ చిత్రం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చిత్రంపై పడింది.‘బర్డ్‌మేన్’ కేవలం ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును మాత్రమే దక్కించుకుంది. ఆస్కార్ నామినేషన్స్‌లో హాట్ ఫేవరె ట్‌గా ఉన్న మరో చిత్రం‘ ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లంచ్ బాక్స్’కు నిరాశే ఎదురైంది. పోలాండ్ చిత్రం ‘ఇదా’ ఈ విభాగంలో విజేతగా నిలిచింది.


