సిలబస్ నుంచి ఆ ప్రేమ కథను తొలగించారు
జెరూసలెం: అది ఇజ్రాయెల్ మహిళకు, పాలస్తీనా యువకుడికి మధ్య నడిచిన ప్రేమాయణానికి సంబంధించిన కథ. దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా పరస్పరం రగిలిపోతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం సాకారానికి సహకరిస్తుందని భావించిన కథ. అలాంటి కథా పుస్తకాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ విద్యాశాఖ లిటరేచర్ సిలబస్ నుంచి తొలగించింది.
ఈ కథను ‘బోర్డర్ లైఫ్’ పేరుతో ప్రముఖ ఇజ్రాయెల్ రచయిత్రి డోరిట్ రబిన్యాన్ నవలగా రాశారు. పాలస్తీనా పెయింటర్ హిల్మీ, ఇజ్రాయెల్ ట్రన్స్‌లేటర్ లియాత్లు ఒకరినొకరు న్యూయార్క్‌లో కలసుకొని ప్రేమలో పడతారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం సంఘర్షించుకుంటున్న సమయంలో వారి ప్రేమాయణం కొనసాగుతుంది. ఈ సంఘర్షణ ప్రభావం న్యూయార్క్‌లోనే సహజీవనం సాగిస్తున్న వారిపైనా పెద్దగా ప్రభావం చూపించదు. కానీ ఇరుదేశాల మధ్య పొసగని సంబంధాల కారణంగా హిల్మీ వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లాకు, లియాత్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్లిపోతారు. అంతకుముందు వారు పెళ్లి చేసుకున్నట్టు నవలలో ఎక్కడా ఉండదు.
ఇజ్రాయెల్ యూదులకున్న ప్రత్యేక గుర్తింపును ఈ నవల దెబ్బతీస్తుందని, యూదులు, అరబ్‌ల మధ్య పెళ్లికి యువతీ యువకులను ప్రోత్సహిస్తుందనే ఉద్దేశంలో ప్రధాని బెంజామిన్ నెతన్యాహుకు కుడిభుజంగా ఉంటున్న విద్యాశాఖ మంత్రి నెఫ్తాలి బెన్నెట్ స్కూల్ సెలబస్ నుంచి ‘బోర్డర్ లైఫ్’ పుస్తకాన్ని తొలగించారు. తొలుత ఈ నవలను సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో బెన్నెట్ ఓ కమిటీని వేశారు. పుస్తకంలో అభ్యంతరకరమైన విషయాలు ఏమీ లేవని, సెలబస్ నుంచి తొలగించాల్సిన అవసరం అసలు లేదంటూ ఆ కమిటీ సిఫార్సు చేసింది.
ఆ సిఫార్సును కాదని బెన్నెట్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. హిట్లర్ హయాంలో జరిగిన మారణహోమం కారణంగా లక్షలాది మంది యూదులు చనిపోయారని, ఈ నేపథ్యంలో యూదుల ప్రత్యేకతను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, యూదులకు యూదులే పుట్టాలంటూ ఓ బహిరంగ వేదికపై కూడా బెన్నెట్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఆయన నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. బెన్నెట్ నిర్ణయం సబబుకాదని, ఆయన చర్య వల్ల పుస్తకాల అమ్మకాలు భారీగా పెరిగాయని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు.