Billie Jean King Cup
-
భారత్‌కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్‌లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్‌లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్ టిజెన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్ టిజెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్‌లో మంగోలియాతో భారత్ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా...
న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్ టెన్నిస్‌లో జరిగే డేవిస్ కప్‌లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్ కింగ్ కప్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్‌లో ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీని నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో ఆతిథ్య భారత్ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో జరిగే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్–2కు దిగజారుతాయి. కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్ విశాల్ ఉప్పల్ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్డ్‌కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్ వైష్ణవి ఆడ్కర్ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది. ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్ వ్యక్తిగత ఈవెంట్ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్‌లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది. -
భారత జట్టులో తెలంగాణ అమ్మాయిలు
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో పోటీపడే భారత మహిళల టెన్నిస్ జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన భారత నంబర్‌వన్ సహజ యామలపల్లి, భారత ఐదో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి పిలుపుఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్–100 టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన మహారాష్ట్ర ప్లేయర్ వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 391వ ర్యాంక్‌తో సహజ భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా... వైష్ణవి 397వ ర్యాంక్‌తో రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఏప్రిల్ 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. సహజ, రష్మిక, వైష్ణవిలతోపాటు రుతుజా భోస్లే, అంకిత రైనా కూడా భారత జట్టులో ఉన్నారు. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కెప్టెన్‌గా విశాల్ ఉప్పల్, కోచ్‌గా రాధిక కనిట్కర్ కొనసాగుతారు. ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఇండోనేసియా, కొరియా, న్యూజిలాండ్, మంగోలియా, థాయ్‌లాండ్ పోటీపడతాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లే ఆఫ్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.


