breaking news
Bibipeta
-
నిజాం నవాబుకు ఈ ఊరి నుంచే తమలపాకులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీబీపేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చేది తమలపాకుల తోటలు. నిజాం కాలంలోనే ఇక్కడి పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు ఉండేవి. తాతల కాలం నుంచి తమలపాకులు పండించిన కామారెడ్డి జిల్లా బీబీపేట రైతులు సాగునీటి కష్టాలతో పంట సాగును వదిలేశారు. అయితే తమలపాకులతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేని రైతులు.. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని ఆకులు అమ్ముతూ పూటగడుపుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న బీబీపేట గ్రామంలో 2,532 కుటుంబాలు ఉండగా, 11,312 మంది జనాభా ఉంది. ఇక్కడ అత్యధిక కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.గ్రామ రైతులు నిజాం కాలం నుంచే తమలపాకులను పండించేవారు. దాదాపు ఏడు గ్రామాలకు సాగునీటినందించే బీబీపేట పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు సాగు చేసేవారు. ఇక్కడ పండించిన తమలపాకుల్లో ఘాటు ఎక్కువగా ఉండేదని చెబుతారు. నిజాం నవాబు కుటుంబానికి కూడా ఇక్కడి నుంచి తమలపాకులు వెళ్లేవి. వీటిని నిజాం నవాబు కూడా ఎంతో ఇష్టపడేవారని చెబుతారు. పెద్ద చెరువు కింద దాదాపు 140 ఎకరాల్లో తమలపాకుల తోటలు పెంచేవారు. ఇక్కడ పండించిన తమలపాకులను అప్పట్లో హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఉమ్మడిగా తోటల పెంపకం తమలపాకుల తోటలను రైతులు ఉమ్మడిగా పెంచేవారు. ఒక ఎకరం భూమిలో పది నుంచి పదిహేను మంది రైతులు కలిసి పంట సాగు చేసేవారు. తోట పెంచడమే కాదు ఆకులను తెంపడం, వాటిని రవాణా చేయడం, అమ్మడం వంటి పనులు చేయడానికి ఎక్కువ మంది అవసరం ఉంటుండడంతో రైతులు ఉమ్మడిగా పంట పండించేవారు. తద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. కొందరు రైతులైతే కూలీల అవసరం లేకుండానే వారి కుటుంబ సభ్యులే కలిసి పంట సాగు నుంచి తెంపడం, అమ్మడం దాకా వాళ్లే చేసుకునేవారు. వందలాది మంది రైతులు పంటల సాగులో పనిచేసేవారు. తమలపాకు తోటల ద్వారా గ్రామంలో కూలీలకు కూడా ఎంతో ఉపాధి లభించేది. తమలపాకు తోటలతో ఆ కుటుంబాలన్నీ ఉన్నతంగా బతికేవి. అయితే 1995 ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో చెరువు నిండకపోవడంతో రైతులు తమలపాకుల తోటల సాగుకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు తమలపాకుల తోటలతో బతికిన రైతులు, నీళ్లు లేక పంట భూములను పడావుగా వదిలేయాల్సి వచ్చింది. దిగుమతి చేసుకుని అమ్ముకుంటున్న రైతులుతమలపాకుల తోటలతోనే జీవనం సాగించిన ఎన్నో కుటుంబాలు తోటలు పెంచడం మానేసినప్పటికీ వ్యాపారాన్ని మానలేకపోయాయి. దీంతో ఆయా కుటుంబాలవారు ఇతర ప్రాంతాల నుంచి తమలపాకులను తెప్పించుకుని విక్రయిస్తున్నారు. కామారెడ్డి, దోమకొండ, సిరిసిల్ల, మాచారెడ్డి, గంభీరావుపేట, రామాయంపేట తదితర ప్రాంతాలకు బీబీపేట (Bibipet) రైతులు వెళ్లి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చదవండి: మూడు సంస్థానాలు, 46 జాగీర్లుఒకప్పుడు తమలపాకులు పండించి, ఎగుమతి చేసిన రైతులు ఇప్పుడు దిగుమతి చేసుకుని అమ్ముకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తమలపాకులు పండినపుడు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లి అమ్మేవారు. నాందేడ్ ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చి తమలపాకులను కొనుగోలు చేసుకుని తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులై రైతులు తమలపాకులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తమలపాకులతోనే జీవనం నా వయసు 83 ఏండ్లు. మా తాతల కాలం నుంచి తమలపాకుల తోటలు ఉండేవి. నేను 30 ఏళ్లపాటు పెంచిన. ఆకుతోటమీదనే బతికినం. ఆకులను తలమడ్ల రైల్వే స్టేషన్ దాకా ఎడ్ల బండ్లమీద తీసుకుపోయి అక్కడి నుంచి రైలులో పట్నం తీసుకుపోయి అమ్ముతుంటిమి. కొందరు పంట మీద వడ్లు పెట్టేటోళ్లు. మా ఊరికి ఎక్కడెక్కడి నుంచో బ్యారగాళ్లు అచ్చి ఆకులు కొనుక్కుని పోయేటోళ్లు. బీబీపేట అంటేనే తమలపాకుల తోటలు గుర్తు చేసేటోళ్లు. మా ఊరికి ఎంతో పేరుండేది. నీళ్ల కరువుతోని తోటలు బందుజేసినం. ఇగ తోటల ముచ్చటనే లేకుండాపోయింది. ఇప్పుడు మా మనుమడు హైదరాబాద్ (Hyderabad) నుంచి తమలపాలకులు తీసుకువచ్చి ఇస్తే బస్టాండ్ దగ్గర కూర్చుని అమ్ముతున్న. – కుర్ల నారాయణ, బీబీపేట -
ఇంటి కాంపౌండ్‌లోకి చిరుత
కల్హేర్(నారాయణఖేడ్)/ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామంలో ఓ ఇంటి కాంపౌండ్‌లోకి శనివా రం ఉదయం చిరుత చొరబడటం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీ పేట గ్రామానికి చెందిన కల్హేర్ మండల మాజీ జెడ్పీటీసీ స్వప్న భర్త గుండు మోహన్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి కాంపౌండ్ గేటు గొళ్లెం వేసి బయటకు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఇంట్లోని సీసీటీవీని పరిశీలిస్తున్న క్రమంలో చిరుత వెళ్లడాన్ని గుర్తించారు.ఫుటేజీని రికార్డు చేసి ఫోన్లో గుండు మోహన్‌కు పంపించగా అది చిరుత పులిలా ఉందని, తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. సమాచారాన్ని గుండు మోహన్ గ్రామస్తులకు చేరవేయగా వారు ఇంటి పరిసరాల్లో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిరుత ఇంటి వెనుక కాంపౌండ్ నుంచి దూకి వెళ్లిపోయింది. కాగా, ఘటనా స్థలాన్ని మెదక్ డీఎఫ్ఓ శ్రీధర్‌రావు పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఫంక్షన్ హాల్ వద్ద బైక్ దొంగలించి అతి వేగంగా వెళ్లడంతో...
బీబీపేట (నిజామాబాద్): ద్విచక్ర వాహనం దొంగతనం చేసి తీసుకెళ్లే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ అదుపు తప్పి కిందపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం మాల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రమేష్ (31) బీబీపేటకు చెందిన గడీల బాస్కర్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఓ ఫంక్షన్ హాల్ వద్ద దొంగలించి అతి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపై కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి👉 లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా! -
కుప్ప నూర్చే క్రమంలో.. ఆగిన రైతన్న ఊపిరి!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బీబీపేట్ మండలం యాడారంలో విషాదం చోటుచేసుకుంది. చేతికందిన పంట అకాల వర్షంలో తడిసిపోవడంతో ఓ అన్నదాత ఊపిరి ఆగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చాకలి దేవరాజు (45) అనే రైతు బుధవారం ఉదయం హఠాన్మరణం చెందాడు. అకాల వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకోవాలనే తాపత్రాయంలో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. (చదవండి: 3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి) తాజా ఘటనతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల మృతి రెండుకు చేరింది. ఇప్పటికే లింగంపేట మండలం పోల్కంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం ఆరబెట్టే క్రమంలో భూమయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రెండు వారాలుగా అకాల వర్షాలు, ఈదురు గాలులు ధాన్యం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేంతవరకు రైతులకు సమస్యలు తప్పేలా లేవు. (చదవండి: మన సంస్కృతి.. ప్రపంచ దేశాలకు దిక్సూచి) -
ట్రాక్టర్ ర్యాలీ
దోమకొండ: మండలంలోని బీబీపేటను మండలంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరుతూ శనివారం ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు గ్రామంలోని ప్రధాన రోడ్లపై ట్రాక్టర్లను తిప్పి బీబీపేటను మండలంగా చేయాలంటూ నినాదాలు చేశారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.