స్కూల్లో కాల్పులు: ఒకరు మృతి
రియోడీజనీరో: స్కూల్లో ఆగంతకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని బెలో హరిజోటీ మెట్రోపాలిటిన్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
క్షతగాత్రుల్లో అసిస్టెంట్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఆగంతకుడు ప్రవేశ ద్వారం నుంచి స్కూల్లోకి ప్రవేశిస్తున్న వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు.