breaking news
Adrian
-
పసివాడిని వదిలేయండి!
టెక్సాస్: అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు వారం క్రితం అదుపులోకి తీసుకున్న అయిదేళ్ల బాలుడు లియామ్ రమోస్, అతడి తండ్రి ఆడ్రియన్ల కథ సుఖాంతమైంది. తండ్రి, కొడుకులను వెంటనే వదిలేయాలని టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మినియాపొలిస్‌లో జనవరి 24వ తేదీన స్కూలు నుంచి తండ్రితోపాటు కారులో వస్తున్న లియామ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించడం, వారిద్దరినీ అక్కడికి 1,300 కిలోమీటర్ల దూరంలోని టెక్సాస్ డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు. బిక్కమొహం వేసిన లియామ్ భుజాలకున్న బ్యాగ్‌ను ఇమిగ్రేషన్ అధికారి వెనుక నుంచి పట్టుకుని, అతడిని కారు వద్దకు తీసుకెళ్తున్న ఫొటో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చిన్నారులను నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన జడ్జి ఫ్రెడ్ బియరీ అధికారులు, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. లియామ్ కుటుంబం ఇమిగ్రేషన్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మంగళవారం లోగా ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈక్వెడార్‌కు చెందిన లియామ్ తండ్రిని దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంటుండగా, అతడు చట్టబద్ధంగానే వచ్చాడని లాయర్లు తెలిపారు. లియామ్ కుటుంబం 2024 డిసెంబర్లో టెక్సాస్‌లో అధికారుల ఎదుట హాజరై ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుందని చెప్పారు. వారికి ఈక్వెడార్తోపాటు అమెరికాలోనూ ఎలాంటి నేర చరిత్ర లేదని స్పష్టం చేశారు.చరిత్ర ప్రతిధ్వనిస్తోందిజడ్జి ఫ్రెడ్ బియరీ ఏమన్నారంటే.. ప్రభుత్వం నిర్ణయాలు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి, మూల సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా చారిత్రక స్వాతంత్య్ర ప్రకటనపై ఈ ప్రభుత్వం అజ్ఞానంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. అధికార దాహం కలిగిన అప్పటి ఇంగ్లండ్ రాజుకు వ్యతిరేకంగా థామస్ జెఫర్సన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. అప్పటి రాజరిక పాలనలోని పరిస్థితులే నేడు కూడా కన్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బహిష్కరణ విధానాల వల్ల పిల్లలు ఎంతో మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. రోజువారీ బహిష్కరణ కోటాలను చేరుకునేందుకు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సరైన ఆలోచన లేకుండా, అసమర్థతతో ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల ఫలితమిది. పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా సరే, ఆగడం లేదు’అని అన్నారు. ‘ప్రభుత్వ యంత్రాంగం తనకు తానుగా జారీ చేసుకునే పరిపాలనాపరమైన వారెంట్లకు సరైన కారణం ఉండటం లేదు. దీనినే కోళ్ల గూడుకు నక్కను కాపలా పెట్టడం అంటారు’అని ఆయన తీర్పులో రాశారు. అమెరికాలోని క్లిష్టమైన వలస చట్టాల వల్ల లియామ్, అతని తండ్రి చివరికి బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావచ్చు అని పేర్కొన్న బియరీ.. అయితే, ఇది మరింత క్రమబద్ధమైన, మానవీయమైన విధానం ద్వారా జరగాలని అభిప్రాయపడ్డారు. ‘రెండు వారాల వ్యవధిలో ఇమిగ్రేషన్ అధికారులు తీసుకెళ్లిన నాలుగో చిన్నారి లియామ్’అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.లియామ్‌ను ఎరవేశారు..తండ్రి ఆడ్రియన్ నుంచి లియామ్‌ను వేరు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎరగా వేసి, అతడి తల్లిని కూడా నిర్బంధంలోకి తీసుకోవాలని చూశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు ఇంట్లో మరో చిన్నారి కూడా ఉందని చెప్పారు. అధికారుల భయంతోనే కుమారుడిని, భర్తను అధికారులు తీసుకెళ్తున్న దృశ్యాలను కిటికీలో నుంచి చూస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందన్నారు. ఈ ఆరోపణలను ఇమిగ్రేషన్ అధికారులు తోసిపుచ్చారు. చిన్నారని వదిలేసి, అతడి తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీంతో, లియామ్‌ను తల్లికి అప్పగించేందుకే ఇంటి వద్దకు వెళ్లామని, ఎవరూ బయటకు రాకపోవడంతో చిన్నారి బాధ్యతను తామే తీసుకున్నామన్నారు. వెంటనే అతడిని హోటల్‌కు తీసుకెళ్లి, ఆహారం పెట్టామన్నారు. తండ్రి కోరిక మేరకే ఇద్దరినీ తీసుకెళ్లామని చెప్పారు. -
మేల్నాట్టు మరుమగన్ వస్తున్నాడు
మేల్నాట్టు మరుమగన్ (విదేశీ అల్లుడు) త్వరలో తెరపైకి రానున్నాడు. డబ్బు, సంపాదన ఆశతో కొందరు విదేశాలకు పరుగులు తీస్తున్నా సంస్కృతి, సంప్రదాయాల్లో మనదేశానికి మించిన దేశం లేదు అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుమగన్ అని ఆ చిత్ర దర్శకుడు ఎం ఎస్ ఎస్ చెప్పారు. స్కై మూవీస్ పతాకంపై తమిళనాడు ఎస్.బహుదూర్షా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవనటుడు రాజ్‌కమల్ కథానాయకుడిగాను, ఆండ్రియన్ నాయకిగాను పరిచయం అవుతున్నారు. చిత్ర కథ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి కావడంతో షూటింగ్ మొత్తం తమిళనాడులోనే నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. వి.కిషోర్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ వెంటనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.


