breaking news
Abhishek Patel
-
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్‌తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పట్నా, సరణ్ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా, పూరి్ణయా, నలందా, బోజ్పూర్, మధుబని, షేక్పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్ పోలీస్బూత్లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురన్ కుమార్ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్ పటేల్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్ గోండ్ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. వాళ్లేమైనా ఉగ్రవాదులా?న్యూఢిల్లీ: బిహార్‌లో నీట్ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్ పోలీస్‌వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్‌లో ఏకే–47 గన్ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌చేశారు. మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్ గన్స్ వాడితే బిహార్‌లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్ గన్స్ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్‌లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. -
పోలీస్ వీరోచిత చర్య; భుజంపై బాంబుతో..
- 400 మందిని కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ - మధ్యప్రదేశ్‌లోని చిటోరాలో ఘటన.. వీడియో వైరల్ భోపాల్: పౌరుల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పరుగెత్తిన పోలీసును దేశం యావత్తూ అభినందిస్తోంది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తించిన భారీ బాంబును జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లిన అతని వీరోచిత చర్య వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా చిరోటాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని పదార్థాన్ని గుర్తించిన కొందరు.. డయల్ 100కు ఫోన్ చేశారు. కొద్దిసేపటికే హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ నేతృత్వంలోని సాగర్ బ్లాక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే మీడియా కూడా గుమ్మికూడింది. స్కూల్ వెనుక భాగంలో పడిఉన్న ఆ పదార్థాన్ని బాంబుగా గుర్తించిన వెంటనే.. రెప్పపాటులో అభిషేక్ దానిని చేతుల్లోకి తీసుకుని పరుగు లఘించుకున్నారు. ఆగకుండా కిలోమీటర్ దూరం పరుగెత్తి.. బాంబును జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లారు. అసలేం జరిగిందో అక్కడున్న మీడియా కెమెరాలూ గుర్తించలేకపోయాయి. అభిషేక్ బాంబును తీసుకుని పరుగెత్తుతున్న దృశ్యాలను ఓ స్థానికుడు చిత్రీకరించాడు. ఆ దృశ్యాలే ఇప్పుడు వైరల్ అయ్యాయి. 10 కేజీల బాంబు: ఆ బాంబు సుమారు 12 ఇంచుల వ్యాసంతో దాదాపు 10 కేజీల బరువు ఉందని, ప్రమాదవశాత్తూ పేలిపోయి ఉంటే 500 మీటర్ల వరకూ దాని ప్రభావం ఉండేదని హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ మీడియాకు చెప్పారు. గత ఏడాది తాను యాంటీబాంబ్ స్క్వాడ్ ట్రైనింగ్ తీసుకున్నానని, ప్రమాద తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే బాంబును తీసుకుని పరుగెత్తానని వివరించారు. సమీపంలోనే ఆర్మీ క్యాంప్ : బాంబును గుర్తించిన సమయంలో.. స్కూల్ ఆవరణలోని పిల్లలు, ప్రహారీని ఆనుకుని ఉన్న ఇళ్లలోని ప్రజలు అంతా కలిపి 400 మంది ఉంటారు. పొరపాటున బాంబు పేలి ఉంటే తీవ్ర నష్టం జరిగిఉండేది. అసలు స్కూల్లోకి బాంబు ఎలా వచ్చిందనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిటోరా గ్రామానికి సమీపంలోనే ఇండియన్ ఆర్మీ క్యాంప్ ఉండటంతో ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సాగర్ బ్లాక్ సీనియర్ పోలీస్ అధికారి సతీశ్ సక్సేనా చెప్పారు. సాహస పోలీస్ అభిషేక్‌ను అభినందించారు.


