పోలీస్ వీరోచిత చర్య; భుజంపై బాంబుతో..
పౌరుల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పరుగెత్తిన పోలీసును దేశం యావత్తూ అభినందిస్తోంది.
- 400 మందిని కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్
- మధ్యప్రదేశ్‌లోని చిటోరాలో ఘటన.. వీడియో వైరల్
భోపాల్: పౌరుల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పరుగెత్తిన పోలీసును దేశం యావత్తూ అభినందిస్తోంది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తించిన భారీ బాంబును జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లిన అతని వీరోచిత చర్య వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా చిరోటాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని పదార్థాన్ని గుర్తించిన కొందరు.. డయల్ 100కు ఫోన్ చేశారు. కొద్దిసేపటికే హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ నేతృత్వంలోని సాగర్ బ్లాక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే మీడియా కూడా గుమ్మికూడింది. స్కూల్ వెనుక భాగంలో పడిఉన్న ఆ పదార్థాన్ని బాంబుగా గుర్తించిన వెంటనే.. రెప్పపాటులో అభిషేక్ దానిని చేతుల్లోకి తీసుకుని పరుగు లఘించుకున్నారు. ఆగకుండా కిలోమీటర్ దూరం పరుగెత్తి.. బాంబును జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లారు. అసలేం జరిగిందో అక్కడున్న మీడియా కెమెరాలూ గుర్తించలేకపోయాయి. అభిషేక్ బాంబును తీసుకుని పరుగెత్తుతున్న దృశ్యాలను ఓ స్థానికుడు చిత్రీకరించాడు. ఆ దృశ్యాలే ఇప్పుడు వైరల్ అయ్యాయి.
10 కేజీల బాంబు: ఆ బాంబు సుమారు 12 ఇంచుల వ్యాసంతో దాదాపు 10 కేజీల బరువు ఉందని, ప్రమాదవశాత్తూ పేలిపోయి ఉంటే 500 మీటర్ల వరకూ దాని ప్రభావం ఉండేదని హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ మీడియాకు చెప్పారు. గత ఏడాది తాను యాంటీబాంబ్ స్క్వాడ్ ట్రైనింగ్ తీసుకున్నానని, ప్రమాద తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే బాంబును తీసుకుని పరుగెత్తానని వివరించారు.
సమీపంలోనే ఆర్మీ క్యాంప్ : బాంబును గుర్తించిన సమయంలో.. స్కూల్ ఆవరణలోని పిల్లలు, ప్రహారీని ఆనుకుని ఉన్న ఇళ్లలోని ప్రజలు అంతా కలిపి 400 మంది ఉంటారు. పొరపాటున బాంబు పేలి ఉంటే తీవ్ర నష్టం జరిగిఉండేది. అసలు స్కూల్లోకి బాంబు ఎలా వచ్చిందనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిటోరా గ్రామానికి సమీపంలోనే ఇండియన్ ఆర్మీ క్యాంప్ ఉండటంతో ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సాగర్ బ్లాక్ సీనియర్ పోలీస్ అధికారి సతీశ్ సక్సేనా చెప్పారు. సాహస పోలీస్ అభిషేక్‌ను అభినందించారు.


