
నెల్లూరు : స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికైంది. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేం దుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కె లు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జన సంద్రంగా మారింది.

బారాషహీద్లను దర్శించుకునేందుకు సింహపురిలో దారు లన్నీ దర్గా వైపే మళ్లాయి. కుల, మత వర్ణభేదాలు లేకుండా తరలివచ్చిన స్వర్ణాల చెరువు భక్తులతో పోటెత్తింది. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగ పటిష్ట ఏర్పాట్ల మధ్య ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

స్వర్ణాల చెరువు వరాల రొట్టెలు మార్చుకునే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకున్నారు.

మత బోధకులైన యుద్ధ వీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించుకున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. ఇందుకోసం ఏ కోర్కె రొట్టె ఎక్కడ దొరుకుంతుందో వెతుకులాటతో భక్తులు ఇబ్బంది పడకూడదని అధికారులు ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు.

భక్తులు ఏ కోర్కెతో వచ్చారో ఆ ఘాట్‌లోకి వెళ్లి తమకు కావాల్సిన రొట్టెను అందుకుంటున్నారు. గతంలో తమ కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదులుతున్నారు. ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ, సౌభాగ్యం, వివాహం, విదేశీయానం రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు.




















