
గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం, అనంతపురం జిల్లా, నార్పల మండలంలోని గూగూడు గ్రామంలో ఉంది. ఇది హిందూ, ముస్లిం మతాలవారు కలిసి పూజలు చేసే ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం.

నార్పల మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరమైంది. గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్ద సరిగెత్తు అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గూగూడు కిటకిటలాడింది.

తెల్లవారుజామున స్వామి వారిని అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. నాయీ బ్రాహ్మణులు సన్నాయి వాయిద్యాలతో నీరాజనాలర్పించగా.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు పొర్లు దండాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఫకీర్లు పానకాలు సమర్పించుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.



















