అ‘రాజకీయం’ | mla support rowdys in visakhapatnam | Sakshi
Sakshi News home page

అ‘రాజకీయం’

Jan 31 2018 9:11 AM | Updated on Aug 11 2018 4:32 PM

రోజుకో హత్యతో అట్టుడుకుతున్న విశాఖలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్తగా పెంచిపోషిస్తున్న విష సంస్కృతి మరింత అలజడి రేపుతోంది. గతంలో సంచలన హత్య కేసులు ఎదుర్కొని రౌడీ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సదరు ఎమ్మెల్యేపై ప్రస్తుతానికి మోసాల చిట్టా తప్ప ‘రికార్డెడ్‌’గా నేరచరిత(?) లేదు. అదేవిధంగా.. ఇప్పుడు నగరంలో జరుగుతున్న హత్యలకూ అతనికి సంబంధం లేదు.. హంతకులెవరో, బాధితులెవరో  కూడా ఆయనకు తెలియదు.

కానీ.. హత్యలు చేసి కష్టాల్లో’ ఉన్న నేరగాళ్లకు ఆయన షెల్టర్‌ ఇస్తున్నారన్న వాదనలే కలకలం రేపుతున్నాయి. దీని వెనుక ఆయన రాజకీయ ‘దురాలోచన’ కనిపిస్తోంది. ఇప్పుడు వారికి ‘సహకారం’ అందిస్తే భవిష్యత్తులో.. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు అండగా ఉంటారని, లేదా తన అడ్డాలోనే ‘పడి’ ఉంటారన్న ముందస్తు నేరపూరిత యోచనతో సదరు టీడీపీ నేత చేస్తున్న నయా రాజకీయం సంచలనమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖలో రౌడీషీటర్లు, నేరస్తులు అంతా కట్టకట్టుకుని ఎక్కడుంటారు?.. అని అడిగితే ఓ టీడీపీ ఎమ్మెల్యే పేరే సమాధనమవుతుంది.  అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే కార్యాలయం కొన్నేళ్లుగా నేరచరితులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. సహజంగానే నేరచరిత ఉన్న సదరు నేత మాస్‌ అప్పీల్‌ ముసుగులో తొలుత చిన్నపాటి ఘర్షణలు చేసే వారిని వెనకేసుకుని తిరుగుతూ వచ్చాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ‘పరిధి’ పెంచాడు. రౌడీషీటర్లకు సపోర్ట్‌ చేసేవాడు. నగరంలో ఎక్కడ గలాటా జరిగినా బాధ్యులైన నిందితులకు ఆయన ఇల్లు, కార్యాలయాలు అడ్డాగా మారిపోయాయి. అలాగని ఆయనపై ప్రస్తుతం క్రిమినల్‌ కేసులేమీ లేవు. గతంలో ఓ సంచలన హత్య కేసులో నిందితునిగా ఉన్నప్పటికీ దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆర్ధికపరమైన వివాదాలు, భూ కబ్జా కేసులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. కానీ హత్య కేసుల్లోని నిందితులకు, వివాదాస్పద వ్యక్తులకు సదరు ఎమ్మెల్యే షెల్టర్‌ ఇస్తున్నాడన్న వాదనలు బలంగా ఉన్నాయి.

ఆ నిందితులకు అండ?
విశాఖలో ఇటీవలి కాలంలో హత్యా సంస్కృతి పెచ్చుమీరిపోయింది.  కట్టడి  చేయాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి  ఆయా కేసుల్లో ప్రధాన నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోమని తన వర్గీయులను పురమాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఈమధ్య కాలంలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితులకు సదరు ఎమ్మెల్యే అనుచరులు అండగా నిలుస్తుండటం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి ఆ హత్యలతోనూ.. ఆ నిందితులతోనూ ఎమ్మెల్యేకి గానీ, ఆయన అనుచరులకు గానీ ఎటువంటి సంబంధాలు లేవు. కానీ హత్యలు, ఇతర నేరాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న వారికి ఒకింత అండగా నిలబడితే.. ‘కష్టకాలంలో ఉన్నప్పుడు ఫలానా ఎమ్మెల్యే  మనకు సపోర్ట్‌ చేశారు..

ఆయన కోసం మనం ఏదైనా చేద్దాం’.. అనే ఇంప్రెషన్‌ కోసం, నేరస్తులను కూడగట్టుకోవడం కోసమే సదరు ఎమ్మెల్యే ఇలాంటి అనైతిక రాజకీయాలకు తెరలేపాడన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ తరహా నేరస్తులను అవసరమైన చోట్ల దందాలకు వినియోగించాలన్నదే సదరు ఎమ్మెల్యే ప్లాన్‌గా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి రాజకీయాలకు ఆయన పాల్పడ్డాడనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ క్రమంలో ఇటీవల జరిగిన హత్య కేసులు, వివాదాల్లో నిందితులకు ఎమ్మెల్యే మనుషులు ఆర్ధిక సాయం చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్లలో థర్డ్‌ డిగ్రీ యాక్షన్‌లు లేకుండా చూడటం, అవసరమైతే లాయర్లను ఏర్పాటు చేయడం వంటి సాయం చేస్తున్నారని తెలుస్తోంది.

..అందుకే ఆ ఎమ్మెల్యేకు దూరమైన పోలీసు అధికారి
వర్గ సమీకరణల నేపథ్యంలో నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి  మొదట్లో సదరు ఎమ్మెల్యేకు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. తదనంతర కాలంలో అతని వ్యవహారం, నేరస్తులకు అండగా నిలుస్తున్న వైనం పోలీసు అధికారికి కళ్లకు కట్టినట్టు కనపడింది. వివాదాలకు ఏమాత్రం తావు లేకుండా ఉండాలని తాపత్రయపడే ఆ అధికారి ఇక మొహమాటాలకు పోకుండా ఇటీవలి కాలంలో సదరు ప్రజాప్రతినిధిని దూరం పెట్టారని అంటున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం ‘పోలీసులకు మనం ఎంత చెబితే అంత.. ఆ పోలీసు అధికారి మనోడేనన్న’ రీతిలో ఇంకా కిందిస్థాయి పోలీసు అధికారుల వద్ద హల్‌చల్‌ చేస్తున్నారన్న వాదనలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement