మొక్కల మాంత్రికుడు!

మొక్కల మాంత్రికుడు!


అత్యాధునిక బ్రీడింగ్‌ పద్ధతులపై అనితరసాధ్యమైన పట్టు సాధించిన రైతు శాస్త్రవేత్త రెడ్డియార్‌

రైతులకు సిరిసంపదలనందించే విశిష్టమైన సరుగుడు, కనకాంబరం, వంగ, తోటకూర తదితర వంగడాల రూపశిల్పి

వెతుక్కుంటూ వచ్చిన పద్మశ్రీ పురస్కారం, రెండు డాక్టరేట్లు సహా 40 అవార్డులు
అతని చేయి తగిలితే అడవి మొక్కయినా రైతులకు నచ్చే అద్భుత వంగడంగా మారిపోతుంది. ఆయన చదువు నాలుగో తరగతే గానీ.. అకుంఠిత దీక్ష, పట్టుదలతో మైక్రో ప్రోపగేషన్‌ నుంచి గామా రేడియేషన్‌ వరకు అసాధారణమైన బ్రీడింగ్‌ నైపుణ్యాలన్నిటినీ అందిపుచ్చుకొని తనకు తానే సాటని చాటుకున్నారు. సరుగుడు మొక్కలు ఆయన చెప్పినట్టు నెలకో అడుగు చొప్పున చేనంతా ఒకే ఎత్తులో పెరిగి రైతుకు సిరులు కురిపిస్తాయి. కనకాంబరాలు ఆయనకు నచ్చిన రంగుల్లోకి మారి సీతాకోక చిలుకల్లా ఆయన చూపుడువేలిపై వాలుతాయి. ఎక్కువ కాలం వాడిపోకుండా తాజాగా ఉంటాయి. వంగ మొక్కకు ఆయన చేయి తగిలిందంటే.. వంగ చెట్టుగా మారిపోయి.. అనేక ఏళ్ల తరబడి ఒకటికి రెండు, మూడు రకాల వంకాయలను కాస్తుంది! తోటకూర మొక్క నాలుగు నెలల్లో 6 అడుగులు పెరుగుతుంది. ఆయన ముట్టుకున్న మిరప కాయలు కమ్మని నెయ్యి వాసనతో నోరూరిస్తాయి... జన్యుమార్పిడి చేయకుండానే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్న అద్భుత రైతు శాస్త్రవేత్త పేరు పద్మశ్రీ, డాక్టర్‌ వెంకడపతి రెడ్డియార్‌. ఈ విలక్షణ వంగడాలు 7 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు ఆదాయ భద్రతను సమకూర్చుతున్నాయి. కేవలం 30 సెంట్ల స్థలంలో తన నర్సరీ ద్వారా నెలకు 30 లక్షల నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేస్తూ.. ఏటా రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నారు! అసామాన్య రైతు శాస్త్రవేత్త రెడ్డియార్‌ విశేష కృషిపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం..
పాండిచ్చేరిలోని కూడపాకం గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టి నాలుగో తరగతిలోనే బడి మానేసిన టి. వెంకడపతి రెడ్డియార్‌ (72) పట్టుదల, స్వయంకృషితో అద్భుత వంగడాలను ఆవిష్కరించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సుమారు 300 ఏళ్ల క్రితం రెడ్డియార్‌ వంశస్తులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వచ్చి పాండిచ్చేరిలో స్థిరపడ్డారు. తనకున్న కొద్దిపాటి స్థలంలో నలభయ్యేళ్ల క్రితం జీవనోపాధి కోసం కనకాంబరం పూల సాగు చేపట్టారు. కనకాంబరాలకు గిరాకీ ఉండడంతో నిలదొక్కుకున్నారు.   ఆ క్రమంలోనే మెరుగైన మొక్కలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో విడిగా పెంచడం నేర్చుకున్నారు.కనకాంబరం పూలరంగును మార్చితే మరింత ప్రయోజనం ఉంటుందన్న ఆకాంక్షతో పెరియకులం హార్టీకల్చర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు డా. సంబంధ మూర్తి, డా. శ్రీరంగస్వామిలను సంప్రదించారు. వారి సలహా మేరకు బ్యాంకు రుణం తీసుకొని మిస్ట్‌ ఛాంబర్‌ను నిర్మించి 1972 నుంచి ప్రయోగాలను ముమ్మరం చేశారు. మంచి ఆదాయాన్నిచ్చే కనకాంబరాన్ని ఎంచుకున్నారు. అనేక కొత్త వంగడాలను సృష్టించారు. ప్రస్తుతం తన ఇంటి వద్దనే రెండు చిన్న పాలీహౌస్‌లు, రెండు చిన్న మిస్ట్‌ ఛాంబర్‌లు ఏర్పాటు చేసుకొని భార్య విజయాళ్‌ సహకారంతో నెలకు 30 లక్షల వరకు సరుగుడు, కనకాంబరం తదితర మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. తన కుమార్తె శ్రీలక్ష్మి తోడ్పాటుతో ఆంగ్లంలోని ఉద్యానశాస్త్ర మెలకువలను ఔపోశన పట్టడం విశేషం.‘ఢిల్లీ’ కనకాంబరానికి అమిత ఆదరణ!

రెడ్డియార్‌ ఇప్పటికి సుమారు 500 రకాల కనకాంబరాలను సృష్టించగా, అందులో ‘సౌందర్య (ఢిల్లీ) కనకాంబరం’ అమిత ఆదరణ పొందిన ఉత్తమ వంగడంగా నిలిచింది. ముదురు నారింజ రంగు, నిల్వ సామర్థ్యం, అధికోత్పత్తి దీని ప్రత్యేకతలు. గోధుమ రంగు చుక్కల తెగులును తట్టుకుంటుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఎకరానికి రోజుకు 25 కిలోల పూల దిగుబడినిస్తుంది. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా ఉంటుంది. పాలీహౌస్‌లో ఏడాది పొడవునా పూల దిగుబడినిస్తుందని రెడ్డియార్‌ తెలిపారు. విత్తనాలు రాని ‘స్టెరైల్‌’ కనకాంబరం రకాలను రూపొందించారు.కిలోకు 60 వేల పూలు తూగుతాయి. 60 మూరల దండ కట్టి మూర రూ. 20 చొప్పున అమ్ముతున్నారని.. సింగపూర్, మలేషియాలకు కూడా ఎగుమతి చేస్తున్నారన్నారు. ఎకరంలో ఇతర పంటలు పండించిన దానికన్నా 10 సెంట్లలో కనకాంబరాలు పండిస్తే అధికాదాయం వస్తుందని రెడ్డియార్‌ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్థానిక రకంతో పోల్చితే రెట్టింపు ధర వస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. మోడి, కలాం పేర్లతో కూడా ప్రత్యేక కనకాంబరం వంగడాలను రూపొందించారు.3–5 ఏళ్లు కాపునిచ్చే వంగ చెట్టు!

గామా రేడియేషన్‌ ప్రక్రియలో రెడ్డియార్‌ ఆవిష్కరించిన దీర్ఘకాలిక వంగ వంగడం 3–5 ఏళ్ల పాటు ఏడాదికి రెండు విడతలుగా మంచి దిగుబడినిస్తుంది. సిసోరియం విల్ట్, నెమటోడ్‌ విల్ట్, బ్యాక్టీరియా విల్ట్, వెట్టిసిలి విల్ట్‌లను ఈ వంగడం తట్టుకుంటుంది. సొలానమ్‌ ట్రోవమ్‌ అనే అడవి జాతి మొక్క కాండంపై వంగ కొమ్మలను గ్రాఫ్టింగ్‌ చేశారు. ఈ వంగడం 12 అడుగుల ఎత్తువరకు పెరుగుతుందని రెడ్డియార్‌ ‘సాగుబడి’కి తెలిపారు. 6 నెలలకోసారి కొమ్మలు కత్తిరిస్తే కొత్త కొమ్మలకు కాయలు కాస్తాయన్నారు. పాలీహౌస్‌లో అయితే ఏడాది పొడవునా కాపు వస్తుందన్నారు. అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచినా ఈ వంగ మొక్కలు దెబ్బతినవన్నారు. ఒకే చెట్టుకు రెండు, మూడు రకాల వంకాయ కొమ్మలను కూడా గ్రాఫ్టింగ్‌ చేస్తున్నారు.వేగంగా పెరిగే సరుగుడు

రెడ్డియార్‌ ప్రతిభా సంపన్నతకు మరో నిదర్శనం ఆయన రూపొందించిన అధిక కలప దిగుబడినిచ్చే సరుగుడు రకాలు. థాయ్‌లాండ్‌ నుంచి మెరుగైన వంగడాన్ని తెప్పించి, స్థానిక సరుగుడు రకాలతో సంకరం చేసి 14 రకాల సరుగుడు వంగడాలను ఆయన రూపొందించారు. వాటిల్లో ముఖ్యమైనవి మూడు: ఎం.ఐ.క్యు., మోడి (2012), కలాం (2013). మోడి రకం సరుగుడు చెట్లు వేగంగా పెరిగి మూడున్నరేళ్లలో ఎకరానికి 140 టన్నుల దిగుబడినిస్తాయని రెడ్డియార్‌ తెలిపారు.కలాం రకం 4 ఏళ్లలో 140 టన్నుల దిగుబడినిస్తుంది. రసాయనిక ఎరువులతోపాటు అడపా దడపా నీటి తడులు ఇస్తే ఈ దిగుబడి వస్తుందన్నారు. రసాయనిక ఎరువులు వేయకపోతే 80–100 టన్నుల కలప దిగుబడి వస్తుందన్నారు. సరుగుడు, కనకాంబరం వంటి ఆహారేతర పంటలకు రసాయనిక ఎరువులు తగుమాత్రంగా వాడాలంటున్న రెడ్డియార్‌.. ఆహార పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం మేలంటున్నారు.15 రోజుల్లో మొక్కలు సిద్ధం..

పొలంలో 8 అడుగుల దూరంలో రెండున్నర అడుగుల లోతున నీటి కాలువలు తీసి.. కాలువ గట్టుపైన 3 అడుగుల దూరంలో సరుగుడు మొక్కలు నాటుకోవాలని ఆయన సూచించారు. 10 సెంట్లలో వరి సాగు చేసే నీటితో 100 ఎకరాల్లో సరుగుడును సాగు చేయొచ్చన్నారు. మొక్క నాటిన 3వ రోజు నీరివ్వాలి. మొదటి, రెండు నెలల్లో వారానికోసారి కాల్వల్లో మాత్రమే నీటిని పారించాలి. కాల్వల మధ్య ప్రదేశంలో నీరు పెట్టనక్కర్లేదు. 3వ నెల నుంచి నెలకోసారి నీరిస్తే చాలు.సముద్ర తీర ప్రాంతాల్లో, భూగర్భ జలాల్లో ఉప్పదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సరుగుడు చక్కగా పెరుగుతుందని రెడ్డియార్‌ వివరించారు. నెలకు అడుగు చొప్పున ఐదేళ్లలో 60 నుంచి 75 అడుగుల ఎత్తు పెరుగుతాయని, రెండున్నర అడుగుల చుట్టుకొలత గల నిటారుగా ఎదిగిన సరుగుడు బాదులు నాటిన మొక్కల్లో 80% వరకు వస్తాయని చెప్పారు. పిహెచ్‌ 8–9 వరకు ఉన్న నేలల్లోనూ సరుగుడు బాగా పెరుగుతుంది.యూకలిప్టస్‌ ఆకులు భూమిని పాడుచేస్తాయని, సరుగుడు వేళ్లు నత్రజనిని భూమిలో స్థిరీకరింపజేయడంతోపాటు ఆకులు కూడా భూసారాన్ని పెంచుతాయన్నారు. వెజిటేటివ్‌ ప్రాపగేషన్‌ పద్ధతిలో 15 రోజుల్లో సరుగుడు మొక్కలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. తన సొంత డిజైన్‌తో స్వల్ప ఖర్చుతో నిర్మించుకున్న రెండు పాలీహౌస్‌లలో నెలకు 30 లక్షల మొక్కలను ఉత్పత్తి చేస్తూ.. ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఏటా రూ. 3 కోట్ల ఆదాయం పొందుతున్నట్లు రైతు శాస్త్రవేత్త రెడ్డియార్‌ సగర్వంగా చెప్పారు.  6 అడుగుల తోటకూర

గామా ఎక్స్‌రే యూవీ రేడియేషన్‌ పద్ధతిలో ఆరు అడుగుల ఎత్తు పెరిగినా కూరగా వండుకోవడానికి అనువుగా ఉండే తోటకూర వంగడాన్ని రెడ్డియార్‌ రూపొందించారు. ముదిరిన కాండంలో కూడా తగుమాత్రంగా పీచు ఉండటం, రుచికరంగా ఉండడం విశేషం. తోటకూర మొక్క నెలలో అడుగు ఎత్తు పెరిగిన తర్వాత 4 అంగుళాల ఎత్తులో కోస్తే.. చుట్టూ పిలకలు వస్తాయి. 4 నెలల్లో 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని కంకి కూడా 2 అడుగులకుపైగా పెరుగుతుందన్నారు. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులున్నాయి. ఇంటిపంటగా పెంచే వారికీ, వాణిజ్యపరంగా సాగు చేసే రైతులకు కూడా ఈ వంగడం మంచి ఆదాయాన్నిస్తుందన్నారు. విలక్షణమైన ఓ పొట్టి మిరప వంగడాన్ని కూడా రెడ్డియార్‌ రూపొందించారు. దీన్ని కూరలో వేస్తే నెయ్యి వాసన వస్తుంది.కలాం సిఫారసు..

మర్రిచెన్నారెడ్డి తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్నప్పుడే రెడ్డియార్‌ సేవలను గుర్తించి విద్యుత్‌ ధరలో రాయితీని ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సిఫారసుతో కల్పాకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా స్థానంలోని శాస్త్రవేత్తల సహకారంతో గామా ఎక్స్‌రే యూవీ రేడియేషన్‌ పద్ధతిలో మేలైన వంగడాల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం విశేషం. రెడ్డియార్‌ అభివృద్ధి చేసిన కనకాంబరం, సరుగుడు వంగడాల విశిష్టతలను నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ గుర్తించి.. రెండు దఫాలు అవార్డులను ప్రదానం చేసింది. అంతేకాకుండా.. ‘ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ అథారిటీ’లో వీటిని ‘రైతు వంగడాలు’గా నమోదు చేయించి రెడ్డియార్‌కు మేధోహక్కులను మంజూరు చేయించింది.2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్‌ తమిళ యూనివర్సిటీ నుంచి, పెరియార్‌ మనియమ్మాయ్‌ యూనివర్సీటీల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ప్రయోగశీలి అయిన రెడ్డియార్‌ హైడ్రోపోనిక్స్‌ కన్నా ఆక్వాపోనిక్స్‌ పద్ధతి మేలైనదని అంటున్నారు. రసాయనిక ఎరువులతో పెరిగిన మొక్క వేళ్లు నెమటోడ్స్‌(నులిపురుగుల)కు తియ్యగా, మెత్తగా ఉండి ఆకర్షిస్తాయి. ఆక్వాపోనిక్స్‌ పద్ధతిలో చేపల ట్యాంకులో వ్యర్థ జలాలను మొక్కలకు అందిస్తే ఈ సమస్య ఉండదన్నారు. రైతు శాస్త్రవేత్తగా అపారమైన అనుభవజ్ఞానంతో తలపండిన రెడ్డియార్‌.. నేలతల్లి రుణం తీర్చుకుంటున్న అచ్చమైన ముద్దుబిడ్డ!

(డా. రెడ్డియార్‌ను ఎల్‌.ఎన్‌.టి.సి. 72 ఇన్నోవేషన్‌ సెంటర్, నంబర్‌ 6, పెరుమాళ్‌ కోయిల్‌ వద్ద, కూడపాకం, పాండిచ్చేరి – 605502 చిరునామాలో సంప్రదించవచ్చు. www.intc71.com)

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తా!

ఏటికి ఎదురీదుతూ వినూత్న ఆవిష్కరణలు చేసే రైతు శాస్త్రవేత్తల అనుభవజ్ఞానాన్ని దేశంలోని రైతులందరికీ పంచిపెట్టడం ద్వారా దారిద్య్రాన్ని, ఆత్మహత్యలను రూపుమాపవచ్చు. రైతు శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త టెక్నాలజీలను రైతులు అంత తేలిగ్గా పట్టించుకోరు. మొదట పిచ్చివాడుగా చూస్తారు. 5–10 పదేళ్లు గడచిన తర్వాత రెడ్డియార్‌ దేవుడు అంటారు. ఇది నా అనుభవం. రైతు శాస్త్రవేత్తల జ్ఞానాన్ని రైతులందరికీ పంచిపెట్టకపోతే అణుబాంబో, హైడ్రోజన్‌ బాంబో వేసిన దానికన్నా ఎక్కువగా జాతికి పెను నష్టం వాటిల్లుతుంది. అందువల్లే నాకు తెలిసిన జ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తే రైతులకు ఉచితంగానే పంచిపెడతాను. నేను ఇవ్వాళ మహారాజులాగా ఉన్నాను. నాతోపాటు రైతులందరూ మహారాజులుగా మారాలి!  

– పద్మశ్రీ డా. టి. వెంకడపతి రెడ్డియార్, ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, పాండిచ్చేరి, 094432 26611, 095669 73443పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఫొటోలు: కె. క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్‌వాయిస్‌

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top