ఇప్పటికైనా కలసి రండి: కొణతాల రామకృష్ణ | YSRCP invites all parties to united movement | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా కలసి రండి: కొణతాల రామకృష్ణ

Oct 10 2013 2:28 AM | Updated on Jul 29 2019 5:28 PM

ఇప్పటికైనా కలసి రండి: కొణతాల రామకృష్ణ - Sakshi

ఇప్పటికైనా కలసి రండి: కొణతాల రామకృష్ణ

రాజకీయ పార్టీలన్నీ తమ సొంత ఎజెండాలను పక్కనబెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కలసికట్టుగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

* రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుదాం     
* రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు
* రాష్ట్రానికి రాబోయే మంత్రుల బృందానికి ‘గో బ్యాక్’ చెప్పాలి
* కిరణ్ రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలి
* కేంద్ర, రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలం
* తక్షణమే అసెంబ్లీ భేటీ పెట్టి సమైక్య తీర్మానం చేద్దాం
* తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ రాజీనామా చేయాలి
* పొరపాటున కూడా తాను సమైక్య దీక్ష చేస్తున్నానని బాబు చెప్పడం లేదు
 
 సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలన్నీ తమ సొంత ఎజెండాలను పక్కనబెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కలసికట్టుగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని సూచించింది. వైఎస్సార్‌సీ రాజకీయ వ్యవహారాల కమిటీ  కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడున్న పరిస్థితుల్లో అందరూ కలసి పోరాడితే తప్ప రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోదని చెప్పారన్నారు. అందుకే తమ పార్టీ తరఫున సమైక్య రాష్ట్రం కోసం అందరూ కలసి రావాలని కోరుతున్నామన్నారు.
 
 ‘సైమన్ గోబ్యాక్’ ఉద్యమం తరహాలో..
 విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) రాష్ట్రానికి రానుందని, స్వాతంత్రోద్యమంలో ప్రకాశం పంతులు నడిపిన ‘సైమన్ గోబ్యాక్’ ఉద్యమం మాదిరిగా మంత్రుల బృందానికి కూడా ‘గోబ్యాక్’ చెప్పాలని కొణతాల పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ స్వార్థంతో, క్షుద్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని నిలువునా కోసేందుకు కేంద్రం ఒడిగట్టిందని, అలాంటి విభజనను ఆపాలంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం ఒక్కటే పరిష్కారమని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే కేంద్ర మంత్రివర్గానికి కేబినెట్ నోట్ వస్తుందని తొలుత నమ్మించిన కేంద్రం ఒక్కసారిగా అదేమీ లేకుండా దూకుడుగా నోట్‌ను ఆమోదించిందని కొణతాల విమర్శించారు.
 
 గతంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కలసినపుడు మంత్రు ల కమిటీ వేస్తామని ప్రధాని చెప్పారని, కానీ అదేమీ లేకుండా నోట్‌ను ఆమోదించారని ఆయన అన్నారు. నోట్ రావడానికి ముందు మంత్రుల కమిటీ వేయకుండా ఇపుడు నోట్‌ను ఆమోదించి విభజన ప్రక్రియ కోసం మంత్రుల బృందాన్ని (జీఓఎం)ను నియమించడం దారుణమని ఆయన అన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా తక్షణం రాష్ట్ర శాసనసభను ప్రత్యేకంగా సమావేశపర్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని కొణతాల గట్టిగా డిమాండ్ చేశారు. ఆ తరువాత  ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని అన్నారు. అదే విధంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి లోక్‌సభలో ఉన్న 25 మంది సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించాలని అపుడు ఈ విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం రావణకాష్టం కావడానికి కిరణ్‌దే పూర్తి బాధ్యత అని కొణతాల ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రం 2011లో భావించినపుడే సీఎం స్పందించి ఉంటే బాగుండేదన్నారు.
 
 లేఖ వెనక్కి తీసుకో బాబూ: ఢిల్లీ దీక్షలో ఒక్క రోజుకే నీరసపడిపోయారంటున్న చంద్రబాబు తన జీవితం ప్రజలకు అంకితం చేస్తానని చెబుతున్నారని, అయితే అంత అవసరం లేదని, రాష్ట్ర విభజనకు తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే చాలని, అపుడు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని కొణతాల అన్నారు. చంద్రబాబు తాను సమైక్యం కోసం దీక్ష చేస్తానని అంటారేమోనని తామంతా భావించామని, కానీ దురదృష్టవశాత్తూ పొరబాటున కూడా ఎక్కడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక్క మాట కూడా ఆయన అనడం లేదని విమర్శించారు. బాబు చాలా జాగ్రత్తగా, పొందిగ్గా ఇపుడు రెండు కళ్ల సిద్ధాంతానికి బదులు ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు కొడుకులకు ఆస్తి ఎలా పంచాలనే విషయమే మాట్లాడుతున్నారు తప్ప సమైక్యంగా ఉండాలని చెప్పడం లేదన్నారు.
 
 అప్పుడేమయ్యారు దిగ్విజయ్..?
 దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు చాలా ఆప్తుడనీ, జగన్ తనకు కుమారుడిలాంటి వాడని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని కొణతాల విమర్శించారు. వైఎస్ పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టినపుడు, ఆయన కుమారుడు జగన్‌పై కేసులు పెట్టి జైల్లో నిర్బంధించినపుడు దిగ్విజయ్ ఏమయ్యారని కొణతాల సూటిగా ప్రశ్నించారు. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేసిందని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోతుందని, అలాగే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించడానికిగానీ, కలిపి ఉంచడానికిగాని కేంద్రానికి అధికారం ఉందంటే దానర్థం విభజించవచ్చనే కాదు కదా? రాష్ట్రాన్ని కలిపి ఉంచవచ్చు కూడా కదా అని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement