
‘తెలంగాణకు సాయం చేస్తే మద్దతిస్తాం’
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ వెల్లడించింది.
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ వెల్లడించింది. తెలంగాణకు సహాయం చేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని లోక్‌సభలో టీఆర్‌ఎస్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ‘పీటీఐ’తో చెప్పారు. ‘తెలంగాణకు ఎప్పుడు మేలు చేసినా మేము ఎన్డీఏ వెంట ఉంటాం. మా రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎన్డీఏతో ఉండబోమ’ని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సరైన సమయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈలోపు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరోవైపు విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని నిజామాబాద్ ఎంపీ కె. కవిత అంతకుముందు తెలిపారు. ‘జాతీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటార’ని ఆమె చెప్పారు.