ఈ దొంగ కోటీశ్వరుడు.. | Sakshi
Sakshi News home page

ఈ దొంగ కోటీశ్వరుడు..

Published Mon, Jun 20 2016 6:39 PM

The thief found - police Shock at the sight of money extortion

- 6 కిలోల బంగారం
- రూ.5 కోట్ల వజ్రాలు
- రూ.2 కోట్ల డబ్బు
బంజారాహిల్స్

ఆరు కిలోల బంగారు ఆభరణాలు.. రూ.5 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు.. రూ.2 కోట్ల నగదు.. మొత్తం 28 దొంగతనాలు.. ఇదీ గజదొంగ కర్రి సతీష్‌రెడ్డి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరి చేసిన సొత్తు. పోలీసుల దర్యాప్తులో విస్మయం గొలిపే కేసులు వెలుగు చూసున్నాయి. విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి 2007లో మొదలుపెట్టి.. 2013 వరకు స్థానికంగానే దొంగతనాలకు పాల్పడ్డాడు. 2014లో మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. సంపన్నులు నివాసం ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీ హరిహరన్ నివాసంలో మొట్టమొదటి దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో రూ.5కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొంగిలించి 2016 వరకు దొరక్కుండా పోలీసులకు సవాల్ విసిరాడు.

 సూర్యాపేట పోలీసులకు ఇటీవల సతీష్ చిక్కడంతో ఈ దొంగతనం కేసులన్నీ వెలుగు చూశాయి. బంజారాహిల్స్‌పోలీస్‌స్టేషన్ పరిధిలోనే మొత్తం ఎనిమిది ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రోడ్ నంబర్ -12లోని ఎమ్మెల్యేకాలనీలో నాలుగు దొంగతనాలు చేశాడు. మొత్తం 13 దొంగతనం కేసుల్లో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై చిట్టా రూపొందించారు.

ఇక జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసుల్లో నిందితుడు. చోరీ చేసిన సొత్తును వైజాగ్‌లో ఓ రిసీవర్‌కు ఇచ్చేవాడు. అడ్డికి పావుశేరు చందంగా సదరు రిసీవర్ ఈ దొంగ తెచ్చిన సొత్తులో పావుశాతానికి ధర కట్టి మిగతాది నొక్కేసేవాడు. ముఖ్యంగా ఖరీదైన వజ్రాలకు లేకుండానే నొక్కేసినట్లు తేలింది.

పోలీసులతో చెట్టాపట్టాల్...
దొంగతనాల్లో ఆరితేరిన సతీష్ పోలీసులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాడు. వైజాగ్‌లో ఓ ఏఎస్‌ఐతో సంబంధాలు పెట్టుకొని చోరీలకు పాల్పడ్డట్లు తేలడంతో ఆ ఏఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. తరచూ దొంగతనాలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న సతీష్‌ను జనజీవన స్రవంతిలో కలపాలని ఏలూరుకు చెందిన ఓ సీఐ చేరదీశాడు. తన పోలీసు జీపుకు డ్రై వర్‌గా పెట్టుకున్నాడు.

ఓ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో ఆ సీఐ కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపి వస్తూ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మనవరాలు ఇంటికే కన్నం వేశాడు. చోరీ చేసిన సొత్తును పోలీస్ జీపులోనే వేసుకొని పరారయ్యాడు. అంతేకాదు మొన్న సూర్యాపేటలో కారు దొంగతనం చేసి, తిరిగి ఆ కారును పెట్టే క్రమంలో పోలీసు జీపు సైరన్ విని వారిని తప్పించుకునే క్రమంలో పక్కింట్లోకి దూకాడు. ఊరికే ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో ఆ ఇంటికి కూడా కన్నం వేసి బంగారు ఆభరణాలు తస్కరించాడు. పోలీసులను తప్పించుకునే క్రమంలోనూ సతీష్ దొంగతనాలకు పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వాహనానికి ప్రెస్...
సతీష్ తన హోండా ఆక్టీవా వాహనానికి ప్రెస్ అని స్టికర్ తగిలించుకున్నాడు. దీంతో పోలీసులు ఎక్కడా ఆపేవారు కాదు. దొంగతనాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆ బైక్‌ను తీసుకెళ్లేవాడుకాదు. ఎక్కడ దొంగతనం చేసినా ఆటోలో వెళ్లడం అలవాటు. అంతేకాదు అర్ధరాత్రి ఒంటిగంటకు తెరిచి ఉన్న కిటికీలను లక్ష్యంగా చేసుకునేవాడు. తనతోపాటు తెచ్చుకునే మూడు పనిముట్లతో కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించి గ్లౌజ్‌లు తొడక్కొని చోరీలకు పాల్పడుతూ ఒక్క ఆధారం కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం సతీష్ అలవాటు.

ఈ ఘరానా దొంగకు సెంటిమెంటు కూడా ఎక్కువే. ఎక్కడ దొంగతనానికి వెళ్లినా తెల్లవారుజామున 4 గంటలకు చోరీ చేసిన వస్తువులతో ఆ ఇంట్లో నుంచి బయట పడతాడు. ముందే చోరీ వస్తువులు మూటకట్టుకున్నా సరే 4గంటలయ్యే వరకు అక్కడే ఉండిపోవడం ఇతడి సెంటిమెంట్ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.

 

Advertisement
Advertisement