పోరాడుతున్నందునే టార్గెట్ చేస్తున్నారు

పోరాడుతున్నందునే టార్గెట్ చేస్తున్నారు - Sakshi


* వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన

* నన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూస్తున్నారు...

* టీడీపీలో ఉన్నపుడు నా భాష బాగుందా, ఇపుడు బాగా లేదా!

* ఇరుపక్షాల క్లిప్పింగ్‌లు విడుదల చేస్తే వాస్తవాలు తెలుస్తాయి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాధిత మహిళల తరపున, ప్రజల తరపున శాసనసభలో గట్టిగా పోరాడుతున్నందునే తనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని, సర్వనాశనం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆవేదన వ్యక్తం చేశారు.



పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, విశ్వాసరాయి కళావతితో కలిసి రోజా మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తినపుడల్లా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ముందుకు తెస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను అసెంబ్లీలో లేకపోయినా, అంతకుముందు జరిగిన గొడవలో తానున్నానని, సభా హక్కుల తీర్మానంలో తన పేరును చేర్చారని ఆమె గుర్తు చేశారు.



కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే ప్రకటనపై తొలి వక్తగా తానే మాట్లాడబోతున్నానని తెలిసి అడ్డుకునేందుకు ముందుగానే తనను సభకు రాకుండా ఏడాది పాటు సస్పెండ్ చేశార న్నారు. సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానన్నారు. మూడు రోజుల తరువాత టీడీపీ ఎమ్మెల్యే అనితతో కంట తడి పెట్టించి తానేదో దళితులను అవమానం చేసినట్లుగా సృష్టించడం సరికాదని, వాస్తవానికి అసెంబ్లీలో వాళ్లు (టీడీపీ) తనను తిట్టిన తిట్లకు తానెంతగానో బాధపడ్డానన్నారు.



శాసనసభ కార్యక్రమాల్లో రెండు వైపులా (అధికార, ప్రతిపక్షాల వైపు) జరుగుతున్న దృశ్యాలన్నింటినీ బయటకు విడుదల చేస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయని ఆమె అన్నారు. అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నవి జరుగుతున్నట్లే చూపించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘ప్రజా సమస్యలపై ప్రతిపక్షం చేసే పోరాటాన్ని చూపించరు. ప్రజా సమస్యలపై మేం ప్రదర్శించే ప్లకార్డులు చూపించరు. నినాదాలు చేస్తే వినిపించరు. సమస్యలపై మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే చూపించరు’ అని ఆమె వివరించారు.



కానీ వారు (టీడీపీ) ఉచ్చులో ఇరుక్కున్నపుడు మాత్రం తప్పించుకోవడానికి తమకు చెందిన రెండు, మూడు క్లిప్పింగ్‌లు చూపించి మా ప్రవర్తన బాగోలేదంటూ ప్రచారం చేస్తారని రోజా అన్నారు. మహిళలను, ఎస్సీ, ఎస్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే స్థాయికి చంద్రబాబు దిగజారి పోయారన్నారు.

 

అసెంబ్లీ కాదది ఎన్టీఆర్ భవన్

రాష్ట్ర శాసనసభ ఎన్టీఆర్ భవన్ (టీడీపీ కార్యాలయం) మాదిరిగా తయారైందని, ప్రజా సమస్యలు చర్చించే వేదికలాగా అది కనిపించడం లేదన్నారు. తమను కొత్తగా అసెంబ్లీకి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీ నేతలు ఎలాంటి నీచమైన భాష వాడుతున్నారో ఇప్పటికి జరిగిన నాలుగు సమావేశాలను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ‘మిమ్మల్ని పాతేస్తాను’ అని నిందించారని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేలు చూపిస్తూ ‘మీ అంతు చూస్తాను.



నాతో పెట్టుకున్న వారెవ్వరూ బతికి బట్ట కట్టలేదు...’ అని బెదిరించిన విషయాలను గుర్తు చేశారు. ‘నా భాష బాగోలేదని, నా హావభావాలు బాగో లేవని అంటున్నారే... పదేళ్లు మీ పార్టీ (టీడీపీ)లో పోరాటాలు చేసినపుడు, పనిచేసినపుడు ఇదే భాష, ఇవే హావభావాలున్నాయి. అపుడు బాగున్నవి, ఇపుడెందుకు బాగాలేవు’ అని రోజా ప్రశ్నించారు.



అనిత కంట తడిపెట్టిందంటున్న వారికి కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌లో రుణాలు చెల్లించని మహిళలను బౌన్సర్లు లాక్కెళుతూ ఉంటే.. వారు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్లు కనిపించలేదా? నారాయణ విద్యాసంస్థల్లో పద్నాలుగు మంది విద్యార్థులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల కన్నీళ్లు కనిపించలేదా? రిషితేశ్వరిని పోగొట్టుకున్న అమ్మానాన్నలు విలపించడం కనిపించలేదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.



సభా సంప్రదాయాలను వల్లె వేసే టీడీపీ నేతలు ఎన్టీఆర్ వంటి మహానుభావుని కుర్చీని లాక్కుని ఆయనను కనీసం అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేయలేదా? ఆయన అవమాన భారంతో అసెంబ్లీ నుంచి ఏడుస్తూ వెళ్లి మానసిక క్షోభకు గురై చనిపోవడానికి కారకులు వీరు కాదా? అని ఆమె నిలదీశారు. కల్తీ మద్యం తాగి మరణించిన వారి భార్యలు పుస్తెలు తెగిపోయి విలపించడం గానీ, పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా మృతి చెందిన 25 మంది కుటుంబాలు విలపించడంగానీ కనిపించడం లేదా అని రోజా ప్రశ్నించారు.



వీరందరి సమస్యలపై గళమెత్తుతున్నానని తనను ఆడ రౌడీ  అనడం సబబేనా? అన్నారు. మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటూ చంద్రబాబు కాలకేయుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు భార్య, కోడలికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, రాష్ట్రంలో మహిళల కన్నీళ్లు ఆ కుటుంబానికి మంచివి కావని, వారి ఉసురు ఆ కుటుంబానికి తగులుతుందని రోజా అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top