ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు | Sakshi
Sakshi News home page

టీడీపీలో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు: కరణం బలరాం

Published Sat, May 20 2017 8:35 AM

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు - Sakshi

- వేమవరం జంట హత్యలపై ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు
- డబ్బు సంపాదనకే రవికుమార్ టీడీపీలోకి వచ్చాడు
- ఆ దొంగసొమ్ము సంగతి సీఎం చంద్రబాబే చెప్పాలి
- వేరేపార్టీ నుంచి వచ్చి మాపై పెత్తనం చేస్తే సహించాలా?


హైదరాబాద్:
అధికార తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలకు, ఫిరాయింపుదారులకు మధ్య తలెత్తిన వర్గపోరులో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో వివాహ వేడుకకు హాజరై వస్తోన్న వారిపై ప్రత్యర్థులు దాడిచేసి, ఇద్దరిని కిరాతకంగా చంపేశారు.

మృతులు గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావులు ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులుకాగా, దాడి చేసింది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులని సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనతో రాష్ట్రం యావత్తూ ఒక్కసారిగా ఒలిక్కిపడింది. తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో వేమవరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ప్రకటించారు.

కాగా, ఈ హత్యాకాండపై టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం 'సాక్షి'తో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్.. డబ్బు సంపాదన కోసమే టీడీపీలోకి చేరారని కరణం ఆరోపించారు. "ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు. మేం సంయమనం పాటిస్తున్నా రెచ్చగొడుతూనేఉన్నాడు. అసలు అతను(గొట్టిపాటి) టీడీపీలో చేరిందే సంపాదించుకోవడానికి. గ్రానైట్ క్వారీలకు సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.230 కోట్లు ఎగ్గొట్టాడు. ఆ దొంగసొమ్ము సంగతేంటో సీఎం చంద్రబాబు నాయుడే చెప్పాలి. సరే, పార్టీలోకి వచ్చాడు, ఆయన సంపాదన సంగతేదో చూసుకోకుండా మాలాంటి సీనియర్లపట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? నేనే కాదు, ఏ కార్యకర్తా ఇలాంటి వ్యవహారాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు' అని కరణం తీవ్రస్వరంతో చెప్పారు.

వైరివర్గం దాడిలో మృతి చెందిన గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావుల మృతదేహాలను శనివారం ఉదయం కరణం బలరాం సందర్శించారు. గాయాలతో చికిత్స పొందుతున్న నలుగురిని పరామర్శించారు. ఈ హత్యాకాండపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement