మూడు నెలల్లో భర్తీ చేయండి | Supreme court orders to Telangana government on teachers recruitment | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో భర్తీ చేయండి

Mar 25 2017 2:34 AM | Updated on Sep 2 2018 5:28 PM

మూడు నెలల్లో భర్తీ చేయండి - Sakshi

మూడు నెలల్లో భర్తీ చేయండి

తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 8,700 ఉపాధ్యాయ పోస్టులను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

- ప్రభుత్వ టీచర్‌ పోస్టులపై రాష్ట్రానికి సుప్రీం ఆదేశం
- భర్తీకి చర్యలు, మౌలిక వసతులపై అఫిడవిట్‌ ఇవ్వాలని
- ఏపీకి సూచన.. విచారణ జూలై 24కు వాయిదా


సాక్షి, న్యూఢిల్లీ:
తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 8,700 ఉపాధ్యాయ పోస్టులను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ ఆదేశాలను మాండమస్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల భర్తీకి తీసుకుంటున్న చర్యలు, మౌలిక వసతుల ఏర్పాటు చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల లేమిపై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది నెలలుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ అంశంపై మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తరఫున రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కౌల్‌ ధర్మాసనానికి అఫిడవిట్‌ అందజేశారు. 371డి, ఇతర సాంకేతిక కారణాలతో ఇబ్బందుల్లేకుండా పాత జిల్లాల లెక్కల ప్రకారమే టీచర్ల పోస్టులను భర్తీచేస్తామనిఅందులో వివరించారు. ఈ భర్తీ ప్రక్రియను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి అప్పగించామని తెలిపారు.

అయితే భర్తీకి ఎన్ని రోజులు పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా... 6 నెలల సమయం పడుతుందని, 8,700 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నామని న్యాయవాది వివరించారు. దీనిపై నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ అభ్యంతరం చెప్పారు. ఖాళీ పోస్టుల సంఖ్య 16 వేల వరకు ఉన్నా... తక్కువగా చూపిస్తున్నారని, ఆరు నెలలు అంటే విద్యా సంవత్సరం సగం పూర్తవుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మూడు నెలల్లో సుమారు 8,700 టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని, ఈ ఆదేశాలను మాండమస్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement