‘రాయల’ రగడ.. | Protest to Rayala Telangana | Sakshi
Sakshi News home page

‘రాయల’ రగడ..

Dec 5 2013 3:30 AM | Updated on Sep 6 2018 3:01 PM

రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ జిల్లాల్లో బుధవారం పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. టీఆర్‌ఎస్ పిలుపు మేరకు పది జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు జరిగాయి.

తెలంగాణ జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు
సాక్షి, నెట్‌వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ జిల్లాల్లో బుధవారం పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. టీఆర్‌ఎస్ పిలుపు మేరకు పది జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు జరిగారుు.  టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. వరంగల్ జిల్లా మానుకోటలో తెలంగాణవాదులు రైలు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలో ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్, సిరిసిల్లలో కళాశాలల విద్యార్థులతో టీఆర్‌ఎస్ భారీర్యాలీ నిర్వహించింది.
 
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో నిరసనలు హోరెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాల్కొండ, బాన్సువాడ, డిచ్‌పల్లి, జుక్కల్‌తోపాటు 36 మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ పిలుపు మేరకు  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ర్యాలీలు నిర్వహించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  నల్లగొండలో  కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయగా, కోర్టు ఎదుట న్యాయవాదులు  రాస్తారోకో నిర్వహించారు.  

సూర్యాపేటలో టీఆర్‌ఎస్, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేపై రాస్తారోకో చేశారు. పీడీఎస్‌యూ (విజృంభణ) ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి  కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చేవెళ్లలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ ఆందోళనలో పాల్గొన్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement