పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకొనేందుకు న్యాయస్థానానికి అభ్యం తరం లేదని...
స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకొనేందుకు న్యాయస్థానానికి అభ్యం తరం లేదని, అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అప్పటివరకు యథాతథంగా ఉమ్మడి సర్వీసు నిబంధనలను రూపొం దించుకోవడం సాధ్యం కాదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తేనే ఉమ్మడి సర్వీసు నిబంధనలు సాధ్యమని పేర్కొంది.
ఈ వ్యవహారంలో బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. తమకు ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు సమానంగా సర్వీసు నిబంధనలు కల్పించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి సర్వీసు నిబంధనలను వర్తింపజేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందుకు హైకోర్టు సమ్మతించలేదు.
దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు బుధవారం విచారణకు రాగా తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుల తరపున న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, సురేందర్‌రావు వాదనలు వినిపించారు. తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాది పి.పి.రావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. ఈ కేసుపై ధర్మాసనంలోని ఇద్దరు సభ్యులం ఒక నిర్ధారణకు వస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.