పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులను పొందడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పర్యావరణ అనుమతులకోసం ప్రయత్నాలను మెచ్చుకున్న ప్రధాని
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులను పొందడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నెలనెలా నిర్వహించే ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు దీనికి హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా భూముల రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని, భూముల రికార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రధాని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సమర్థంగా అమలు చేసేందుకు ఇది అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌర సేవలను అందించేందుకు ఆన్‌లైన్ వినియోగంపై ఈ సందర్భంగా ప్రధాని ఆరా తీశారు. జిల్లా స్థాయి వరకు ఎన్ని సేవలు ప్రజలకు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజా విజ్ఞప్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. అరవై రోజుల వ్యవధిలోనే ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు.