లగ్జరీకి మాంద్యం లేదు | no rescission for luxuries | Sakshi
Sakshi News home page

లగ్జరీకి మాంద్యం లేదు

Nov 28 2013 1:47 AM | Updated on Sep 2 2017 1:02 AM

లగ్జరీకి  మాంద్యం లేదు

లగ్జరీకి మాంద్యం లేదు

మాంద్యం మధ్య తరగతికే తప్ప మాకు కాదంటున్నారు శ్రీమంతులు. అందుకు తగ్గట్టే మామూలు కార్ల అమ్మకాలు కుదేలవుతుండగా... లగ్జరీ కార్ల అమ్మకాలు జిగేల్‌మంటున్నాయి.

 మాంద్యం మధ్య తరగతికే తప్ప మాకు కాదంటున్నారు శ్రీమంతులు. అందుకు తగ్గట్టే మామూలు కార్ల అమ్మకాలు కుదేలవుతుండగా... లగ్జరీ కార్ల అమ్మకాలు జిగేల్‌మంటున్నాయి. బైక్‌ల మార్కెట్‌దీ ఇదే తీరు. సాధారణ బైక్‌ల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నా... లగ్జరీ బైక్‌ల అమ్మకాలు మాత్రం అనూహ్యంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటివి దిగువ, ఎగువ మధ్యతరగతి కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నా... లగ్జరీ బ్రాండ్లపై అదేమీ లేకపోవటంతో బీఎండబ్ల్యూ మోటరాడ్, ట్రంఫ్, తదితర అంతర్జాతీయ లగ్జరీ బైక్‌లు భారత్‌పై కన్నేశాయి.
 
 ప్రపంచవ్యాప్తంగా టూవీలర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న మార్కెట్లలో మనదొకటి. ఇండియాలో ఏటా 1.4 కోట్ల టూ వీలర్లు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మొత్తం బైక్‌ల విక్రయాల్లో లగ్జరీ బైక్‌ల వాటా 2% కన్నా తక్కువే. కానీ ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 500 సీసీ కంటే అధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న లగ్జరీ బైక్‌ల అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. గత ఆర్నెళ్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ లగ్జరీ బైక్‌ల అమ్మకాలు బాగా పెరగటంతో పాటు చిన్న నగరాల్లో కూడా జోరందుకున్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 14% వృద్ధి సాధించిన టూ వీలర్ల అమ్మకాలు 2012-13లో 3% తగ్గాయి. కానీ గడిచిన మూడేళ్లుగా 200-500 సీసీ బైక్‌ల అమ్మకాలు 35% చొప్పున వృద్ధి చెందాయి. ఈ అంచనాతోనే అమెరికా, యూరప్‌లలోని బైక్ కంపెనీలు కూడా భారత్‌వైపు చూస్తున్నాయి.
 
 హార్లేదే అగ్రస్థానం....
 భారత లగ్జరీ బైక్ మార్కెట్లో హార్లే డేవిడ్సన్‌దే అగ్రస్థానం. దీంతో పాటు ఇటలీకి చెందిన డుకాటి, జపాన్‌కు చెందిన సుజుకి, హోండా, యమహా, కవాసకి, దక్షిణ కొరియాకు చెందిన హ్యోసంగ్ కంపెనీలూ తమ బైక్‌లను విక్రయిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ట్రంఫ్ కంపెనీ గురువారం తొలిసారిగా పలు లగ్జరీ బైక్‌లను మన మార్కెట్లోకి తెస్తోంది. బైక్‌ల ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.22 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం. కవాసకి కంపెనీ స్పోర్ట్స్ బైక్‌లను బజాజ్ ఆటోయే విక్రయిస్తోంది. ఇక బీఎండబ్ల్యూ మోటరాడ్ కంపెనీ టీవీఎస్ మోటార్స్‌తో కలిసి లగ్జరీ బైక్‌లను విక్రయించడానికి సిద్ధమయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్  కాంటినెంటల్ జీటీని మార్కెట్లోకి తెచ్చింది. త్వరలో 750 సీసీ కాఫీ రేసర్‌ను కూడా తేబోతోంది.
 ఎవరు కొంటున్నారు..: తాజా సర్వే ప్రకారం... రూ.10 లక్షల వార్షిక వేతనాన్ని మించిన వ్యక్తులు ఈ లగ్జరీ బైక్‌లను కొంటున్నారు.  లక్ష డాలర్లకు పైగా సంపద ఉన్న కుటుంబాలు భారత్‌లో 30 లక్షల వరకూ ఉంటాయని, అమెరికా తర్వాత ఆ స్థాయి సంపన్న కుటుంబాలున్నది ఇక్కడేనని సర్వే చెప్పింది.
 
 హార్లే చౌక బైకులు..
 హార్లే డేవిడ్సన్.. 250-300 సీసీ సెగ్మెంట్లో సైతం బైక్‌లను తేవాలనుకుంటోంది. ఇక్కడ లభ్యమయ్యే కొన్ని విడిభాగాలనుపయోగించి ఇక్కడే బైక్‌లను తయారు చేయడం ద్వారా వాటిని తక్కువ ధరకే ఇవ్వవచ్చన్నది కంపెనీ వ్యూహాం. వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటంతో పాటు మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. భారత మార్కెట్లోకి తేనున్న రెండు చౌక బైక్‌లు-స్ట్రీట్ 750, స్ట్రీట్ 500లను మిలన్ ఆటో షోలో హర్లే డేవిడ్సన్ ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 -12 వరకూ ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలోనూ వీటిని ప్రదర్శించనుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ  బైక్‌ల ధర రూ.4.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement